KTR On Sports: కోళ్లలాగా కుక్కుతున్నారు.. ప్రతి పాఠశాలలో క్రీడలు తప్పనిసరి: కేటీఆర్

author img

By

Published : Jan 12, 2022, 7:29 AM IST

sub committee on sports

KTR On Sports: క్రీడాసంఘాలకు సంబంధించిన పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలయ్యాయని..ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదన్న ఆయన... తాను కూడా క్రీడా పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటించారు. క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. క్రీడా పాలసీ దేశానికే ఆదర్శంగా నిలవాలన్న కేటీఆర్... ప్రాథమిక విద్య నుంచే ఈ పాలసీ అమలుకావాలన్నారు.

KTR On Sports: కోళ్లలాగా కుక్కుతున్నారు.. ప్రతి పాఠశాలలో క్రీడలు తప్పనిసరి: కేటీఆర్

KTR On Sports: రాష్ట్రంలో క్రీడారంగ సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. బేగంపేటలోని హారితప్లాజాలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్‌, సబితా, ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సమావేశంలో క్రీడాపాలసీలో రూపొందించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

క్రీడా పాలసీ తీసుకురావాలి..

దేశానికే ఆదర్శవంతమైన క్రీడా పాలసీ తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న కేటీఆర్‌... విద్యార్థులకు చదువుతోపాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తప్పనిసరన్నారు. హైదరాబాద్‌లో ఆట స్థలాలు లేవని.. పిల్లలను కోళ్ల ఫారాల్లో కోళ్ల లాగా కుక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి... ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు, యాక్టర్లు, ఇంజినీర్లు ఎలా అవుతారని ప్రశ్నించారు.

అవసరమైతే ఓ సబ్జెక్ట్​గా క్రీడలు..

sub committee on sports policy: గ్రామ, పట్టణ, నగర స్థాయిలో ఆటలపై అవగాహన పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సూచించారు. ఆటల పరికరాలు, మైదానాలు, స్టేడియాల నిర్మాణం జరగాలని.. హాకీ, క్రికెట్ వంటి ఆటల మీద దృష్టి పెట్టి... ఒక మోడల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఆటలకు సంబంధించిన కమిటీలు ఏం చేస్తున్నాయని రాష్ట్ర ఒలింపిక్‌ కమిటీని ప్రశ్నించారు. ప్రైవేటురంగంలో స్పోర్ట్స్ వర్సిటీలను ప్రోత్సహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రీన్ బడ్జెట్‌లా, స్పోర్ట్స్ బడ్జెట్‌ పెడతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మంచి క్రీడాకారులు రావాలంటే ఆటల పరికరాలు యువతకు ఇవ్వాలని.. ప్రతి పాఠశాలలో క్రీడలను తప్పనిసరి చేయాలన్నారు. అవసరమైతే ఒక సబ్జెక్ట్‌గా అభివృద్ధి పరచాలని సూచించారు. క్రీడా సంస్థలు పెడితే వాళ్లకు మన క్రీడా విధానం వల్ల మాత్రమే లాభం జరగాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.

వచ్చే సమావేశం నాటికి క్రీడా పాలసీ
Srinivas goud on sports policy: క్రీడా పాలసీకి సంబంధించి పలువురు క్రీడాకారులు, కోచ్‌లు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతల సలహాలు సూచనలను తీసుకున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి ఒక మంచి క్రీడా పాలసీని రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో మంత్రి కేటీఆర్‌ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.