ETV Bharat / state

1 Lakh Scheme Telangana : 15న బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం.. నియోజకవర్గానికి ఎంతమందికంటే.?

author img

By

Published : Jul 13, 2023, 8:15 AM IST

Telangana BCs 1 Lakh Scheme 2023 : తెలంగాణలో బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తొలివిడత కింద... ఈ నెల 15న నియోజకవర్గానికి 50 కుటుంబాల చొప్పున సాయం అందించేందుకు... కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం కోసం... బీసీ కార్పొరేషన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో ఇచ్చిన 300 కోట్ల రూపాయలకు అదనంగా మరో 200 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం... ఇప్పటికే 400 కోట్లు విడుదల చేసింది.

Telangana BCs 1 Lakh Scheme
Telangana BCs 1 Lakh Scheme

15న బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం

1 Lakh Scheme in Telangana 2023 : తెలంగాణలో బీసీ కుల వృత్తుల కుటుంబాలకు... లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం పంపిణీకి... ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడత కింద ఈ నెల 15న నియోజకవర్గానికి 50 కుటుంబాల చొప్పున సాయం అందించేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లాలవారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమం అమలు, లబ్ధిదారుల ఎంపిక, వరుస క్రమం ఖరారులో ప్రమాణాలు, ఇతర విషయాలపై... నేడు కలెక్టర్లు, బీసీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. లబ్ధిదారులకు నూరు శాతం గ్రాంటు కింద... లక్ష రూపాయలు అందించాలని, ఈ నిధులతో చేతి కులవృత్తులకు అవసరమైన సామగ్రి, పనిముట్లు కొనుగోలు చేసేలా చూడాలని... ఇప్పటికే జిల్లా బీసీ సంక్షేమాధికారులకు సర్కారు సూచించింది. తెలంగాణవ్యాప్తంగా 5.28 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం... దరఖాస్తు చేసుకున్నారు.

Rs 1 Lakh for BCs in Telangana : ఆర్థిక సహాయం పొందేందుకు... అర్హులైన కుటుంబాల జాబితాలను ప్రతినెలా 15వ తేదీ నాటికి... ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలనలో... తీవ్ర జాప్యం జరిగింది. ఇంటింటికీ పంచాయతీ కార్యదర్శులు తిరిగి... కులవృత్తులు చేస్తున్నారా? సంబంధిత కులానికి చెందిన వ్యక్తులేనా..? గతంలో ఏమైనా ఆర్థిక సహాయం పొందారా అనే వివరాలు తీసుకుని... ఎంపీడీవోల ద్వారా జిల్లా సంక్షేమాధికారులకు జాబితాలు ఇచ్చారు. గత ఐదేళ్లలో బీసీ సంక్షేమ పథకాలు పొందారా? లేదా? అనే వివరాలను 360 డిగ్రీ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో పరిశీలించారు. అర్హులైన కుటుంబాల జాబితాలను... జిల్లా కలెక్టర్లకు అందజేశారు. కలెక్టర్లు వరుస క్రమంలో జాబితాలు రూపొందించేందుకు... కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం తీసుకుని లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం తెలిపింది. కొన్ని జిల్లాల్లో మంత్రులు అందుబాటులో లేకపోవడంతో... ఇవాళ ఆమోదం తీసుకోవాలని కలెక్టర్లు భావిస్తున్నారు.

లక్ష సాయం కోసం అప్పుడే మొదలైన పైరవీలు : మరోవైపు లక్ష ఆర్థిక సాయం కోసం అప్పుడే... జిల్లాల్లో పైరవీలు మొదలయ్యాయి. జాబితాలు సిద్ధం చేసి., వరుస క్రమంలో ఆర్థిక సహాయం అందిస్తామని మార్గదర్శకాల్లో స్పష్టం చేసినప్పటికీ తొలి జాబితాలోనే సాయం అందేలా చూస్తామంటూ కొందరు దళారులు రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 15న.. నియోజకవర్గానికి 50 మందికి ఇవ్వాలని నిర్ణయించగా కొందరు సర్పంచులు, క్షేత్రస్థాయి నాయకులు తమవారికి ఇప్పించేందుకు సిఫార్సులు మొదలుపెట్టారు. నియోజకవర్గానికి 50 మంది చొప్పున... 119 నియోజకవర్గాల్లో 5వేల 950 మంది ఆర్థిక సహాయం అందుకోనున్నారు. మండలానికి పది కుటుంబాలకే అవకాశం ఉంటుంది. ఫలితంగా... సర్పంచులు తమ గ్రామంలోని బీసీలకే.. తొలుత ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెలలో అవకాశం రాకుంటే వచ్చేనెల జాబితాలో పేరు ఉండేలా చూస్తామని.. స్థానిక ప్రజాప్రతినిధులు వారికి సర్దిచెబుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.