ETV Bharat / state

విమెన్స్​ డే స్పెషల్: శ్మశానం సాక్షిగా.. ఓ సామాన్యురాలి కథ

author img

By

Published : Mar 8, 2021, 12:00 PM IST

ఓ స్త్రీ ఇల్లాలు కావాలనుకుంటుంది. హాయిగా కుటుంబ జీవితాన్ని గడపాలనుకుంటుంది. ఆమె కూడా అలాగే అనుకుంది. కానీ ఆమె కలలు కన్నీటిలో కరిగిపోతే ఎవరూ చేయని సాహసం చేసింది. భర్త చేసిన కాటికాపారి వృత్తినే తన బతుకుదెరువుగా మార్చుకుంది. కళేబరాలు, కంకాళాలు కళ్లెదుట కనబడుతున్నా... అనుక్షణం భయపెడుతున్నా తన కుటుంబం కోసం, వారి పొట్ట నింపడం కోసం పరితపిస్తోన్న ఓ సామాన్యురాలి కథ ఇది.

THE STORY OF A WOMAN FROM BHADRACHALAM DISTRICT WHO WORKS AS A KATIKAPARI DUE TO FAMILY PROBLEMS
THE STORY OF A WOMAN FROM BHADRACHALAM DISTRICT WHO WORKS AS A KATIKAPARI DUE TO FAMILY PROBLEMS


కష్టాలు ఆమెకు దగ్గరి చుట్టాలు... అస్తమానూ వచ్చిపోతుంటాయి. తల్లి క్యాన్సర్‌తో చనిపోయింది. ప్రమాదంలో కాలికి గాయమై తండ్రి మంచానికే పరిమితమయ్యాడు... తోబుట్టువు మధ్యలోనే అసువులు బాశాడు. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన భర్త అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కూడగట్టుకుని భర్త వృత్తినే ఎంచుకుని ముందుకు సాగుతోంది భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణ. అనాథ మృతదేహాలకు అన్నీ తానై అంతిమ సంస్కారాలు చేస్తోంది. అరుణకు చిన్న వయసులోనే రాజమండ్రి చెందిన కాటికాపరి శ్రీనుతో పెళ్లైంది. భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద ఉన్న వైకుంఠ ఘాట్‌లో అతడు పనిచేసేవాడు. అప్పుడప్పుడు భర్తతో స్మశాన వాటికకు వెళ్లేది. చిన్న చిన్న పనులు చేసేది. అలా మృతదేహాలను చితిపై పేర్చడం నేర్చుకుంది.

తినడానికి తిండిలేని పరిస్థితి..

ఉన్నంతలో హాయిగా ఉండేదా కుటుంబం. కొన్నాళ్లకు భర్త తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. వైద్యం కోసం ఇంటిని తాకట్టు పెట్టింది. ఎన్నో చోట్ల అప్పులు చేసింది. ఇన్ని చేసినా అతడు మూడేళ్ల కిందట చనిపోయాడు. ఓవైపు భర్త మరణం, మరోవైపు అప్పులు, తినడానికి తిండిలేని పరిస్థితి. అక్కున చేర్చుకునే అమ్మ లేదు. అండగా నిలవాల్సిన నాన్న తనపైనే ఆధారపడుతున్నాడు. ఏ ఆధారం లేక చాలారోజులు కుంగిపోయిందామె. కొన్నాళ్లకు తనకు తానే సర్ది చెప్పుకుంది. తనతోపాటు నాన్న బాగోగులు చూడాలంటే డబ్బు కావాలి. అందుకోసం భర్త చేసిన పనే తాను చేయాలనుకుంది. ప్రస్తుతం తండ్రితోపాటు మరో ఇద్దరు వృద్ధులను చూసుకుంటోంది. అలాగే ఓ అమ్మాయిని పెంచుకుంటోంది.

అనాథ శవాలకు బంధువై...!

కాటికాపరిగా పనిచేస్తానని చెప్పినప్పుడు ఇంటా, బయటా ఎవరూ ఒప్పుకోలేదు. అయితే ఆమె తన నిర్ణయం మార్చుకోలేదు.

‘మొదట్లో శవాల దహన సంస్కారం చేయాలంటే కాస్త భయంగా అనిపించేది. ఇంటికి వచ్చాక అన్నం సహించేది కాదు. కొన్ని అనాథ శవాలు దహనవాటికకు వచ్చేసరికే బాగా కుళ్లిపోయేవి. ఎవరూ వాటిని ముట్టుకోవడానికీ, చితిపై పెట్టడానికి కానీ వచ్చేవారు కాదు. అన్ని పనులు నేనొక్కదాన్నే చేసుకునేదాన్ని. ఒక్కోసారి తల కొరివి పెట్టి సంబంధీకులు వెళ్లిపోతారు. కొన్నిసార్లు మృతదేహం కాలిపోకుండా మాంసం ముద్దగానే ఉండిపోతుంది. అలాంటప్పుడు నాలుగైదు గంటలైనా... భగభగ మండే కట్టెలను మరో కర్ర సాయంతో ఎగదోస్తు చితా భస్మం అయ్యే వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది.’ - ముత్యాల అరుణ.

కొవిడ్‌ మృతులకు అన్నీ తానై...

కరోనా వచ్చిన కొత్తలో ఇక్కడి నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచీ కొవిడ్‌ మృతదేహాలను తీసుకొచ్చేవారు. బంధువులు దగ్గరకు రావాలంటే భయపడేవారు. అలాంటప్పుడు కూడా ఎలాంటి జంకు లేకుండా అంతిమ సంస్కారం చేసింది. ఆగస్టులో వరదలొచ్చినప్పుడు స్మశాన వాటిక వద్దకు నీళ్లొచ్చాయి. అప్పుడు కూడా కరకట్ట వాలులో కట్టెలు పేర్చి కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేసింది. అనాథలు, కరోనా లక్షణాలతో చనిపోయిన వారి అస్థికలను తీసుకెళ్లేందుకు బంధువులు వచ్చేవారు కాదు. వేచి చూసి చివరికి తానే గోదావరిలో వాటిని కలిపేది. -మామిడి నాగేశ్వరరావు, భద్రాచలం.

ఇదీ చూడండి: అక్కడి మహిళల సౌందర్య సాధనం ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.