ETV Bharat / state

Kishan Reddy on National Highways: రాష్ట్ర రహదారులకు రూ.91,511 కోట్లు

author img

By

Published : Feb 19, 2022, 3:32 PM IST

Updated : Feb 20, 2022, 5:05 AM IST

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy on National Highways: తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రంలో కీలక మార్పు రీజినల్ రింగ్‌రోడ్డు ద్వారా జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం జాతీయ రహదారుల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆయన వెల్లడించారు.

'తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత'

Kishan Reddy on National Highways: అమెరికా సంపన్న దేశం కావడానికి అక్కడ అద్భుత రహదారులే కారణమని.. దేశంలోనూ కేంద్ర సర్కారు పెద్దఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతోందని, అందులో తెలంగాణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి (పీఎం సడక్‌ యోజన కాకుండా) కేంద్రం రూ.91,511 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. శనివారమిక్కడ నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కమిటీ నివేదించడంతోనే కేంద్రం చేపట్టలేదని.. కానీ తామే సొంతంగా నిర్మించుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకామాట నిలబెట్టుకోలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

32 జిల్లా కేంద్రాలకు ఎన్‌హెచ్‌ల అనుసంధానం..

‘‘రాష్ట్రంలో పెద్దపల్లి మినహా 32 జిల్లా కేంద్రాల్ని జాతీయ రహదారులతో అనుసంధానించాం. 2014లో మోదీ ప్రధాని కావడానికి ముందు రాష్ట్రంలో జాతీయ రహదారులు 2511 కిలోమీటర్లే. ఆ తర్వాత ఏడేళ్లలోనే మరో 2,483 కి.మీ. నిర్మించిన ఘనత కేంద్రానిది. ఇప్పటికే పూర్తయిన రోడ్లకు రూ.31,624 కోట్లు వ్యయం చేశాం. నడుస్తున్న ప్రాజెక్టులకు రూ.12,019 కోట్లు, మంజూరైన వాటికి రూ.15,113 కోట్లు, పీఎం గతిశక్తి ప్రాజెక్టు, సూపర్‌ ఇన్ఫర్మేషన్‌ హైవేకు రూ.32,755 కోట్లు. మొత్తం రూ.91,511 కోట్లు. ఇంకా ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి రూ.9,164 కోట్లు, సీఆర్‌ఐఎఫ్‌ రాష్ట్ర రోడ్ల పనులకు రూ.3,314 కోట్ల మొత్తాన్ని కేంద్రం ఖర్చు చేయనుంది.

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిని వేగవంత ప్రయాణం, ప్రమాదాలు లేకుండా.. సూపర్‌ ఇన్ఫర్మేషన్‌ రహదారిగా అభివృద్ధి చేయబోతున్నాం. దీన్ని 4 నుంచి 6 వరుసలకు విస్తరిస్తారు. రూ.4,750 కోట్లతో డీపీఆర్‌ తయారవుతోంది.

భూసేకరణ చేపట్టాలి..

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి అడుగు పడింది. ఉత్తర భాగానికి సంబంధించిన డీపీఆర్‌ తయారైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయితే రాష్ట్ర ప్రగతి ముఖచిత్రం మారుతుంది. లక్షల ఉద్యోగాలు రావచ్చు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఆర్‌ఆర్‌ఆర్‌ లోపల ఉంటుంది. దేశంలోనే అద్భుతమైన రహదారి. ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చే బహుమతి ఇది. దీని నిర్మాణంలో 4.85 కోట్ల పనిదినాలు లభిస్తాయి. భవిష్యత్తులో 8 వరుసలకు విస్తరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ యూనిట్లు ఏర్పాటు చేయాలి.

మొత్తం 84 గ్రామాలు. 158.64 కిమీ రోడ్డు నిర్మాణం. ప్రాజెక్టు వ్యయం రూ.9,164 కోట్లు. 1904 హెక్టార్లు భూమి సేకరిస్తారు. రూ.2,120 కోట్ల ఖర్చు అంచనా. మొత్తం ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం. నిర్మాణవ్యయం అంతా కేంద్రం భరిస్తుంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందని అన్నారు. కేంద్రంపై కేటీఆర్‌ విమర్శల్ని విలేకరులు ప్రస్తావించగా.. వాళ్లది (తెరాస) రాజకీయం.. తమది(భాజపా) అభివృద్ధి ఎజెండా అని బదులిచ్చారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కృష్ణప్రసాద్‌, భాజపా నేతలు చింతల రామచంద్రారెడ్డి, ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.

.
.

ఇదీ చూడండి: రాష్ట్రానికి నిజాం నగలు తేవడానికి అభ్యంతరం లేదు... కానీ : కిషన్‌రెడ్డి

Last Updated :Feb 20, 2022, 5:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.