ETV Bharat / state

Dasoju: 'హెచ్‌సీయూకి పట్టిన పీడ విరగడైంది'

author img

By

Published : Jun 8, 2021, 9:56 PM IST

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప సంచాలకుల పదవి నుంచి ప్రొ. అప్పారావు తొలగింపుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రొ. అప్పారావు తొలగింపుతో యూనివర్సిటీలో అణిచివేత, అధికార దుర్వినియోగానికి చరమగీతం పాడినట్లయిందన్నారు.

sravan
sravan

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప సంచాలకుల పదవి నుంచి ప్రొ. అప్పారావు తొలగింపుతో హెచ్‌సీయూకి పట్టిన పీడ విరగడైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. ప్రొ. అప్పారావు తొలగింపుతో యూనివర్సిటీలో అణిచివేత, అధికార దుర్వినియోగానికి చరమగీతం పాడినట్లయిందని ఆయన పేర్కొన్నారు. అప్పారావు అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, ఆర్ధిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

హెచ్‌సీయూ వీసీ తొలగింపు, అమరుడైన విద్యార్ధి రోహిత్ వేములకు న్యాయం కోసం పోరాటం చేస్తున్న మద్దతుదారుల విజయంగా అభివర్ణించారు. రోహిత్ వేముల ఆత్మహత్యానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నప్పటికీ... కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ న్యాయం కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు. అప్పారావు హయాంలో తెలంగాణ బిడ్డలకు తీరని అన్యాయం జరిగిందని, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

అర్హత ఉన్న తెలంగాణ బిడ్డలని పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం స్థానికేతరులకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. వీసీ పదవికి అప్పారావు మాయని మచ్చ అని, యూనివర్సిటీ నియమ, నిబంధనలను తుంగలో తొక్కి రాజ్యంగబద్ద రిజర్వేషన్లు సైతం అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. రోస్టర్ పాయింట్స్‌ని అపహాస్యం చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులను అణిచివేయడమే అతని లక్ష్యమని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.