ETV Bharat / state

బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు.. కొత్త డేట్​ ఇదే

author img

By

Published : Mar 25, 2023, 11:17 AM IST

Updated : Mar 25, 2023, 2:45 PM IST

Sit Notices to Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్​ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని అందులో తెలిపారు.

Bandi Sanjay
Bandi Sanjay

Sit Notices to Bandi Sanjay: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఒకే మండలానికి చెందిన 50మందికి పైగా అభ్యర్థులకు 100మార్కులు దాటాయని ఆయన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలివ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ నెల 21న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 24వ తేదీన సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. కానీ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నందున సిట్ కార్యాలయానికి రాలేనని బండి సంజయ్ లేఖ రాశారు.

దీంతో సిట్ అధికారులు మరో నోటీసు జారీ చేశారు. రేపు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాను ఉన్నప్పడు వచ్చి నోటీసులివ్వాలని.. లేని సమయంలో వచ్చి నోటీసులు గోడకు అంటించి వెళ్లడం ఏంటని బండి సంజయ్ సిట్ అధికారిని అడిగారు. నిబంధనల ప్రకారమే నోటీసులు అంటించి వెళ్లామని సిట్ అధికారి గంగాధర్ ఆయనకు వివరణ ఇచ్చారు. సిట్ నోటీసులపై న్యాయ సలహా తీసుకున్న తర్వాతే తగిన నిర్ణయం తీసుకునే యోచనలో బండి సంజయ్ ఉన్నారు.

మరోవైపు నిన్న బండి సంజయ్​ సిట్ అధికారులకు లేఖ రాశారు. తనకు సిట్‌ కార్యాలయం నుంచి ఎలాంటి నోటీసు రాలేదని.. అందులోని విషయాలు తాను చూడలేదని వివరించారు. సిట్ ఎదుట తాను హాజరు కావాల్సింది ఉందని వార్తా కథనాల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎంపీగా పార్లమెంట్‌కు హాజరు కావాల్సిన బాధ్యత తనకుందని అన్నారు. సమావేశాల దృష్ట్యా సిట్‌ విచారణకు తాను రాలేనని అన్నారు. దీనిపై హాజరుకు మరో తేదీ ఇవ్వాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్​ లేఖ మేరకు సిట్​ అధికారులు రేపు విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. సిట్ అధికారుల విచారణకు రేవంత్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. టీఎస్​పీఎస్సీ పరీక్షాపత్రం లీకేజీ వ్యవహారంలో భాగంగా గ్రూప్‌-1 పేపర్‌ అంశంపై ఆయన పలు ఆరోపణలు గుప్పించారు. వీటిపై వివరణ ఇవ్వాలని సిట్ నోటీసులు అందించారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.

కేటీఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం: సిట్​ విచారణ అనంతరం మాట్లాడిన రేవంత్​రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. టీఎస్​పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆక్షేపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్‌దేనని.. కానీ జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై కూడా సిట్​ చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణలో మంత్రి వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌కు వివరించినట్లు తెలిపారు. నేరస్థులను విచారించకుండానే పూర్తి సమాచారాన్ని కేటీఆర్‌ చెప్పారని.. ఆయన సమాచారం ఎందుకు సేకరించలేదని ఆయన ప్రశ్నించారు.

ఇవీ చదవండి: నాకు ఎలాంటి నోటీసు రాలేదు.. విచారణకు హాజరుకాలేను: సిట్​కు బండి లేఖ

హామీల అమలు పర్యవేక్షణ విధానమేంటో చెప్పాలి: హైకోర్టు

'OBCలను అవమానించారు'.. రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా

Last Updated : Mar 25, 2023, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.