ETV Bharat / state

ప్రగతిరథ చక్రాలకి కరోనా బ్రేక్‌లు... ఆదిలాబాద్​లో రూ.110 కోట్ల నష్టం

author img

By

Published : Sep 28, 2020, 1:53 PM IST

Updated : Sep 28, 2020, 2:57 PM IST

110 crore loss to TSRTC in Adilabad region during Corona period
ఆదిలాబాద్​లో ప్రగతిరథ చక్రాలకి కరోనా బ్రేక్‌లు

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఆర్టీసీకి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 6 డిపోల పరిధిలో కొవిడ్​ కాలంలో రోజుకు దాదాపుగా రూ.110 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఏప్రిల్‌ నెల మొత్తం ఒక్క బస్సు కూడా బయట తిరగకపోగా... మిగిలిన సమయాల్లో ప్రయాణికులు లేక... బస్సుల రాకపోకలకు బ్రేక్‌ పడింది.

ప్రగతిరథ చక్రాలకి కరోనా బ్రేక్‌లు... ఆదిలాబాద్​లో రూ.110 కోట్ల నష్టం

కరోనా దెబ్బతో ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఆదిలాబాద్‌ రీజియన్‌లోని ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, మంచిర్యాల డిపోల పరిధిలో మొత్తం 625 బస్సులున్నాయి. అయితే అవి ప్రతిరోజు 2.60 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా లక్ష కిలోమీటర్లు తిరగడం కూడా గగనమైంది. ఏప్రిల్ మాసంలోనైతే ఒక్క బస్సు కూడా డిపో దాటి బయటకు పోలేదు. దానితో ఆరు డిపోల పరిధిలో రోజుకు కోటి రూపాయలు రావాల్సిన సగటు ఆదాయం 40 లక్షల రూపాయలకు పడిపోయింది. సంస్థలో పనిచేసిన ఒప్పంద కార్మికులను తొలగించి ఉన్న ఉద్యోగులను సైతం వివిధ పనుల్లో సర్ధుబాటు చేశారు.

సిబ్బంది సర్ధుబాటు... పనిదినాల కుదింపు

ఆరు డిపోల పరిధిలో 2,637 మంది ఉద్యోగులుంటే 933 మంది డ్రైవర్లు, మరో 1142 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఉద్యోగులను కొద్దిరోజులు విడతలవారీగా వివిధ పనుల్లో యాజమాన్యం సర్ధుబాటు చేసింది. కాగా మిగిలిన రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో సెలవుగా పరిగణించిందని దానితో తాము సంపాదన సెలవులను కోల్పోవాల్సి వచ్చిందని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతాదృక్పదంతో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

3 కోట్ల ఆదాయం కాస్త 50లక్షలకు..

ప్రధానంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల డిపోల పరిధిలో తిరగాల్సినన్ని బస్సులు తిరగలేదు. రావాల్సిన ఆదాయం రాలేదు. ఉట్నూర్‌ డిపో పరిధిలోనైతే నెలకు రూ. మూడు కోట్ల ఆదాయాం రావాల్సి ఉంటే కేవలం రూ.50లక్షలే వచ్చింది. జిల్లా నుంచి ఖమ్మం, హైదరాబాద్‌, గుంటూరు లాంటి దూరప్రాంతాల బస్సులతో పాటు పల్లె బస్సులు, సరిహద్దున ఉన్న మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయంపై గణనీయమైన ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పూడ్చుకునే అవకాశం లేనందున ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బస్సులను పునరుద్దరించే ప్రయత్నం చేస్తూనే కార్గో సేవలపై దృష్టిసారించింది.

ఇదీ చూడండి: మహానగరంలో యథాస్థితికి ప్రజాజీవనం.. రహదారులపై సందడి

Last Updated :Sep 28, 2020, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.