ETV Bharat / state

BRS Foundation Day: 23వ వసంతంలోకి BRS.. తెలంగాణభవన్​లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

author img

By

Published : Apr 27, 2023, 7:02 AM IST

BRS Foundation Day Celebration in Hyderabad: భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న గులాబీ పార్టీ మరో వసంతంలోకి అడుగుపెట్టింది. నేటితో 22 ఏళ్లు పూర్తి చేసుకొని ఇరవై మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి.. పలు జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.

BRS
BRS

నేటితో 22 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్...

BRS Foundation Day Celebration in Hyderabad: గులాబీ పార్టీ ఇరవై రెండేళ్లు పూర్తి చేసుకుంది. రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా పురుడుపోసుకొని.. దేశంలో గుణాత్మక మార్పు కోసమంటూ భారత రాష్ట్ర సమితిగా మారిన పార్టీ... ఆవిర్భావ దినాన్ని ఇవాళ జరుపుకుంటోంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జనరల్ బాడీ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశానికి సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నారు.

BRS Party Meeting in Hyderabad: కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి.. జనరల్ బాడీ సమావేశాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఆహ్వానించిన ఇతర ముఖ్య నేతలు హాజరయ్యే ఈ సమావేశంలో.. పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదిస్తారు. ఏటా ఆవిర్భావ దినం సందర్భంగా ప్లీనరీ, సభ నిర్వహించే గులాబీ పార్టీ.. ఈ ఏడాది భిన్నంగా జరుపుతోంది. ప్లీనరీకి బదులుగా అక్టోబరు 10న వరంగల్‌లో మహాసభ జరపనున్నట్లు పార్టీ ప్రకటించింది.

పలు కార్యక్రమాలకు పార్టీ పిలుపు: రాష్ట్రంలో వరికోతలు, ఎండ తీవ్రత వల్ల ఇవాళ విస్తృత స్థాయి సమావేశం, సభ నిర్వహించడం లేదని తెలిపింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నందున.. ప్రతి కార్యకర్తను కదిలించేలా.. ప్రజలకు చేరువయ్యేలా పలు కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతోంది.

ఆత్మీయ సమ్మేళనాల సందడి: గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో కొంతకాలంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల సందడి నెలకొంది. ఆవిర్భావ దినోత్సవం నాటికే ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయాలని గతంలో దిశానిర్దేశం చేసిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. మే నెలాఖరు వరకు జరపుకోవచ్చని చెప్పారు. ఆవిర్భావ దినం సందర్భంగా తొలిసారి నియోజకవర్గాల స్థాయిలో మినీ ప్లీనరీలను నిర్వహించింది. ఈ నెల 25న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా సభలను జరిపింది.

కేటీఆర్ దిశానిర్దేశం మేరకు వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి, విద్య-ఉపాధి, బీజేపీ వైఫల్యాలతో పాటు స్థానిక అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించారు. నియోజకవర్గాల స్థాయిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేలా ఈ కార్యక్రమాలు జరిగాయి.

ఇవీ చదవండి: CM KCR: 'మహారాష్ట్ర జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి'

Minister's assurance to farmers: కర్షకుల కన్నీటి గోస.. ఆదుకుంటామని మంత్రుల భరోసా

'రాహుల్​ గాంధీ కేసు నేను విచారించను'.. తప్పుకున్న గుజరాత్​ హైకోర్టు జడ్జి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.