ETV Bharat / sports

ఏజ్​ 40ప్లస్ అయినా తగ్గేదేలే, పారిస్​ ఒలింపిక్స్​పై శరత్​ కమల్ గురి

author img

By

Published : Aug 26, 2022, 6:22 PM IST

Sharath Kamal Achanta
Sharath Kamal Achanta

బర్మింగ్​హామ్​ కామన్​వెల్త్​ గేమ్స్​లో మూడు గోల్డ్​, ఒక సిల్వర్​ మెడల్​ సాధించిన టీటీ ప్లేయర్ ఆచంట శరత్​ కమల్​ ఈటీవీ భారత్​తో ముచ్చటించాడు. కామన్​వెల్త్​ గేమ్స్​లో తన ప్రదర్శన సహా భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పాడు.

Achanta Sharath Kamal CWG 2022 : ఇటీవల జరిగిన బర్మింగ్‌హామ్‌ కామన్​వెల్త్​ క్రీడల్లో మూడు గోల్డ్​, ఒక సిల్వర్​ మెడల్​ సాధించాడు టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్ ఆచంట శరత్ కమల్​. 40 సంవత్సరాల వయసులోనూ ఆటల్లో దూసుకుపోతున్నాడు. తన వయసు గురించి ఆలోచించకుండా ఆటపై దృష్టిపెట్టాడు. తాను సాధించిన మైలురాళ్లు ఇతరులకు స్ఫూర్తినిస్తాయంటున్నాడీ ఆటగాడు. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్ గేమ్స్​లో తాను చేసిన ప్రదర్శన, ఇలాంటి అద్భుత ప్రదర్శనలు చేయడానికి తనలో స్ఫూర్తి నింపిన వాటి గురించి, ఇలాంటి వయసులో అథ్లెట్లు ఎదుర్కొనే సమస్యల గురించి ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆచంట శరత్​ కమల్ పంచుకున్నాడు.

ప్రశ్న: టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత, పారిస్​ ఒలింపిక్స్​లో ఎప్పుడు కనిపిస్తారు అని అడిగినప్పుడు మీరు సమాధానమివ్వలేదు. ఇటీవలి మీ ఇంటర్య్వూలను బట్టి మీరు పారిస్​ ఒలింపిక్స్​కు సన్నద్ధమవుతున్నారు అనిపిస్తోంది. అప్పడు ఎలా ఉంది, ఈ మధ్య కాలంలో ఏం మారింది?

జవాబు: నేను రెండు సంవత్సరాలు విరామం తీసుకోవాలనుకున్నాను. తర్వాత ఆట గురించి ఆలోచించడానికి మరో రెండు సంవత్సరాలు సమయం కావాలనుకున్నాను. టోక్యో ఒలింపిక్స్​ తర్వాత, పారిస్​ ఒలింపిక్స్​కు మూడేళ్ల సమయం ఉన్నా.. ఆడతానని అనుకోలేదు. అప్పుడు నా మెయిన్ టార్గెట్​ కామన్​వెల్త్ గేమ్స్​, 2022 ఆసియా గేమ్స్. కానీ, ఆసియా గేమ్స్​ షెడ్యూల్​ 2023కు వెళ్లిపోయింది. దాంతో నేను పూర్తిగా బర్మింగ్‌హామ్‌ గేమ్స్ పైనే దృష్టి పెట్టాను. అందులో నా కెరీర్​ అత్యుత్తమ ప్రదర్శన చేశాను. నేను ఇప్పుడు పూర్తి కాన్ఫిడెన్స్​తో ఉన్నాను. ఇంకా రెండు సంవత్సరాలు కూడా సమయం లేని పారిస్​ ఒలింపిక్స్​లో తలపడడానికి సిద్ధంగా ఉన్నాను.

ప్రశ్న: మీరు మూడు గోల్డ్​ మెడల్స్​ సాధించడం అద్భుతం. దీనికి మీరు ఎలా ఫీల్​ అవుతున్నారు? ఈ కామన్వెల్త్​ గేమ్స్​ కారణంగా మెబైల్స్​, టీవీల ద్వారా ప్రేక్షకుల నుంచి మీకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని మీరు అనుకుంటున్నారా?
జవాబు: నేను 2006లో రెండు గోల్డ్​ మెడల్స్​ సాధించాను. కామన్వెల్త్​ గేమ్స్​లో టేబుల్​ టెన్నిస్​ విభాగంలో అదే మొదటి గోల్డ్​ మెడల్​. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా విషయాల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు స్పోర్ట్స్​ చాలా టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయి. టీవీల్లో చూసే ప్రేక్షకుల సంఖ్యా పెరిగింది. అలా చాలా మంది నన్ను చూస్తున్నారు. అదే నన్ను విదేశీ గడ్డపై మ్యాచ్​లు గెలిసేలా చేసింది. ఈ గేమ్​ పాపులర్​ అవడానికి కూడా అదే కారణం. అప్పటి కంటే ఇప్పుడు నన్ను ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు. నా మ్యాచ్​లు చూసి, నాకు సపోర్ట్​ చేస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు.

