ETV Bharat / state

23 సీట్లపై బీజేపీ ఫోకస్ ​- గెలుపు లెక్క ఈ సంఖ్యతోనే షురూ కావాలని పక్కా వ్యూహం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 11:52 AM IST

BJP Focus on Telangana Election 2023 : తెలంగాణలో బీజేపీకి 23 సంఖ్య కలిసి రానుందా. ఏంటి ఈ 23 సంఖ్య అని ఆలోచిస్తున్నారా.. ఈ శాసనసభ ఎన్నికల్లో 23 స్థానాలను గెలవాలని కాషాయ పార్టీ అధిష్ఠానం వ్యూహం రచిస్తోంది. అందుకు ఆ పార్లమెంటు సెగ్మెంట్​లను వాడుకుంటూ ముందుకు సాగిపోవాలని కేంద్ర నాయకత్వం సూచించింది. ఇప్పుడు ఆ పార్టీ 23 స్థానాలు గెలవడానికి కమలదళం ప్లాన్​ ఏంటో చూద్దామా?

Telangana BJP Election Strategy
BJP Focus on Telangana Election 2023

BJP Focus on Telangana Election 2023 : తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ గెలుపు 23తో మొదలవ్వాలని పార్టీ అధినాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకుపోతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్​ స్థానంలో మాత్రమే కమలం పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన లోక్​సభ ఎన్నికల్లో మాత్రం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని సాధించి.. ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలనూ కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో(Telangana BY Elections) దుబ్బాక, హుజూరాబాద్​ స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మాత్రం 23 స్థానాల్లో తప్పనిసరిగా గెలుపు జెండా ఎగురవేయాలని కాషాయ పార్టీ తహతహలాడుతోంది.

Telangana BJP Election Strategy : గత లోక్​సభ ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన చోట్ల పట్టు నిలుపుకొనేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అప్పుడు వచ్చిన ఆధిక్యతను గెలుపుగా మార్చుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక(BJP Election Plan)ను రూపొందించి.. అమలు చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో అమలు చేసిన బూత్​ స్థాయి వ్యూహాన్నే.. బీజేపీ నేతలు పాటిస్తున్నారు.

అందులో భాగంగా ఆయా సెగ్మెంట్ల​లో ప్రతి ఓటరును కలవడం, కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిని వివరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయం, ఇంకా అనేక అంశాలపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. వీటితో పాటు వీటికి ఆనుకుని ఉన్న స్థానాలను కవర్​ చేసేలా జాతీయ నేతలు ప్రచారానికి(BJP Central Leaders Campaign) అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా చేస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాష్ట్ర నాయకత్వానికి అవసరమైన సూచనలు అందిస్తున్నారు.

అధికార బీఆర్ఎస్​కు దీటుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్న విపక్షాలు రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్న నేతలు

కీలకంగా మారిన ఆ లోక్​సభ నియోజకవర్గాలు :

  • గత కరీంనగర్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్​, వేములవాడ, చొప్పదండి, మానకొండూరులలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడ ఎంపీగా గెలిచిన బండి సంజయ్​.. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయి.. ఇప్పుడు కరీంనగర్​ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. వేములవాడలో వికాస్​ రావుకు, చొప్పదండిలో బొడిగె శోభ, మానకొండూరులో మోహన్​కు బీజేపీ అధినాయకత్వం టికెట్లు ఇచ్చింది.
  • ఆదిలాబాద్​ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఆదిలాబాద్​, నిర్మల్​, బోథ్​, ముథోల్​లో ఆధిక్యం సంపాదించింది. ఇక్కడే గెలిచిన ఎంపీ సోయం బాపురావును ఇప్పుడు బోథ్​ ఎమ్మెల్యేగా, నిర్మల్​ నుంచి మహేశ్వర్​రెడ్డి, ముథోల్​ నుంచి రామారావును పోటీలోకి దింపింది. ఆదిలాబాద్​లో గత ఎన్నికల అభ్యర్థి పాయల్​ శంకర్​ను సైతం బరిలోకి నిలిపింది.
  • అలాగే నిజామాబాద్​ లోక్​సభ నియోజకవర్గంలోని కోరుట్ల, నిజామాబాద్​ గ్రామీణం, బాల్కొండ, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ఆధిక్యం సాధించగా.. ఎంపీగా ధర్మపురి అర్వింద్​ గెలిచారు. అయితే ప్రస్తుతం ఆయణ్ను కోరుట్ల నుంచి పోటీలో నిలుపుతున్నారు. ఆర్మూరులో రాకేశ్​రెడ్డి, బాల్కొండలో అన్నపూర్ణమ్మ, నిజామాబాద్​ గ్రామీణంలో దినేశ్​ కుమార్​లను పోటీలో ఉంచారు.
  • మరోవైపు సికింద్రాబాద్​ ఎంపీగా గెలిచిన కిషన్​రెడ్డి కేంద్ర మంత్రి పదవి పొందారు. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో జీహెచ్​ఎంసీ పరిధిలోని అంబర్​పేట, ఖైరతాబాద్​, సికింద్రాబాద్​, సనత్​నగర్​, ముషీరాబాద్​ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. అలాగే గోషామహల్​లో పూర్తిస్థాయిలో ఆధిక్యతను బీజేపీ దక్కించుకుంది. ఈసారి కూడా అవే ఫలితాలు రావాలని పార్టీ ముఖ్య నేతలు కిషన్​ రెడ్డి, కె.లక్ష్మణ్​ స్వయంగా రంగంలోకి దిగారు.
  • మహబూబ్​నగర్​ పార్లమెంటు పరిధిలో కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. మహబూబ్​నగర్​, మక్తల్​లో అప్పట్లో పార్టీ మంచిగానే రాణించింది. ఆ పట్టును నిలుపుకునేందుకు జలంధర్​రెడ్డి, మిథున్​రెడ్డిలకు టికెట్లు ఇచ్చి రంగంలోకి దించింది.

కీలకంగా మారనున్న ఆ మూడు నియోజకవర్గాలు : ప్రస్తుతం గోషామహల్​, దుబ్బాక, హుజూరాబాద్​లో మళ్లీ అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. దుబ్బాక టికెట్​ బీజేపీ అధిష్ఠానం ప్రకటించకముందు నుంచి రఘునందనరావు తన ప్రచారాన్ని కొనసాగించారు. హుజూరాబాద్​లో వరుసగా గెలుచుకుని వస్తున్న.. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్​ గెలుపునకు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్​ను గజ్వేల్​లో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. మరోవైపు గోషామహల్​ నుంచి రాజాసింగ్​ మూడోసారి గెలిచేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసి.. ముందుకు వెళ్తున్నారు. ఈ మూడు స్థానాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి.

అధికార పార్టీ లోపాలే అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు

అవినీతి పాలన అంతం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి : ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.