ETV Bharat / state

ఏప్రిల్ 15న వరంగల్​లో నిరుద్యోగ మార్చ్

author img

By

Published : Apr 10, 2023, 7:09 PM IST

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించింది. దీనిపై ఉమ్మడి జిల్లాల వారిగా నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. ఏప్రిల్ 15న నిరుద్యోగులతో వరంగల్​లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.

bandi sanjay comments on brs government
ఏప్రిల్ 15న వరంగల్​లో నిరుద్యోగ మార్చ్

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీపై ఉమ్మడి జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని భాజపా అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు ఈనెల (ఏప్రిల్) 15న వేలాది మంది నిరుద్యోగులతో వరంగల్​లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని, రాష్ట్రంలో జరిగే పరీక్షల్లోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని బండి ఆరోపించారు.

పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనను అరెస్టు చేసిన పోలీసులు తన ఫోన్ కోసం ఎందుకు వెతుకుతున్నారని ప్రశ్నించారు. తన ఫోన్ పోలీసులే దొంగిలించారని, వరంగల్ సీపీ రంగనాథ్ కాల్ లిస్టు బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తన ఫోన్ ముఖ్యమంత్రి వద్దకు చేరిందని, అందులో బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోన్ కాల్ చూసి ముఖ్యమంత్రికి నిద్రపట్టడం లేదని బండి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవలేని ప్రభుత్వం విశాఖ స్టీల్ పరిశ్రమలో బిడ్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించారు.

జిల్లాలవారీగా మార్చ్​: హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీఎస్‌పీఎస్సీ పేపరు లీకేజీపై పార్టీ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది. దీనికి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగా జిల్లాల వారీగా నిరుద్యోగులతో కలిసి నిరుద్యోగ మార్చ్ చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత హైదరాబాద్​లో నిరుద్యోగ మార్చ్ చేయాలనే ఆలోచన చేశారు.

పేపర్ లీకేజీ: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఏప్రిల్ 4న లీకేజీ జరిగింది. హనుమకొండలోని కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్​లో బయటకు వచ్చింది. పేపరు లీకేజీ ఘటనలో ప్రధాన సూత్రధారిగా బండి సంజయ్​ను భావించి, ఏ1గా పేర్కొంటూ పోలీసులు బండి సంజయ్‌పై నేరపూరిత కుట్ర, మోసం, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. ఈయన అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. తర్వాత సంజయ్ బెయిల్​పై విడుదలయ్యారు. తనను ఇబ్బంది పెట్టడానికి తప్పుడు కేసులు పెట్టారని బండి సంజయ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణకు, రిమాండ్ రద్దుపై హైకోర్టు ఏప్రిల్ 21కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.