ETV Bharat / sports

Tokyo 2020: అవి కలిసొస్తే రెజ్లింగ్‌లో పతకాలు ఖాయం!

author img

By

Published : Aug 3, 2021, 3:13 PM IST

wrestling
రెజ్లింగ్​

టోక్యో ఒలింపిక్స్​లో భారత రెజ్లర్లకు సులభ డ్రా లభించింది. కుస్తీవీరులు దీపక్‌ పునియా (86 కిలోలు), రవి దహియా (57 కిలోలు), అన్షు మలిక్‌ (57 కిలోలు) బరిలోకి దిగనున్నారు. వీరు ఎవరితో తలపడనున్నారంటే?

భారత కుస్తీవీరులకు టోక్యో ఒలింపిక్స్‌లో సులభ డ్రాలే ఎదురయ్యాయి. ఆట, అదృష్టం కలిసొస్తే వారు పతకాలు గెలిచే అవకాశం కనిపిస్తోంది. రెజ్లర్లు దీపక్‌ పునియా (86 కిలోలు), రవి దహియా (57 కిలోలు), అన్షు మలిక్‌ (57 కిలోలు) బరిలోకి దిగనున్నారు.

రవి దహియా తన తొలిపోరులో కొలంబియాకు చెందిన టైగ్రెరోస్‌ అర్బనోస్‌తో తలపడనున్నాడు. ఫామ్‌ ప్రకారం చూస్తే అతడిపై విజయం సులభమేనని తెలుస్తోంది. అంతేకాదు అతడికి సెమీస్‌ వరకు తిరుగులేదని విశ్లేషకులు అంటున్నారు. ఆరంభ పోరులో రవి గెలిస్తే తర్వాత అల్జీరియాకు చెందిన అబ్దుల్‌హక్‌ ఖరబచె లేదా జార్జి వాలెంటినోవ్​తో (బల్గేరియా) తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిస్తే.. సెమీస్‌లో సెర్బియా టాప్‌ సీడ్‌ స్టీవెన్‌ ఆండ్రియా మైకిక్‌ లేదా జపాన్‌ రెజ్లర్‌ యుకి టకాహషిలో ఒకరితో పోరు ఉంటుందని అంచనా. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రవి కాంస్యం గెలిచాడు. ప్రస్తుతం అతడు ఆసియా విజేతగా కొనసాగుతున్నాడు.

ఇక 86 కిలోల విభాగంలో దీపక్‌ పునియా నైజీరియా రెజ్లర్‌ ఎకిరెకెమె అజియోమర్‌తో తొలిపోరులో తలపడనున్నాడు. అతడిపై విజయం సాధిస్తే జుషెన్‌ లిన్‌ (చైనా) లేదా ఎడిన్‌సన్‌ అంబ్రోసియో గ్రిఫోతో (పెరూ) రెండో పోరు ఉంటుంది. మరోవైపు 19 ఏళ్ల యువ క్రీడాకారిణి అన్షు మలిక్‌కు కఠిన డ్రా ఎదురైంది. ఐరోపా ఛాంపియన్‌ ఇరినా కురుచికినాతో తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిస్తే రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత వలెరియా కాబ్లొవా లేదా మెక్సికో రెజ్లర్‌ అల్మా జేన్‌తో మ్యాచ్‌ ఉంటుంది.

ఇదీ చూడండి: రెండు పతకాలతో రికార్డు.. ఒకరు జైల్లో, మరొకరు గుండెల్లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.