ETV Bharat / sports

యుఎస్​ ఓపెన్​: సెమీస్​లో జెన్నీఫర్​ బ్రాడీ

author img

By

Published : Sep 9, 2020, 6:52 AM IST

జెన్నీఫర్‌ బ్రాడీ యుఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. విక్టోరియా అజరెంకా, పిరన్కోవా క్వార్టర్స్‌లో ప్రవేశించారు. పురుషుల సింగ్స్‌లో ఫేవరెట్‌ డొమినిక్‌ థీమ్‌, నిరుటి రన్నరప్‌ మెద్వెదెవ్‌ తుది ఎనిమిదిలో చోటు సంపాదించారు.

US OPEN 2020: Naomi Osaka, Jennifer Brady set for semifinal showdown at US Open
యుఎస్​ ఓపెన్​: సెమీస్​కు చేరిన జెన్నీఫర్​ బ్రాడీ

అమెరికా అమ్మాయి జెన్నీఫర్‌ బ్రాడీ యుఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వ్టార్టర్‌ఫైనల్లో ఆమె 6-3, 6-2తో పుతిన్‌త్సెవా (కజకిస్థాన్‌)ను చిత్తు చేసింది. బ్రాడీ ఆరు ఏస్‌లు కొట్టింది. ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ సెమీస్‌ చేరడం ఆమెకు ఇదే తొలిసారి. మరోవైపు విక్టోరియా అజరెంకా (బెలారస్‌) క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నాలుగో రౌండ్లో ఆమె 5-7, 6-1, 6-4తో ముచోవా (చెక్‌)పై గెలిచింది. పిరన్కోవా (బల్గేరియా), మెర్టెన్స్‌ (బెల్జియం) తుది ఎనిమిదిలో చోటు సంపాదించారు. ప్రీక్వార్టర్స్‌లో పిరన్కోవా 6-4, 6-7 (5/7), 6-3తో కోర్నెట్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గగా.. మెర్టెన్స్‌ 6-3, 6-3తో రెండో సీడ్‌ కెనిన్‌ (అమెరికా)ను మట్టికరిపించింది. మూడో సీడ్‌ సెరెనా కూడా క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో చోటు కోసం ఆమె పిరన్కోవాతో తలపడుతుంది. యుఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ చేరడం పిరన్కోవాకు ఇదే తొలిసారి.

థీమ్‌ జోరు..

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్లో అతడు 7-6 (7/4), 6-1, 6-1తో అగర్‌ అలియాసిమ్‌ (కెనడా)పై విజయం సాధించాడు. తొలి సెట్లో గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్నా.. నిలదొక్కుకున్నాక థీమ్‌ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. రెండు, మూడో సెట్లను అలవోకగా చేజిక్కించుకున్నాడు. అలియాసిమ్‌ (12 ఏస్‌లు).. థీమ్‌ కన్నా ఎక్కువ ఏస్‌లు కొట్టాడు. కానీ 54 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. థీమ్‌ మూడు ఏస్‌లు, 23 విన్నర్లు కొట్టాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు నాదల్‌, ఫెదరర్‌, జకోవిచ్‌ పోటీలో లేని నేపథ్యంలో థీమ్‌ ఫేవరెట్‌గా మారాడు.

US OPEN 2020: Naomi Osaka, Jennifer Brady set for semifinal showdown at US Open
డొమినిక్​ థీమ్​

నాదల్‌, ఫెదరర్‌ టోర్నీ నుంచి వైదొలగగా.. జకోవిచ్‌ అనూహ్యంగా టోర్నీ నుంచి అనర్హతకు గురయ్యాడు. అనుకోకుండా లైన్‌ అంపైర్‌ను బంతితో కొట్టడం వల్ల అతడు మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), పదో సీడ్‌ (రుబ్లెవ్‌) కూడా క్వార్టర్స్‌లో ప్రవేశించారు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మెద్వెదెవ్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో 6-4, 6-1, 6-0తో తియాఫో (ఫ్రాన్స్‌)ను చిత్తు చేశాడు. పదునైన సర్వీసులు చేసిన మెద్వెదెవ్‌ ఏడు ఏస్‌లు కొట్టాడు. రుబ్లెవ్‌ 4-6, 6-3, 6-3, 6-3తో బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో డి మినార్‌ 7-6 (8/6), 6-3, 6-2తో పొస్పిసిల్‌ (కెనడా)ను ఓడించాడు.

బోపన్న జోడీ ఔట్‌

యుఎస్‌ ఓపెన్‌లో భారత్‌ కథ ముగిసింది. షపొవలోవ్‌ (కెనడా)తో కలిసి బరిలోకి దిగిన రోహన్‌ బోపన్న పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో కంగుతిన్నాడు. బోపన్న జంట 5-7, 5-7తో జీన్‌ జులియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌), హొరియా టెకావు (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. టోర్నీలో పోటీపడ్డ మిగతా ఇద్దరు భారతీయులు దివిజ్‌ శరణ్‌, సుమిత్‌ నగాల్‌లు ఇప్పటికే తమ తమ విభాగాల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.