ETV Bharat / state

జంతువుల్లో కరోనా పరీక్షలకు ప్రత్యేక పద్ధతులు

author img

By

Published : May 9, 2021, 9:48 AM IST

జంతువులకు కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక పద్దతులను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని సెల్యూలర్ అండ్ మాలిక్కులర్ బయాలజీ మాజీ డైరెక్టర్ రాకేశ్​ మిశ్రా అన్నారు. వైరస్‌ అనేది ఏ జీవికైనా సోకే అవకాశముందని పేర్కొన్నారు. జంతువులతో కొత్త వైరస్‌ రకాలు పుట్టుకొస్తే మనుషులకు అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
CCMB is developing special methods for corona testing in animals
జంతువుల్లో కరోనా పరీక్షలు

జంతువుల్లో కరోనా వైరస్‌ పరీక్షలు ఏవిధంగా చేయాలనే దానిపై ప్రత్యేక విధానాలు(స్టాండర్‌ ఆఫ్‌ ప్రొసిజర్స్‌) రూపొందిస్తున్నామని.. త్వరలోనే వాటిని సెంట్రల్‌ జూ అథారిటీకి పంపుతామని సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌, సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర తెలిపారు. వన్యప్రాణుల నోటి నుంచి లాలాజలం, ముక్కు నుంచి స్రావాలను సేకరించి పరీక్ష చేయడం అంత సులువు కాదని.. జంతువుల మలం సేకరించి వాటి ద్వారా కరోనా పరీక్షలు చేపట్టే పద్ధతుల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ జూలో సింహాలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. వైరస్‌ అనేది ఏ జీవికైనా సోకే అవకాశముందని రాకేశ్ మిశ్రా అన్నారు. దీన్ని ఆదిలోనే నియంత్రించాలని సూచించారు. లేకపోతే వైరస్‌లకు కేంద్రంగా ఉండే జంతువులతో కొత్త వైరస్‌ రకాలు పుట్టుకొస్తే మనుషులకు అది మరింత ప్రమాదకరం అన్నారు. మాస్క్‌లు, పీపీఈ కిట్లు రహదారులపై పడేయడం అనాగరికమని.. పారేసిన మాస్క్‌లను జంతువులు తినడం, మూతితో తాకే అవకాశం ఉందన్నారు. పెంపుడు జంతువులకు కరోనా లక్షణాలుండి పాజిటివ్‌గా తేలితే వాటిని దూరంగా విడిగా ఉంచడం, ముట్టుకోకపోవడమే మంచిదని సూచించారు. ప్రస్తుతం దేశంలో బి.1.617 (డబుల్‌ మ్యుటెంట్‌), బి.1.1.7(యూకే వేరియంట్‌) ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్ర, ఆంధ్రా, తెలంగాణ, మరికొన్ని ప్రాంతాల్లో డబుల్‌ మ్యుటెంట్‌ వ్యాప్తిలో ఉంటే.. పంజాబ్‌లో యూకే రకం ఎక్కువగా ఉందని, ఇది ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందన్నారు.

ఇదీ చదవండి: గ్రామాల్లో విరుచుకుపడుతున్న కొవిడ్​ వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.