ETV Bharat / sports

T20 World Cup: 'రోహిత్​ మద్దతుతోనే ఓపెనర్​గా ఇషాన్'

author img

By

Published : Nov 2, 2021, 11:53 PM IST

న్యూజిలాండ్​తో మ్యాచ్​లో టీమ్​ఇండియా బ్యాటింగ్​ ఆర్డర్​లో (Team India Batting Order) మార్పులు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను కాదని, ఓపెనర్​గా ఇషాన్​ కిషన్​ను (Ishan Kishan News) పంపడాన్ని మాజీలు తప్పుబట్టారు. అయితే ఈ నిర్ణయం రోహిత్​ మద్దతుతోనే తీసుకున్నట్లు తెలిపారు టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్.

T20 World Cup
ఇషాన్‌ కిషన్‌

తొలుత పాకిస్థాన్‌తో (IND VS PAK) ఓడింది.. వారం రోజుల సమయం వచ్చింది.. అయినా తీరు మారలేదు.. న్యూజిలాండ్‌తోనూ (IND VS NZ) ఘోర పరాభవమే. దీంతో టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) టీమ్ఇండియా ప్రదర్శనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కివీస్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మను కాదని ఇషాన్‌ కిషన్‌ను (Ishan Kishan News) ఓపెనింగ్‌ పంపించడం, సూర్యకుమార్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వంటి నిర్ణయాలపైనా విమర్శలు వచ్చాయి. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పుపై (Team India Batting Order) టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్ స్పందించారు. ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపించాలనే మేనేజ్‌మెంట్‌ నిర్ణయానికి రోహిత్‌ శర్మ మద్దతు తెలిపాడని స్పష్టం చేశారు.

"కివీస్‌తో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి సూర్యకుమార్‌ యాదవ్‌ స్వల్ప వెన్నునొప్పితో బాధపడ్డాడు. మైదానంలోకి దిగేందుకు ఫిట్‌ లేడు. అందుకే మ్యాచ్‌లోకి తీసుకోలేకపోయాం. ఇషాన్‌ విషయంలో మా నిర్ణయం తప్పు లేదనిపిస్తోంది. గతంలోనూ ఓపెనర్‌గా ఇషాన్‌ రాణించాడు. మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయానికి రోహిత్‌ కూడా మద్దతు తెలిపాడు. దీనిపై జరిగిన చర్చలోనూ (Rohit Sharma News) రోహిత్‌ భాగమే. ఇషాన్‌ను ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం బ్యాటింగ్‌ శైలి. మిడిలార్డర్‌లో పంత్‌, జడేజా, ఇషాన్‌ ముగ్గురూ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అవుతారు. అందుకే ఇషాన్‌ను ఓపెనింగ్‌ తీసుకొస్తే సమతుల్యత వస్తుందని భావించాం"

-విక్రమ్‌ రాఠోడ్, టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌

అలానే ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) ఆడుతున్న టీమ్‌ఇండియా జట్టుకు బ్యాటింగ్‌ బ్యాకప్‌ లేదని వస్తున్న విమర్శలను విక్రమ్‌ కొట్టిపడేశారు. ప్రపంచకప్‌ కోసం కేవలం 15 మంది సభ్యులను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ భారత్‌కు మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉందని, అయితే అనుకున్న ప్లాన్‌లను మైదానంలో సరిగ్గా అమలు చేయలేపోయినట్లు పేర్కొన్నారు. వచ్చే మ్యాచుల్లో నెట్‌రన్‌రేట్‌ గురించి ఆలోచిండటం లేదని, తొలుత విజయమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రాహుల్‌ చాహర్ ఆడే అవకాశాలపై స్పందిస్తూ.. ఇప్పుడే చెప్పలేనని, ఎవరికీ మినహాయింపు లేదన్నారు.

T20 World Cup
విరాట్​తో విక్రమ్ రాఠోడ్

ఐపీఎల్​తో కలిపి చూడరాదు..

ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ వెనువెంటనే రావడం వల్లే భారత జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిందనే వాదనను విక్రమ్‌ తోసిపుచ్చారు. "సన్నద్ధత ఎలా ఉన్నా సరే అది జట్టుకు మంచిదే. అంతర్జాతీయంగా టాప్‌ క్రికెటర్లతో ఆడే అవకాశాన్ని ఐపీఎల్‌ కల్పించింది. కచ్చితంగా యువ క్రీడాకారులకు ఇదొక మంచి వేదిక. ఐపీఎల్‌ తర్వాత వరల్డ్‌కప్‌ ఆడటంలో నాకేమీ సమస్య కనిపించలేదు. అయితే ఇక్కడ ప్రధాన అంశం అనుకున్న ప్రణాళికలను సరిగ్గా మైదానంలో అమలుపరచడం. అక్కడే కాస్త సమస్యగా ఉంది" అని విక్రమ్‌ వివరించారు.

ఇదీ చూడండి: ఇది మన జట్టేనా?.. ఆ కసి, పట్టుదల ఏమయ్యాయో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.