ETV Bharat / state

వరదతో 'డబుల్‌' కష్టాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లపై తీవ్ర ప్రభావం..

author img

By

Published : Jul 23, 2022, 7:06 AM IST

floods
floods

Godavari Flood Effect : భారీ వర్షాలు, వరదలతో కుదేలైన గోదావరి పరివాహక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లోని జనం ముంపు సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు. నీడనిచ్చే గూడు దెబ్బతిని.. వేసిన పంటలు నష్టపోయి కన్నీళ్లే మిగిలాయి. తడిసిన వస్తువులు, బురదమయంగా మారిన ఇళ్లను బాగుచేసే పనిలోపడ్డారు. సర్వస్వం కోల్పోయి బురదమయంగా మారిన ఇళ్లలో ఉండలేక నానా అవస్ధలు పడుతున్నారు.

Godavari Flood Effect: ఇళ్ల చుట్టూ చెరువుల్ని తలపించేలా వరద.. నివాసాల్లో బురద.. స్లాబులపైకీ ఉప్పొంగి వచ్చిన గోదారి ప్రవాహం.. పలు జిల్లాల్లో రెండు పడక గదుల ఇళ్ల సముదాయాల్లో కనిపించిన దృశ్యాలివి. కొట్టుకుపోయిన ఇంటి సామగ్రి, విద్యార్థుల సర్టిఫికెట్లు, బ్యాంకు పాసుపుస్తకాలు, రేషన్‌కార్డులు.. విద్యుత్‌ సౌకర్యంలో సమస్యలు, నివాసాల్లోకి చేరిన పాములు, తేళ్లు.. ఇలా ఒక్కో ఇంట్లో ఒక్కో సమస్యతో లబ్ధిదారులు గొల్లుమంటున్నారు. గోదావరి వరద తాకిడికి, భారీ వర్షాల ప్రభావానికి లోనైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లో పలుచోట్ల ఈ పరిస్థితి నెలకొంది.

.

తోడుతున్న కొద్దీ నీటిఊట.. మహబూబాబాద్‌ జిల్లా కురవిలో 30 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చారు. ఇక్కడ చెరువు దగ్గర లోతట్టులో ఇళ్లు కట్టారు. వరదతో పక్కనే ఉన్న చెరువులో చేపలు ఇళ్ల ముందుకు రాగా.. యువకులు వలలతో పట్టారు. పంచాయతీ అధికారులు నీళ్లు తోడిస్తున్నా.. ఇళ్ల మధ్య నీరు ఊరుతూనే ఉంది. కరెంటు సౌకర్యం లేకపోవడంతో చీకట్లోనే మగ్గతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.

.

* ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లిలో 20 డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టి లబ్ధిదారులకు అందించారు. స్థలం కొరత ఉండటంతో ఇక్కడ లబ్ధిదారులే ఇళ్ల స్థలాలను కొనుగోలుచేశారు. పక్కనే తిమ్మచెరువు ఉండటంతో వరదనీరు ఇళ్ల ముందు నిలుస్తోంది.

.

* పెద్దపల్లిలో కొన్నిచోట్ల గృహప్రవేశాలకు ముందే గోడలు, పిల్లర్లు కూలిపోతున్నాయి. మంథని, గోదావరిఖని, రామగుండం, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో అసంపూర్తి నిర్మాణాలు, కూలిపోయినవి దర్శనమిస్తున్నాయి. నిర్మాణాలు కొనసాగుతున్న సముదాయాల్లోని ఇళ్లలోకి నీరు చేరి.. సిమెంట్‌ సహా నిర్మాణ సామగ్రి దెబ్బతింది.

* ఆదిలాబాద్‌ పట్టణం కేఆర్కే కాలనీలో నీటి కుంట పక్కనే 384 ఇళ్లు నిర్మించారు. ఫలితంగా వర్షాలకు ఇళ్ల ముందుకు నీరు వస్తుండడంతో పాటు పాములు, తేళ్లు నివాసాల్లోకి చేరుతున్నాయని లబ్ధిదారులు వాపోయారు.

.
మంగమ్మ

ఇంట్లో ఏం మిగల్లేదు.. మూడేళ్ల క్రితం ఇళ్లు ఇచ్చారు. ఏటా వరదల్లో మునుగుతున్నాయి. ఈసారి ఇంటికప్పుపైనా వరద నీరు ప్రవహించింది. ఇంట్లోని ఉన్న సామగ్రి అంతా కొట్టుకుపోయింది. మూటలు కట్టినా.. ఏ వస్తువూ మిగల్లేదు. వండుకునేందుకు గిన్నెలులేవు. గోదావరి దిగువకు ఇళ్లు కట్టడం వల్లే ఈ కష్టాలు. - మంగమ్మ, గంగోలు, భద్రాద్రి కొత్తగూడెం

ఆగయ్య

చుట్టూ నీళ్లు.. చిమ్మచీకటి.. ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో పూర్తిగా సౌకర్యాలు కల్పించలేదు. కరెంటు లేక మూడు నెలలుగా రాత్రులు చీకట్లో మగ్గుతున్నాం. వర్షం కురిస్తే.. ఇళ్ల చుట్టూ చెరువును తలపించేలా నీరు నిలుస్తుంది. గుంతల్లో నీటిని తోడుతున్నకొద్దీ జలం ఊరుతుంది. - ముకరి ఆగయ్య, కురవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.