ETV Bharat / state

BJP Latest News in Telangana : 'ఎన్నికల ముందు బీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది..?'

author img

By

Published : Jul 23, 2023, 10:27 AM IST

BJP Meeting At Nampally : 'అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీసీ అధ్యక్షుడిని మార్చి ఓసీని అధ్యక్షుడిగా నియమించారు. ఇలా మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది..?' అంటూ కొందరు మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీ జాతీయ నాయకులను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అధిష్ఠానం ప్రకటన చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల కార్యాచరణలో భాగంగా బీజేపీ రాష్ట్ర ఇంఛార్జులు శనివారం మాజీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్మన్లతో సమావేశం నిర్వహించగా.. స్థానిక నేతలు వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.

BJP
BJP

Election In-charge Meeting With BJP Leaders In Telangana : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీసీ అధ్యక్షుడిని మార్చి ఓసీ వర్గానికి చెందిన నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం.. ఎంత వరకు కరెక్టని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు సునీల్‌ బన్సల్‌, ప్రకాశ్‌ జావడేకర్‌లను కొందరు బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఇలా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ జాతీయ నాయకత్వాన్ని నిలదీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇస్తేనే.. కేసీఆర్‌ను గద్దె దింపగలమని వారికి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అధిష్ఠానం ప్రకటన చేయాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల కార్యాచరణలో భాగంగా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు శనివారం పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్మన్లతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై సునీల్‌ బన్సల్‌, ప్రకాశ్‌ జావడేకర్‌లు రాష్ట్ర నాయకులతో చర్చించారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. 100 రోజుల కార్యాచరణతో పని చేసేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ సమావేశంపై విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రానున్న ఎన్నికల్లో మాజీ ప్రజాప్రతినిధులు పాత్ర ఎక్కువగా ఉండాలని సూచించారు. వారు ప్రజల్లో బాగా తిరిగేందుకు.. అలాగే పార్టీకి అధిక సమయం కేటాయించేందుకు సిద్ధంగా ఉండాలని జావడేకర్‌ సూచించారు.

BJP Poll In-Charge Meet In Hyderabad : గతంలో మాజీ ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో విజయం సాధించిన అనుభవం ఉండడంతో.. ప్రజల్లో ఉన్న పట్టును పార్టీకి ఉపయోగపడేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం జాతీయ నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులు అనేక ప్రశ్నలు సంధించారు. ఎన్నికలకు 100 రోజుల సమయం మాత్రమే ఉందని అంటున్నారు.. మరి అభ్యర్థుల ఎంపికలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎన్నికలకు 20 రోజులు ముందు అభ్యర్థిని ప్రకటిస్తే.. వారు నియోజకవర్గాల్లో ఎలా ప్రచారం చేస్తారో చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు నియోజకవర్గ అభ్యర్థులను వేగంగా ఖరారు చేస్తున్నాయని.. ఇప్పటికైనా పార్టీ అభ్యర్థి ఎవరో కనీసం ఆ నాయకుడి చెవిలో అయినా చెప్పాలని కోరారు. ఇన్‌ఛార్జీల బాధ్యతల పేరుతో తమను వేరే నియోజకవర్గాలకు వెళ్లమని చెబుతున్నారని.. మరి సొంత నియోజకవర్గాల పరిస్థితి ఏంటని నిలదీశారు.

పాత, కొత్త కలయికతో పని చేద్దాం : పాత, కొత్త తేడా లేకుండా కలిసి పని చేద్దామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వారికి సూచించారు. స్థానిక సమస్యలు, పింఛన్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇలా చాలా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. సీనియర్‌, జూనియర్‌ అందరినీ కలుపుకొని పోతానని స్పష్టం చేశారు. ఎన్నికలు అయ్యే వరకు హైదరాబాద్‌లో ఇళ్లు తీసుకొని ఉంటానని ఎన్నికల ఇన్‌ఛార్జి జావడేకర్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.