ETV Bharat / sports

Russia Ukraine War: రష్యాపై క్రీడా యుద్ధం

author img

By

Published : Feb 27, 2022, 7:05 AM IST

Russia Ukraine War: ఉక్రెయిన్​లో దాడులు కొనసాగిస్తున్న కారణంగా క్రీడల పరంగానూ రష్యాపై పెను ప్రభావం పడేలా కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఆ దేశంలో జరగాల్సిన టోర్నీలను రద్దు చేసుకుంటున్నట్లు పలు క్రీడా సమాఖ్యలు ప్రకటించాయి.

Russia Ukraine War sports
Russia Ukraine War sports

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాను క్రీడా సమాఖ్యలు దెబ్బ కొడుతున్నాయి. ఆ దేశంలో టోర్నీలు నిర్వహించేందుకు, మ్యాచ్‌లు ఆడేందుకు విముఖత చూపుతున్నాయి. పోటీలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై అన్ని రంగాల్లో ఆంక్షలు విధించేందుకు ఐరోపా యూనియన్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌ తదితర దేశాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు క్రీడల్లోనూ ఆ దేశానికి ఎదురుదెబ్బ తప్పడం లేదు. డోపింగ్‌ వివాదం కారణంగా కొంతకాలం అంతర్జాతీయ పోటీలకు దూరమైన ఆ దేశం.. ఇప్పటికీ రష్యా ఒలింపిక్‌ కమిటీ పేరుతోనే టోర్నీల్లో పాల్గొంటోంది. ఇప్పుడిక యుద్ధం నేపథ్యంలో సుమారు మరో ఏడాది లేదా రెండేళ్ల పాటు క్రీడల పరంగా ఆ దేశంపై పెను ప్రభావం పడేలా కనిపిస్తోంది. రష్యాతో పాటు బెలారస్‌లోనూ నిర్వహించాల్సి ఉన్న క్రీడా టోర్నీలను రద్దు చేసుకోవాలని లేదా ఇతర దేశాలకు తరలించాలని క్రీడా సమాఖ్యలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) కోరింది. అంతే కాకుండా ఆ దేశాల జెండాలను వాడకూడదని, జాతీయ గీతాలను వినిపించకూడదని సూచించింది. ఇప్పటికే రష్యాలో జరగాల్సిన ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఫైనల్‌ను ప్యారిస్‌కు తరలించాలని యూఈఎఫ్‌ఏ నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అక్కడ జరగాల్సిన ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రి రేసును నిర్వహించడం అసాధ్యమని ఏఫ్‌ఐఏ స్పష్టం చేసింది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిరసిస్తూ ఆ దేశంతో ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడబోమని శనివారం పోలండ్‌ ప్రకటించింది. వచ్చే నెల 24న రష్యాలో ఈ మ్యాచ్‌ జరగాల్సింది. ‘‘ఇక మాటల్లేవ్‌. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని పోలండ్‌ సాకర్‌ సమాఖ్య అధ్యక్షుడు సెజరీ ట్వీట్‌ చేశాడు. ఆ దేశ స్టార్‌ ఆటగాడు రాబర్ట్‌ కూడా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించాడు. మరోవైపు ఐఓసీ పిలుపు మేరకు ఈ ఏడాది రష్యాలో జరగాల్సిన వాలీబాల్‌, షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు కూడా ఇతర దేశాలకు తరలిపోయే అవకాశం ఉంది.
చెస్‌ ఒలింపియాడ్‌ కోసం: రష్యా నుంచి తరలిన చెస్‌ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ ఏడాది జరిగే ఆ టోర్నీ ఆతిథ్య హక్కుల కోసం బిడ్‌ దాఖలు చేస్తామని అఖిల భారత్‌ చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) శనివారం ప్రకటించింది. రెండు వారాల పాటు సాగే ఈ ఒలింపియాడ్‌లో దాదాపు 190 దేశాలు పోటీపడతాయి. షెడ్యూల్‌ ప్రకారం మాస్కోలో జులై 26 నుంచి ఆగస్టు 8 వరకు టోర్నీ జరగాల్సింది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో దీన్ని అక్కడ నిర్వహించడం లేదు. ‘‘ఈ ఏడాది చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్య హక్కుల కోసం బిడ్‌ వేయబోతున్నాం. ఆ టోర్నీ బడ్జెట్‌ సుమారు రూ.75 కోట్లు ఉంటుంది’’ అని ఏఐసీఎఫ్‌ కార్యదర్శి భరత్‌ సింగ్‌ వెల్లడించాడు. ఈ ఒలింపియాడ్‌తో పాటు దివ్యాంగుల కోసం తొలిసారి నిర్వహించాలనుకున్న చెస్‌ ఒలింపియాడ్‌, మిగతా టోర్నీలను కూడా రష్యా నుంచి తరలిస్తున్నట్లు ఫిడే ప్రకటించింది.

ఆటగాళ్ల శాంతి మంత్రం: ఓ వైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుంటే ఆ దేశ ఆటగాళ్లు మాత్రం శాంతి కోరుకుంటున్నారు. తాను యుద్ధాన్ని కాదు శాంతిని ప్రోత్సహిస్తానని టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకు అందుకోనున్న మెద్వెదెవ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు దుబాయ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్‌ చేరిన తర్వాత మరో రష్యా ఆటగాడు రుబ్లెవ్‌ కూడా ‘‘దయచేసి యుద్ధం వద్దు’’ అని పేర్కొన్నాడు. ఉక్రెయిన్‌కు చెందిన మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ విటాలి తన బాక్సింగ్‌ సోదరుడు వ్లాదిమిర్‌తో కలిసి యుద్ధంలో పోరాడుతానని తెలిపాడు. మరోవైపు ఫుట్‌బాల్‌ క్లబ్‌ చెల్సీ యజమాని రోమన్‌ అబ్రమోవిచ్‌ ఆస్తులు జప్తు చేయాలని తమ దేశ ప్రభుత్వాన్ని బ్రిటన్‌ మంత్రి క్రిస్‌ బ్రయాంట్‌ కోరారు.


ఇదీ చూడండి: టీమ్​ఇండియాదే టీ20 సిరీస్​.. శ్రీలంకపై ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.