ETV Bharat / state

మెడకు 'చైనా మాంజా' ఉచ్చు - ప్రాణాలను గాలిలో కలిపేస్తున్న గాలిపటం సరదా

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2024, 7:29 PM IST

China Manja Death's in Telangana 2024
china manja

China Manja Death's in Telangana 2024 : గాలిపటం సరదా మనుషుల ప్రాణాలను గాలిలో కలిపేస్తోంది. పతంగులు ఎగరేసేందుకు చైనా మాంజాను విక్రయించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నా యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. ఇప్పటికైనా చైనా మాంజా విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

మెడకు 'చైనా మాంజా' ఉచ్చు - ప్రాణాలను గాలిలో కలిపేస్తున్న గాలిపటం సరదా

China Manja Death's in Telangana 2024 : చైనా మాంజాతో రాష్ట్రవ్యాప్తంగా పలు విషాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జవాన్‌గా పని చేస్తున్న కోటేశ్వర రావు శనివారం రాత్రి ఇంటి నుంచి తాను పని చేసే కార్యాలయానికి వెళ్తుండగా, మాంజా దారం మెడకు చుట్టుకుని తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. యాదాద్రిలోని మెట్లదారి వద్ద గాలిపటం చైనా దారం తగిలి ఆలయంలో పని చేసే హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంనకు గాయమైంది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్‌పల్లిలో సంక్రాంతి పండుగ పూట పెను విషాదం నెలకొంది. ఇంటిపై పతంగి ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో శివ కుమార్‌ అనే యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ తరహా ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశముందని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.

పతంగి నింపిన విషాదం - మాంజా చుట్టుకుని జవాన్, గాలిపటం ఎగరేస్తూ మరో నలుగురి మృతి

మాంజా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. అయినా మార్కెట్‌లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. నైలాన్, సింథటిక్‌ దారానికి గాజు, ప్లాస్టిక్‌ పొడి పూసి మాంజా తయారు చేస్తారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా సంక్రాంతికి చైనా మాంజా విక్రయాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో సొంతంగా ఇక్కడే తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిబంధనలు బేఖాతరు.. చైనా మాంజా విక్రయాలు.. పలుచోట్ల ప్రమాదాలు

పాతబస్తీ సహా శివారు ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల్లో చైనా మాంజాను తయారు చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తున్నారు. గతేడాది సంక్రాంతికి పోలీసులు 28 కేసులు నమోదు చేశారు. తాజాగా కంచన్‌బాగ్‌, మంగళ్‌హాట్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని కొన్ని చోట్ల తనిఖీలు చేసిన పోలీసులు, 18 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి వెయ్యి బెండళ్ల చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. సాధారణ దారాల మాటునే అన్ని దుకాణాల్లో ఈ చైనా మాంజా విక్రయిస్తున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నా, గుట్టుగా అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి.

చైనా మాంజా విక్రయం.. ఎల్బీనగర్‌ జోన్‌లో 28 కేసులు

గాలి పటాలు ఎగరేసినప్పుడు తెగిపోయిన మంజా దారాలు చెట్లు, కరెంట్‌ తీగలు, స్తంభాలు, ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి. పక్షులు ఎగిరివచ్చి వాటిలో చిక్కుకుపోయి మృత్యువాతపడుతున్నాయి. అందులో అరుదైన పక్షులు ఉంటున్నాయని, మాంజా కారణంగా కొన్ని జాతులు అదృశ్యమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చైనా మాంజా వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

బీ అలర్ట్​... అక్కడ పతంగులు ఎగిరేస్తే జైలుకేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.