ETV Bharat / sports

మీరాబాయిని అనుకరించిన చిన్నారి.. వీడియో వైరల్​

author img

By

Published : Jul 27, 2021, 2:21 PM IST

Updated : Jul 27, 2021, 2:50 PM IST

ఓ చిన్నారి మీరాబాయి చానును అనుకరించింది. అచ్చం ఆమెలాగే వెయిట్​లిఫ్టింగ్ చేసింది. టోక్యోలో పతకం గెలుపొందిన అనంతరం చాను ఎలా చేసిందో.. ఆ బాలిక కూడా అలాగే చేతులు ఊపుతూ సరాదాగా నటించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

India's sporting future looks bright
మీరాబాయిని అనుకరించిన చిన్నారి.. వీడియో వైరల్​

పిల్లలకు ఎవరైనా నచ్చాలే గానీ.. వారిని అనుకరించకుండా ఉండలేరు. అలానే ఓ చిన్నారికి వెయిట్‌ లిఫ్టర్‌ చాను నచ్చేసింది. వెంటనే తన చిట్టి చేతులపై పౌడర్‌ పోసుకొని రుద్దుకొంది. అక్కడే ఉన్న వెయిట్‌ లిఫ్టింగ్‌ రాడ్‌ వద్దకు వెళ్లి దండం పెట్టుకొంది. ఎందుకో అనుమానం వచ్చి.. వెనుకాలే ఉన్న టీవీలో చాను ఏం చేస్తోందో చూసింది..! ఆ చిన్నారి వెనకాలే ఉన్న టీవీలో మీరాబాయి చాను టోక్యోలో వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న వీడియో ప్రసారం అవుతోంది..! వెంటనే ఆ చిన్నారి కూడా రాడ్‌ గ్రిప్‌ను సరిచూసుకొని.. స్నాచ్‌.. క్లీన్‌ అండ్‌ జర్క్‌ మొత్తాన్ని కలిపికొట్టేసింది. ఆ తర్వాత చానును అనుకరిస్తూ ఓ వెండి పతకాన్ని మెడలో వేసుకొని అభివాదాలు.. సంబరాలు మొదలుపెట్టింది. ఈ చిట్టితల్లి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్​లో వైరల్‌గా మారింది. ఈ పాప భారత వెయిట్‌ లిఫ్టర్‌ సతీష్‌ శివలింగమ్‌ కుమార్తె!

ఈ వీడియోను కామన్వెల్త్‌ స్వర్ణపతకాల విజేత అయిన సతీష్‌ శివలింగమ్‌ మీరాబాయి చానుకు ట్యాగ్‌ చేశారు. "జూనియర్‌ మీరాబాయి చాను.. ప్రేరణ అంటే ఇదే" అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ట్వీట్‌ చూసి మురిసిపోయిన చాను రీట్వీట్‌ చేసింది. "చాలా ముద్దుగా ఉంది. జస్ట్‌ లవ్‌ దిస్‌" అని క్యాప్షన్‌ ఇచ్చింది.

ఈ వీడియోను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా తన అధికారిక ట్విట్టర్​లో షేర్ చేసింది. 'భారత క్రీడా భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది' అంటూ క్యాప్షన్ పెట్టింది.

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఇటీవలే స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. దేశాన్ని, రాష్ట్రాన్ని గర్వపడేలా చేసిన మీరాబాయి చానుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవం కల్పించింది. మణిపూర్‌ ప్రభుత్వం పోలీస్‌ శాఖలో ఉన్నతోద్యోగిగా నియమించింది.

ఇదీ చదవండి: స్వదేశానికి మీరాబాయి.. ఏఎస్పీగా ఉద్యోగం

Last Updated : Jul 27, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.