ETV Bharat / sports

T20 World Cup: న్యూజిలాండ్​పై పోరాడి ఓడిన స్కాట్లాండ్

author img

By

Published : Nov 3, 2021, 7:23 PM IST

nz vs sco
న్యూజిలాండ్, స్కాట్లాండ్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్, స్కాట్లాండ్​పై గెలిచింది. 16 పరుగులతో విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కివీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో మైఖేల్ లియాస్క్‌ (42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, ఇష్ సోదీ 2, టిమ్‌ సౌథీ ఒక వికెట్ తీశారు.

ఛేదనలో స్కాట్లాండ్‌ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్‌ కైల్‌ కోట్జర్‌ (17) ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మాథ్యూ క్రాస్‌ (27)తో కలిసి.. జార్జ్‌ మున్సీ (22) నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. అనంతరం కివీస్ బౌలర్లు సోదీ, బౌల్డ్​ వీరిని కట్టడి చేశారు. దీంతో 11 ఓవర్లకు స్కాట్లాండ్‌ 77 పరుగులతో నిలిచింది. అయితే, ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటం వల్ల ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్‌ లాయిడ్ (17), రిచీ బెర్రింగ్టన్‌ (20) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో వచ్చిన మైఖేల్ లియాస్క్‌ (42*) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ బ్యాటర్లలో మార్టిన్‌ గప్తిల్ (93) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. గ్లెన్‌ ఫిలిప్స్ (33) రాణించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో సఫ్యాన్‌ షరీఫ్‌, బ్రాడ్లే వీల్‌ రెండేసి, మార్క్‌ వాట్‌ ఒక వికెట్‌ తీశారు.

దీంతో టీమ్​ఇండియాకు సెమీస్​ ఆశలు దాదాపుగా గల్లంతైనట్లే.

ఇదీ చదవండి:

స్కాట్లాండ్ కీపర్ మాటలకు భారత అభిమానులు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.