ETV Bharat / sports

T20 World Cup: వారికి అవకాశమిస్తేనే టీమ్​ఇండియాకు విజయం!

author img

By

Published : Oct 30, 2021, 9:39 AM IST

Updated : Oct 30, 2021, 11:38 AM IST

న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ గెలుపు దాయాది శిబిరంలో ఎంత సంతోషం నింపిందో తెలియదు కానీ.. టీమ్​ఇండియా అభిమానులు మాత్రం చాలా ఆనందపడ్డారు. ఇదేంటీ.. కివీస్‌పై పాక్‌ గెలిస్తే భారత్‌కు వచ్చిన లాభమేంటి అని బుర్రలు బద్దలు కొట్టుకోకండే.. అదెలాగో ఓసారి చదివేయండి!

t20 world cup
టీమ్​ఇండియా

టీ20 ప్రపంచకప్‌లో (T20 Worldcup) పాకిస్థాన్‌ (Pakistan) రెండో విజయాన్ని నమోదు చేసింది. సమష్టి కృషితో న్యూజిలాండ్‌పై (Newzealand) అద్భుత విజయం సాధించింది. టీమ్​ఇండియా, కివీస్‌, అఫ్గాన్​పై వరుస విజయాలతో పాక్‌ (6 పాయింట్లు) సెమీస్‌కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇక పాక్‌ ఢీకొట్టేబోయేది స్కాట్లాండ్‌, నమీబియా వంటి చిన్న జట్లనే. ఇప్పుడు ఈ గ్రూప్‌ నుంచి సెమీస్‌కు వెళ్లే రెండో జట్టు ఏదనేదే ప్రశ్న. గ్రూప్‌లో టీమ్​ఇండియాతో (Team India) పాటు కివీస్‌, అఫ్గాన్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే స్కాట్లాండ్‌ మీద భారీ విజయంతో అఫ్గాన్‌ ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. మంగళవారం పాక్‌ మీద కివీస్‌ ఓడిపోవడం భారత్‌, అఫ్గాన్‌కు కలిసొచ్చే అంశం.

గతం మరిచి.. విజయాల బాట పట్టాలి

పాక్‌ మీద ఘోర పరాజయం తర్వాత టీమ్​ఇండియా అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో తలపడనుంది. గతం వదిలి బ్యాటింగ్‌, బౌలింగ్‌లోని లోటుపాట్లను సవరించుకుని భారత జట్టు బరిలోకి దిగాలి. అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్​ఇండియాకు మామూలుగా అయితే కివీస్‌ సమస్య కాబోదు. కానీ పాక్‌ మీద ఓటమితో కివీస్‌ ఆకలిగొన్న పులిలా ఉంటుంది. దీంతో మైదానంలో సరైన ప్రణాళికలను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే 2007 వన్డే ప్రపంచకప్‌ మాదిరిగా లీగ్ దశలోనే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రాకమానదు. కివీస్‌, అఫ్గాన్‌, స్కాట్లాండ్‌, నమీబియా మీద గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా టీమ్​ఇండియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ కివీస్‌ మీద ఓడి, మిగతా జట్ల మీద విజయం సాధిస్తే.. అప్పుడు పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని మ్యాచులను భారత్‌ గెలవాలి. అప్పుడే ఎలాంటి సమీకరణాల లెక్క లేకుండా ముందుకెళ్లొచ్చు.

టీ20ల్లో న్యూజిలాండ్‌తో ఇలా..

  • భారత్‌, న్యూజిలాండ్‌ ఇప్పటివరకు 14 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో కివీస్ ఎనిమిది, టీమిండియా ఆరు మ్యాచుల్లో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో అయితే కివీస్‌దే పైచేయి. ఇప్పటివరకు రెండు సార్లు తలపడగా.. రెండింటిలోనూ కివీస్‌నే విజయం వరించింది.

లోపాలు ఎక్కడ..? ఏం చేయాలి?

మొన్నటి వరకు యూఏఈ వేదికగానే ఐపీఎల్‌ జరిగింది. ఇక్కడి మైదానాలకు టీమ్​ఇండియా క్రికెటర్లు బాగానే అలవాటు పడ్డారని ప్రతి ఒక్కరూ భావించారు. వార్మప్‌ మ్యాచుల్లోనూ దుమ్ములేపేశారు. మాంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు.. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్‌ చేసే బౌలర్లు భారత జట్టు సొంతమని అంతా అనుకున్నారు. తీరా అసలైన మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, (Virat Kohli) రిషభ్‌ పంత్ (Rishabh Pant) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ (Rohit Sharma) సహా కేఎల్‌ రాహుల్ (KL Rahul), సూర్యకుమార్ (Surya Kumar Yadav), హార్దిక్‌ పాండ్య (Hardik Pandya), జడేజా (Ravindra jadeja) ఉసూరుమనిపించారు.