ప్రశ్న: మీరు ఇంటర్య్వూలలో, మ్యాచ్​లు జరుగుతున్నప్పుడు తరచుగా మీ వయసు గురించి ప్రస్తావిస్తున్నారు. మీలో ఆడే పట్టుదల ఉన్నా, ఈ వయసులో నిర్దేశించుకున్న మైలురాళ్లు చేరుకుని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని అనుకుంటున్నారా?
జవాబు: నేనూ తరచుగా నా వయసు గురించి ప్రస్తావించాను. అది నిజమే. కానీ ఇప్పుడు 30 ఏళ్ల అథ్లెట్​లా ఆడుతున్నాను. దీనికి నా ఫిట్​నెస్​ కోచ్​, మెంటల్​ కోచ్​, టేబుల్ టేన్నిస్​ కోచ్​లే కారణం. వాళ్లే ఇది సాధ్యమయ్యేలా చేశారు. నేను ఇప్పుడే మూడు గోల్డ్​, ఒక సిల్వర్​ మెడల్​ సాధించిన 40 సంవత్సరాల ప్లేయర్​ని. ఇంతకన్నా నన్ను మీరేం అడగగలరు? ఇదే నా మైలురాయి అనుకుంటున్నాను. స్పోర్ట్స్​ని ఆడేవాళ్లకు, చూసేవారికి ఇది స్ఫూర్తిదాయకం అని నేను భావిస్తున్నాను.

ప్రశ్న: కామన్​వెల్త్​ గేమ్స్​లో వెంట వెంటనే మ్యాచ్​లు ఆడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
జవాబు: మూడు రోజుల్లో దాదాపు 12 మ్యాచ్​లు ఆడాను. మొదటి రోజు 14 గంటల్లో ఆరు మ్యాచ్​లు ఆడాను. దాని తర్వాత ప్రతిరోజు మూడు మ్యాచ్​లు ఆడాను. అయితే ఇలా వెంట వెంటనే ఆడటం శరీరానికి, మైండ్​కు చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను మంచి ప్రణాళికతో సన్నద్ధమై ఈ గేమ్స్​కు వచ్చాను. ఇంతకుముందు ఆడిన అనుభవంతో కామన్​వెల్త్​ గేమ్స్​కు 8 నెలల ముందు నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. అప్పుడు రోజుకు మూడు, నాలుగు సెషన్స్​ ప్రాక్టీస్​ చేసేవాడిని. అవి కామన్​వెల్త్​ గేమ్స్​లో ఉండే సెషన్స్​లా ఉండేవి. దాంతో నాకు కామన్​వెల్త్​లో సులభమైంది. నేను ప్రతి రోజు, మొదటి రోజు అన్నట్టే ఫ్రెష్​గా లేచేవాడిని. ఎందుకంటే నేను నా శరీరం పై శ్రద్ధ పెట్టేవాడిని. ప్రతిరోజు రాత్రి గంట, గంటన్నర సేపు వ్యాయామం చేసేవాడిని.

ప్రశ్న: పారిస్​ ఒలింపిక్స్​లో మెడల్​ సాధించడమే మీ లక్ష్యమా?
జవాబు: అవును, అన్ని ఆటల్లో, అందరు ఆటగాళ్లకు అదే అత్యుత్తమ కల. నాకు సంబంధించినంత వరకు పారిస్​ ఒలింపిక్స్​ నా లక్ష్యం. మాకు ఒక మంచి టీం ఉంది. రాబోయే ఒలింపిక్స్​లో మేము చరిత్ర సృష్టిస్తామని ఆశిస్తున్నాము.

ఇవీ చూడండి: ధోనీపై కోహ్లీ ట్వీట్​, ఆ నెంబర్స్​ వెనక అర్థం ఏమిటో

బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.