ETV Bharat / state

తెలంగాణ అంకురం మొదటి సంస్థగా చరిత్ర లిఖించింది: కేసీఆర్‌

author img

By

Published : Nov 26, 2022, 8:17 PM IST

KCR Congratulate Dhruva Space And Skyroot: పీఎస్‌ఎల్వీసీ-54 రాకెట్ ప్రయోగ విజయంపై సీఎం కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఉపగ్రహాలను పంపిన ‘ధృవ’ స్పేస్‌టెక్ సంస్థను అభినందించారు. ప్రైవేట్ సంస్థలు ఉపగ్రహాలు పంపడం గొప్ప చరిత్ర అని పేర్కొన్నారు. తెలంగాణ అంకురం మొదటి సంస్థగా చరిత్ర లిఖించిందని కేసీఆర్ చెప్పారు.

KCR congratulates Dhruva Space and Skyroot Aerospace
KCR congratulates Dhruva Space and Skyroot Aerospace

KCR Congratulate Dhruva Space And Skyroot: తెలంగాణకు చెందిన ప్రైవేట్ స్పేస్ టెక్ సంస్థ ‘ధృవ’ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో ఉపగ్రహాలు విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీసీ54తో పాటు ధృవ అంకురం పంపిన తైబోల్ట్ 1, తైబోల్ట్ 2 నానో ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా పేర్కొన్నారు. ఇది ప్రైవేట్ రంగంలోని ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజయమని కేసీఆర్ అన్నారు.

టీహబ్ సభ్య సంస్థ అయిన స్కైరూట్ అంకురం ఇటీవలే ప్రయోగించిన విక్రమ్-ఎస్ ఉపగ్రహ వాహకనౌక విజయవంతం కావడం ద్వారా.. దేశ ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ అంకురం మొట్టమొదటి సంస్థగా చరిత్ర లిఖించిందని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రయోగాలతో భారత అంతరిక్షరంగంలో హైదరాబాద్ అంకురసంస్థలు ద్వారాలు తెరిచాయని అన్నారు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ రాకెట్​ల ప్రయోగానికి విక్రమ్-ఎస్.. తైబోల్ట్ 1, తైబోల్ట్ 2 ప్రయోగాల విజయం శుభారంభాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటాయి: విజయం సాధించిన రెండు ప్రయోగాలు తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటాయని సీఎం కేసీఆర్ కొనియాడారు. రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలతో స్టార్టప్స్ సిటీగా హైదరాబాద్​కు ఉన్న విశిష్టత రెట్టించిందని అన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితీయడం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టీహబ్.. భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్ళు సాధిస్తాయనే నమ్మకం ఉందని చెప్పారు.

ఇది ఆరంభం మాత్రమే: ఇది ఆరంభం మాత్రమేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీహబ్ ప్రోత్సాహంతో తమ స్టార్టప్ సంస్థల ద్వారా ఉపగ్రహాలను రూపొందించి వాటిని విజయవంతంగా ప్రయోగించి.. తెలంగాణ కీర్తిని చాటిన స్కైరూట్, ధృవ స్పేస్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత తమ మేధోసంపదను దేశ ప్రగతికోసం వెచ్చించి.. భారతదేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుంది: తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ భారతదేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ, యువకులకు.. వారి అద్భుతమైన ఆలోచనకు అంకురాల ద్వారా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాల్లో ఔత్సాహికులైన యువతీ, యువకుల ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తున్న యువనేత, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్​ను, ఉన్నతాధికారులను, టీహబ్ సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.

ఇవీ చదవండి: నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌... ప్రయోగం విజయవంతం

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రతాప్ గౌడ్​ను 8గంటల పాటు విచారించిన సిట్

'హిందీ భాషను మాపై రుద్దొద్దు'.. నిప్పంటించుకుని 85 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.