బ్యాటర్ల సంగతి ఇలా ఉంటే.. బౌలింగ్ దళం ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. పాక్‌ మ్యాచ్‌లో ఒక్కటంటే ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోయారు. పాక్‌ ఓపెనర్లు ఎంత కసిగా ఆడారో.. మన బౌలర్లు అంత చప్పగా బౌలింగ్‌ చేశారు. మన కుర్రాళ్ల బౌలింగ్‌ తీరు చూస్తుంటే.. వికెట్‌ తీయాలన్న తాపత్రయం కనిపించలేదని మాజీలు అభిప్రాయపడ్డారు. సీనియర్‌ బౌలర్లు భువనేశ్వర్‌ (Bhuvaneswar Kumar), షమీ (Mohammad Shami) ప్రభావం చూపలేకపోయారు. స్లో పిచ్‌లపై తెలివిగా బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. పెద్దగా ఫామ్‌లో లేని భువి బదులు బ్యాటింగ్‌కూ ఉపయోగపడే శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur)ను తీసుకుంటే బాగుండేదనే వాదనా ఉంది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును సిద్ధం చేసుకుంటే కివీస్‌పై ఎంచక్కా గెలిచేయొచ్చు.

కాంబినేషన్‌ ఇలా ఉంటే..!

టీమ్​ఇండియాకు బ్యాటింగ్‌ ప్రధాన బలం. దాదాపు తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. రిజర్వ్‌ బెంచ్‌ కూడా పటిష్ఠంగానే ఉంది. అయితే ప్రధాన సమస్య ఒత్తిడిని తట్టుకోలేకపోవడం. ఓర్పుతో బ్యాటింగ్‌ చేస్తే పరుగులు సాధించవచ్చని పాక్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నిరూపించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌... కుడి చేతివాటం బ్యాటర్లు. ఓపెనింగ్‌ విషయంలో కుడి, ఎడమ కలయిక ఉంటే బాగుంటుందని పరిశీలకులు చెబుతుంటారు.

లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌లో ఓపెనర్లు పంపితే బౌలర్ల లైన్‌, లెంగ్త్‌ కుదురుకోనీయకుండా చేయొచ్చనేది వారి ఆలోచన. దీని కోసం ఇషాన్‌ కిషన్‌ అందుబాటులో ఉన్నాడు. ఐపీఎల్‌, వార్మప్‌ మ్యాచుల్లో చక్కటి ప్రదర్శన ఇచ్చాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్య పెద్దగా ఫామ్‌లో లేడు. అతడి స్థానంలో ఇషాన్‌ (Ishan Kishan)ను తీసుకుంటే రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్‌ చేస్తాడు. అవసరాన్ని బట్టి విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్‌లో ఒకరు మూడో స్థానంలో దిగొచ్చు. ఆ తర్వాత ఎలాగూ సూర్యకుమార్‌, రిషభ్‌ పంత్, జడేజా, శార్దూల్‌ (తీసుకుంటే) ఉండనే ఉన్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎంత లోతుగా ఉంటే ఒత్తిడిలో ఎవరో ఒకరు ఆదుకునే అవకాశం ఉంటుంది.

బౌలింగ్‌లో.. ఇదీ పరిస్థితి

భారత జట్టులో బుమ్రా, షమీ, శార్దూల్, భువనేశ్వర్ వంటి పేసర్లు.. వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy), జడేజా, అశ్విన్‌ (Ravichandran Ashwin), రాహుల్ చాహర్ (Rahul Chahar) వంటి స్పిన్నర్లు ఉన్నారు. అయితే పాక్‌తో మ్యాచ్‌లో షమీ ఘోరంగా విఫలం కాగా.. బుమ్రా, భువి, వరుణ్‌ చక్రవర్తి, జడేజా ఫర్వాలేదనిపించారు. అయితే వికెట్‌ మాత్రం తీయలేకపోయారు. మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్‌ చక్రవర్తి రాణిస్తాడని అంతా భావించారు. బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టినా వికెట్ల విషయంలో ప్రభావం చూపించలేకపోయాడు. కివీస్‌తో మ్యాచ్‌లో బుమ్రా, భువనేశ్వర్‌/షమీ, శార్దూల్‌, అశ్విన్‌, జడేజాతో బౌలింగ్‌ దాడి చేయించాలని విశ్లేషకులు చెబుతున్నారు. యూఏఈలో ఎక్కువగా స్లో పిచ్‌లు కాబట్టి.. బౌలింగ్‌లో వైవిధ్యం చూపించగలిగేవారికి తుది జట్టులో అవకాశం కల్పించాలి.

టీమ్​ఇండియా మ్యాచ్‌లు ఇలా..

గ్రూప్‌ దశలో ప్రతి జట్టు ఐదేసి మ్యాచ్‌లను ఆడుతుంది. టాప్‌లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి. గ్రూప్‌దశలో ఇప్పటికే పాక్‌తో (అక్టోబర్‌ 24న) టీమ్​ఇండియా మ్యాచ్‌ ఆడేసింది. కివీస్‌తో అక్టోబర్ 31, అఫ్గాన్‌ మీద నవంబర్ 3, స్కాట్‌ల్యాండ్‌తో నవంబర్ 5న, నమీబియాతో నవంబర్ 8న భారత జట్టు తలపడనుంది.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా.. కివీస్​తో మ్యాచ్​కు మార్పులు లేకుండానే!

Last Updated :Oct 30, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.