ETV Bharat / state

BRS Counter Attack On Modi Speech : 'ప్రధాని బెదిరింపులు, ఉడత ఊపులకు భయపడేది లేదు'

author img

By

Published : Jul 8, 2023, 8:02 PM IST

BRS Reaction On Modi Speech : ప్రధాని మోదీ వరంగల్‌కు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కాకుండా వ్యాగన్‌ రిపేర్‌ షాప్‌ ఇచ్చారంటూ రాష్ట్ర మంత్రులు దుయ్యబట్టారు. కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించి.. తెలంగాణకు ద్రోహం చేశారంటూ విమర్శించారు. రాష్ట్ర పర్యటనలో ప్రధాని పచ్చి అబద్ధాలు చెప్పారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా.. అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు.

BRS Counter Attack On Modi Speech : 'ప్రధాని బెదిరింపులు, ఉడత ఊపులకు భయపడేది లేదు'
BRS Counter Attack On Modi Speech : 'ప్రధాని బెదిరింపులు, ఉడత ఊపులకు భయపడేది లేదు'

BRS Counter Attack On Modi Speech : 'ప్రధాని బెదిరింపులు, ఉడత ఊపులకు భయపడేది లేదు'

BRS Ministers Comments On Modi Speech : ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్ర పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల అని.. మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. గుజరాత్‌కు ప్రధాని రూ.20 వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారని.. రాష్ట్రంలో మాత్రం రూ.520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం ప్రజలను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. 9 ఏళ్లలో యువత కోసం ప్రధాని చేసిన ఒక్క మంచి పనైనా చెప్తే బాగుండేదన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీనే అన్నారు. కేంద్ర పరిధిలోని 16 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్న కేటీఆర్‌.. 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన తమపై నిందలా అంటూ నిలదీశారు.

బిల్లును ఆమోదించకుండా వర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్‌ ఆపుతున్నారని.. బిల్లులను అడ్డుకుంటున్న గవర్నర్‌కు ప్రధాని ఒక మాట చెబితే బాగుండేదంటూ మంత్రి కేటీఆర్​ చురకలు అంటించారు. గిరిజన వర్సిటీని కేంద్రం అడ్డుకొంటుందని.. అడవి బిడ్డలపై ప్రధాని కపట ప్రేమ చూపిస్తున్నారంటూ దుయ్యబట్టారు. బయ్యారం ఫ్యాక్టరీ గురించి ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు.

KTR Comments On Modi Speech : తెలంగాణ తమ కుటుంబం... రాష్ట్ర ప్రజలే తమ కుటుంబ సభ్యులు అంటూ పునరుద్ఘాటించారు. కేంద్ర ఏజెన్సీలను బూచిగా చూపి భయపెట్టాలని చూస్తోందని.. ప్రధాని బెదిరింపులు, ఉడత ఊపులకు మేం భయపడమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉత్త చేతులతో వచ్చి వెళ్లడం మోదీకి అలవాటే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను గుజరాత్​కు తరలింపు : రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను మోదీ గుజరాత్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని.. మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో పోడు భూముల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీర్‌రావు పాల్గొన్నారు. దిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమేంటని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

''కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్‌ను తిట్టిపోతున్నారు తప్ప.. రాష్ట్రానికి ఏం చేయడం లేదు. తెలంగాణలో పనులు, అభివృద్ధి జరగకపోతే మాకు దిల్లీలో వివిధ శాఖలకు అవార్డులు ఎందుకు ఇస్తున్నారు. తెలంగాణకు అదనపు నిధులు కాదు కదా.. హక్కుగా రావాల్సిన నిధులనూ ఆపేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. కోచ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ ఫ్యాక్టరీని ఇచ్చింది మోదీ ప్రభుత్వం. కోచ్ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల నిధులు వచ్చేవి. వ్యాగన్ ఫ్యాక్టరీతో రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారు.'' - మంత్రి హరీశ్‌రావు

కాళేశ్వరంలో అవినీతిపై విచారణ జరిపించవచ్చు కదా : తెలంగాణకు, వరంగల్‌కు కేంద్రం ఇచ్చిందేమీ లేదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి అని మూడేళ్లుగా చెప్తున్నారని.. కేంద్రం విచారణ జరిపించి నిరూపించవచ్చు కదా? అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరంతో మొత్తం ఉత్తర తెలంగాణకు సాగునీరు అందుంతుందన్నారు. మోదీ ఊకదంపుడుకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ స్థాయిని తగ్గించుకొని.. తెలంగాణపై, సీఎం కేసీఆర్ మీద అబద్ధాలు చెబుతూ అక్కసు వెళ్లగకక్కారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

Jagadish Reddy Counter On Modi Speech : అవినీతిలో బీజేపీ.. కాంగ్రెస్​ను మించి పోయిందని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చేది మోదీ సర్కారని.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేసిందన్నారు. బీజేపీ విధానాల వల్లే భారత్‌ ఇంకా అభివృద్ధి చెందలేదని మంత్రి తెలిపారు. ప్రధాని పర్యటనను బహిష్కరించాలని ముందే పిలుపు ఇచ్చిన బీఆర్​ఎస్ నేతలు.. ఆ మేరకు మోదీపై సైతం విమర్శలు సంధించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.