ETV Bharat / state

Rains in telangana: రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. నిండుతున్న చెరువులు

author img

By

Published : Jul 12, 2021, 2:05 PM IST

Rains in telangana
తెలంగాణ వర్షాలు

అల్ప పీడన ప్రభావంతో గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిసేపు భారీ వానలతో బెదరగొట్టి మరి కాసేపు చిరుజల్లులతో మైమరిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి ఏకధాటిగా వానలు పడుతున్నాయి.

ప్రాజెక్టులకు వరద

వర్షాల కారణంగా నీటి ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 8.5 అడుగులు ఉంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో.. ఈ రోజు రాత్రిలోపు గోదావరి నీటిమట్టం 20 అడుగులకు చేరుతుందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎస్సారెస్పీకి వరద నీరు

వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 78 వేల క్యూసెక్కుల వరద నీరు చేరగా... నీటి మట్టం 1078.80 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 34 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పొంగిపొర్లుతున్న పాకాల వాగు

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గార్ల మండలంలో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం వస్తే చాలు.. ఈ రెండు గ్రామాల ప్రజలకు రాకపోకల్లో అవస్థలు తప్పడం లేదు.

స్థానికుల విజ్ఞప్తి

పాకాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నన్ని రోజులు.. ఈ రెండు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవాలంటే 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాలి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు.. పాకాల వాగుపై భారీ వంతెన నిర్మిస్తామని చెప్పి.. తీరా ఎన్నికలు ముగిశాక హామీలు గాలికొదిలేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెనను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

భద్రాచలం, గార్లలో భారీ వర్షాలు

ఇదీ చదవండి: Lower manair dam: రైతులకు గుడ్​ న్యూస్.. దిగువ మానేరు డ్యాం నుంచి నీరు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.