ETV Bharat / state

'ఆ ఒక్క కారణంతో కేసును సీబీఐకి బదిలీ చేయడం చట్టబద్ధం కాదు'

author img

By

Published : Jan 10, 2023, 8:20 PM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసు
ఎమ్మెల్యేలకు ఎర కేసు

ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రభుత్వ అప్పీలుపై హైకోర్టులో నేడూ వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరఫున ఆన్​లైన్​లో వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి దుశ్యంత్ దవే.. సీఎం వీడియోలను చూపారన్న కారణంగా కేసును సీబీఐకి బదిలీ చేయడం చట్టబద్ధం కాదన్నారు. తనకు జ్వరం ఉన్నందున ఈ నెల 18న వాదనలు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును కోరగా.. రేపు వాదనలు ముగించేందుకు ప్రయత్నించాలని ధర్మాసనం దవేకు సూచించింది.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానాలే కాపాడాలని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రభుత్వ అప్పీలుపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం వద్ద ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి దుశ్యంత్ దవే దిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్ర పన్నిందని దుశ్యంత్ దవే వాదించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను భాజపా కూలుస్తోందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తాము నియమించిన గవర్నర్ల ద్వారా వెంటనే బల పరీక్షకు పిలిచి ప్రభుత్వాలను పడగొడుతున్నారని కోర్టుకు తెలిపారు. సీఎం వీడియోలను చూపారన్న కారణంగా కేసును సీబీఐకి బదిలీ చేయడం చట్టబద్ధం కాదని దుశ్యంత్ దవే వాదించారు.

కేసు నమోదైన కొన్ని రోజుల తర్వాత సీఎం మీడియా సమావేశం నిర్వహించారని దుశ్యంత్​ దవే తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలన్నీ భాజపాపై ఉన్నాయన్నారు. అలాంటప్పుడు భాజపా ప్రభుత్వం పరిధిలో ఉన్న సీబీఐకి కేసు బదిలీ చేస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయన్నారు. తనకు జ్వరం ఉన్నందున సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 18న వాదనలు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని దుశ్యంత్ దవే హైకోర్టును కోరారు. అప్పటి వరకు సీబీఐ దర్యాప్తుపై యథాతథస్థితి కొనసాగించాలని కోరారు. సీబీఐ దర్యాప్తు చేయదని హామీ ఇచ్చిన హైకోర్టు.. రేపు వాదనలు ముగించేందుకు ప్రయత్నించాలని దవేకు సూచించింది.

రేపటికి వాయిదా..: మూడు పిటిషన్లలో తనకు నోటీసు ఇవ్వకుండా.. వాదనలు వినకుండానే సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు. సీబీఐకి బదిలీ అంశంపై మిగతా పిటిషన్​లలో వాదనలు వినిపించారు కదా.. ఇబ్బందేమిటని రోహిత్‌రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. దేశంలోని అత్యున్నత స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై ఆరోపణలు తగదని తుషార్ తరఫు న్యాయవాది సంజయ్ వాదించారు. వీడియోలను సీఎం బయట పెట్టిన తర్వాతే పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాయని.. నిందితులపై నేరం రుజువు కాకముందే నేరస్థులుగా ముద్ర వేశారన్నారు. సీఎం పరిధిలో పని చేసే రాష్ట్ర పోలీసులు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరని వాదించారు. ఆన్‌లైన్‌లో దవే వాదనలు కొనసాగించేందుకు విచారణను రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు.

ఇవీ చూడండి..

సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదన్నట్లే: రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. దర్యాప్తునకు సీబీఐ రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.