ETV Bharat / state

Bandi Sanjay: 'బీఆర్​ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవం.. కానీ'

author img

By

Published : Apr 23, 2023, 1:13 PM IST

Bandi Sanjay Reacts on Etela-Revanth Issue: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీఆర్​ఎస్​కు వేసినట్లే అని తాము ఎప్పట్నుంచో చెబుతున్నామని.. అదే నిజమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్​ఎస్ సాయం చేస్తోందని అన్నారు. నేరుగా రేవంత్‌రెడ్డి డబ్బులు తీసుకున్నారని ఈటల అనలేదన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్​ఎస్ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Reacts on Etela-Revanth Issue: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు బీఆర్​ఎస్​ రూ.25 కోట్లు ఇచ్చిందనే ఈటల రాజేందర్‌ ఆరోపణలు.. మాటల యుద్ధానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌-బీజేపీ నేతలు పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్‌-బీజేపీ మధ్య రాజుకున్న ఈ కోట్ల కొట్లాట తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో తాజాగా బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ట్యాంక్​బండ్ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు.

నిన్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయానికి ప్రతి ఒక్కరూ రావాలన్న తన కోరిక నెరవేరిందని సంజయ్ అన్నారు. తన పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారన్న బండి.. రేవంత్​రెడ్డి పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నట్టున్నాడని పేర్కొన్నారు. రూ.25 కోట్లు నేరుగా రేవంత్ రెడ్డికి ఇచ్చారని ఈటల రాజేందర్ ఎక్కడా అనలేదన్నారు.

'మునుగోడులో కాంగ్రెస్‌ నేతలు డబ్బులు తీసుకున్నారని ఎప్పట్నుంచో చెప్తున్నాం. నేరుగా రేవంత్‌రెడ్డి డబ్బులు తీసుకున్నారని ఈటల అనలేదు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే అన్నారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్​ఎస్ పార్టీ ఆర్థికసాయం చేస్తోంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీఆర్​ఎస్​కు వేసినట్లే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్​ఎస్ కలిసి పోటీ చేస్తాయి.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

నేరుగా రేవంత్‌రెడ్డి డబ్బులు తీసుకున్నారని ఈటల అనలేదు: సంజయ్‌

కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవం: మునుగోడు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలే.. బీఆర్​ఎస్ నుంచి డబ్బులు అందినట్లు చెప్పారని, అదే విషయాన్ని బీజేపీ ఎప్పట్నుంచో ఆరోపిస్తోందని బండి సంజయ్ అన్నారు. బీఆర్​ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమని సంజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే అతిక్ హైమద్ లాంటి గూండా చనిపోతే ఎంఐఎం సంతాప సభలు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. అతిక్ హైమద్ మరణంపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్పందించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణకు బీఆర్​ఎస్, ఎంఐఎం పార్టీలు అవసరమా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

లింగాయత్​లను బీసీలలో చేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉంది: అంతకుముందు.. సంఘ సంస్కర్త, మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలు ట్యాంక్ బండ్​పై ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని బసవేశ్వరుడి విగ్రహానికి నివాళులు అర్పించారు. లింగాయత్​లకు కేంద్రంలోని బీజేపీ పెద్ద పీట వేస్తోందని లక్ష్మణ్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో 17 శాతం జనాభా ఉంటే.. వారికి ఎక్కువ సీట్లు కేటాయించామని చెప్పారు. లింగాయత్​లను బీసీల్లో చేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.