ETV Bharat / state

భూములు కనుమరుగు: పాగా వేసి.. ప్లాట్లు చేసి!

author img

By

Published : Nov 4, 2020, 6:50 PM IST

ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం జిల్లాలో అక్రమార్కులకు వరంగా మారేలా కనిపిస్తోంది. ఎక్కడా లేని విధంగా జిల్లాలో ప్రభుత్వ అసైన్డ్‌ భూములు ఉండడమే కారణం. ముఖ్యంగా జిల్లా కేంద్రం పరిధిలోనే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి.

Adilabad Latest News
భూములు కనుమరుగు: పాగా వేసి.. ప్లాట్లు చేసి!

1954 కంటే ముందు అసైన్డ్‌ చేసిన భూములకు ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ)లు జారీ చేసింది. ఇక్కడ మాత్రం కొందరు 1960, 65, 1970 ఇలా ఏ సంవత్సరంలో అసైన్డ్‌ చేసినా ఆ భూమిలో పాగా వేస్తున్నారు. అదే సర్వే నెంబరులోని ఇతర చోట ఇచ్చిన ఎన్‌ఓసీ పత్రం తీసుకొచ్చి క్రయవిక్రయాలు చేయరాని అసైన్డ్‌ భూముల్లో దర్జాగా ప్లాట్లను చేసి అమ్ముకుంటూ వచ్చారు. మరికొందరు ప్రైవేటు పట్టా భూములు చూపిస్తూ ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేసి విక్రయించారు. ప్రస్తుతం వీరంతా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. రెవెన్యూ, పురపాలక అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ఏ భూమి సరైయందోనని తేలిపోతుంది. అప్పుడు క్రమబద్ధీకరిస్తేనే మేలు. లేకుంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై అక్రమార్కులను అందలం ఎక్కించినట్లే.

రెవెన్యూ అధికారులను సంప్రదిస్తాం

పురపాలకంలో విలీనమైన గ్రామాలకు సంబంధించి చాలా సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేసినట్లు ఫిర్యాదులున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమోదం కోసం తప్పనిసరిగా రెవెన్యూ అధికారులను సంప్రదిస్తాం. రెవెన్యూ, పురపాలక శాఖల అధికారులం సమన్వయంతో పని చేస్తాం. వివాదాస్పద ప్లాట్ల జోలికి వెళ్లేది లేదు. ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ప్లాట్లు చేసినట్లు ఫిర్యాదు చేసినా పరిశీలన చేసి ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమోదించకుండా చూస్తాం. -సీవీఎన్‌ రాజు, పురపాలక కమిషనర్‌

ప్లాట్లు చేసి విక్రయించిన ఈ స్థలం జిల్లా కేంద్రం పరిధిలోకి వచ్చే బట్టిసావర్గాం శివారు సర్వే నెం.72 పరిధిలోనిది. ఇక్కడ హౌసింగ్‌ బోర్డుకు ప్రభుత్వం మొత్తం 76.18 ఎకరాలు కేటాయించగా అందులో ఓ పక్కన సర్వే నెం.72/2/2లో దాదాపు 35.04 ఎకరాల స్థలం ఉంది. ఈ సర్వే నెంబరులోనే ఆరు ఎకరాల ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఆ వ్యక్తులకు చెందిన ప్రైవేటు భూమి కొద్ది దూరంలో వాగుకు దగ్గరగా డిమాండ్‌ లేని చోట ఉండడంతో ఎక్కువ ధర వస్తుందని హౌసింగ్‌బోర్డు భూమిలో పాగావేసి ప్లాట్లు చేసి విక్రయించారు. భూ సర్వే కొలతల అధికారులు అది ప్రభుత్వ భూమి అని తేల్చి చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. ఇది కాదు వాగుకు దగ్గరగా ఉన్న భూమి గృహనిర్మాణ శాఖదని వారు చెప్పుకుంటూ దీన్ని వివాదాస్పదం చేశారు. దీనిపై గృహనిర్మాణశాఖ డీఈ పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. ప్లాట్లు ఎవరూ కొనుగోలు చేయవద్దని ఆయన పత్రికా ముఖంగా గతంలోనే ప్రకటించారు. మరో పక్క సదరు వ్యక్తులు ఆ ప్లాట్లకు గతంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతోపాటు తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమోదిస్తే ఆ స్థలమంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. హౌసింగ్‌బోర్డు భూమి అన్యాక్రాంతమవుతుంది.

ప్లాట్లకోసం బండలు తొలగించిన ఈ స్థలం జిల్లా కేంద్రం పరిధిలోకి వచ్చే మావల శివారులోని సర్వే నెం.170 పరిధిలోనిది. ఇక్కడ దాదాపు 4 ఎకరాల్లో 42కి పైగా ప్లాట్లు చేసి విక్రయించారు. 1961లో అసైన్డ్‌ చేసిన ఈ భూమిలో క్రయవిక్రయాలు నిషేధం. ఇతర అసైన్డ్‌ భూమికి సంబంధించిన ఎన్‌ఓసీ(నిరభ్యంతర పత్రం) చూయించి ఇక్కడ ప్లాట్లు చేశారు. రిజిస్ట్రేషన్‌లు చేసేసుకున్నారు. రెవెన్యూ అధికారులు విషయం ఆలస్యంగా తెలుసుకొని ప్లాట్లకోసం వేసిన బండలు తొలగించారు. తాజాగా ఆ స్థలంలో దాదాపు 50కి పైగా ప్లాట్లకోసం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లా కేంద్రంలో ఒక భూమికి బదులు మరో భూమిలో ప్లాట్లు చేసి విక్రయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. విక్రయానికి వీల్లేని భూమిలో ప్లాట్లు చేసి క్రమబద్ధీకరించుకుంటున్నారు. ఒకవేళ ఎల్‌ఆర్‌ఎస్‌లో వీటిని ఆమోదిస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.