ETV Bharat / sports

Faisal Ali Dar: బ్రూస్‌లీ, జాకీ చాన్‌ సినిమాలతో ప్రేరణ పొంది.. పద్మశ్రీకి ఎంపికై

author img

By

Published : Jan 28, 2022, 1:51 PM IST

Faisal Ali Dar Inspirational Story: జమ్మూకశ్మీర్​లో యువత క్రీడలవైపు.. దృష్టి సారిస్తోంది.  అందుకు కారణం ఫైజల్‌ అలీ దర్‌. ఒకప్పటి కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌.. ఇప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. తన పర్యవేక్షణలో పలువురు క్రీడాకారులు భవిష్యత్‌ తారలుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీకి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఫైజల్‌ గురించి మరిన్ని విశేషాలు..

Faisal Ali Dar Inspirational Story
ఫైజల్‌ అలీ దర్‌

Faisal Ali Dar Inspirational Story: జమ్మూకశ్మీర్‌లో కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అక్కడి యువత ప్రధానంగా క్రీడలవైపు దృష్టి సారిస్తోంది. అందుకు కారణం ఫైజల్‌ అలీ దర్‌. ఒకప్పటి కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌.. ఇప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. తన పర్యవేక్షణలో పలువురు క్రీడాకారులు భవిష్యత్‌ తారలుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీకి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఫైజల్‌ గురించి మరిన్ని విశేషాలు..

అదృష్టం కలిసిరాక..

Faisal Ali Dar Inspirational Story
అదృష్టం కలిసిరాక..

Marshal Arts Trainer Faisal Ali Dar: ఫైజల్‌ తొలుత కుంగ్‌ఫూ పోటీల్లో శిక్షణ పొందాడు. ప్రస్తుత జాతీయ కోచ్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత కుల్‌దీప్‌ హందూ వద్ద జమ్మూలో తన కెరీర్‌ ఆరంభించాడు. అయితే, ఆ పోటీలకు కావాల్సిన క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు కూడా అప్పట్లో తన వద్ద రూ.4వేలు కరవయ్యాయని తాజాగా అతడు గుర్తు చేసుకున్నాడు. అలాగే 2008లో రూ.6700 ఫీజు కట్టలేక బ్లాక్‌ బెల్ట్‌ పరీక్ష కూడా కోల్పోయానని చెప్పాడు. ఈ క్రమంలోనే కుంగ్‌ఫూ పోటీల్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఒక్క పతకమూ గెలవలేక తీవ్ర నిరాశకు గురైన ఫైజల్‌.. తర్వాత తన కెరీర్‌ను మార్చుకొని కిక్‌ బాక్సింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక్కడ 2010లో ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించినా.. సరైన గుర్తింపు దక్కలేదు. దీంతో చివరికి 2013లో తన ఆటకు ముగింపు పలికాడు.

బ్రూస్‌లీ, జాకీచాన్‌ సినిమాలు అద్దెకు తెచ్చుకొని..

Faisal Ali Dar Inspirational Story
బ్రూస్‌లీ, జాకీచాన్‌ సినిమాలు అద్దెకు తెచ్చుకొని..

ఈ మార్షల్ ఆర్ట్స్‌ కోచ్‌.. చిన్నప్పుడు తన క్రీడలో ప్రావీణ్యం పెంచుకొనేందుకు బ్రూస్‌లీ, జాకీచాన్‌ లాంటి యాక్షన్‌ హీరోల సినిమాలు చూసేవాడు. అది కూడా తన తండ్రిని డబ్బులు అడిగి మరీ ఆయా హీరోల సినిమా క్యాసెట్లు అద్దెకు తెచ్చుకునేవాడు. అలా 'గేమ్‌ ఆఫ్‌ డెత్‌', 'ఎంటర్‌ ది డ్రాగన్‌', 'డిఫెండర్‌', 'డ్రంకెన్‌ మాస్టర్‌' లాంటి తదితర సినిమాల నుంచి ప్రేరణపొంది.. వాటిల్లోని యాక్షన్‌ సన్నివేశాలను గమనించి తన స్నేహితుల ముందు ప్రదర్శించేవాడు. అప్పుడు కిక్‌ బాక్సింగ్‌లో డిఫెండింగ్‌ చేసేందుకు గ్లౌవ్స్ లేకపోవడంతో చెప్పులతో ప్రాక్టీస్‌ చేసేవాళ్లమని ఫైజల్‌ తన పాత రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. శిక్షణ కోసం తండ్రి సంపాదన సరిపోకపోవడంతో.. ఫైజల్‌ వివిధ పనులు చేసేవాడు. ఎలక్ట్రానిక్‌ పరికరాల రిపేర్ సెంటర్‌ ప్రారంభించడంతో పాటు దగ్గర్లోని యాపిల్‌ పండ్ల రవాణాకు సంబంధించిన కూలి పనికి వెళ్లేవాడు. అలాగే డిష్‌ టీవీలు బిగిస్తూ వచ్చే డబ్బులతో కిక్‌ బాక్సింగ్‌ సామగ్రి కొనుగోలు చేసేవాడు.

యువత తప్పుదోవ పట్టకుండా..

Faisal Ali Dar Inspirational Story
యువత తప్పుదోవ పట్టకుండా..

ఫైజల్ క్రీడాకారుడిగా ఉన్నప్పుడే స్వతహాగా చిన్నారులకు శిక్షణ అందించడం ప్రారంభించాడు. అక్కడి యువత తప్పుదోవ పట్టకుండా ఉండాలంటే క్రీడలే సరైన మార్గమని భావించి వారిని అటువైపు ప్రోత్సహించాడు. 2013లోనే సొంతంగా 'అలీ స్పోర్ట్స్‌ అకాడమీ' నెలకొల్పి స్థానికంగా ఉండే పార్కులు, మైదానాల్లో చిన్నారులకు వివిధ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేవాడు. చివరికి 2018లో ఓ ప్రభుత్వ పాఠశాలలో అకాడమీని కొనసాగించేందుకు అనుమతులు ఇవ్వడంతో తన కల సాకారమైంది. అక్కడి వారికి సరైన శిక్షణ ఇస్తే అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తారనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్‌లోని పలు జిల్లాల్లో శిక్షణా కేంద్రాలను ప్రారంభించి సుమారు 13 వేల మందికి శిక్షణ ఇస్తున్నాడు. అయితే, మొదట్లో ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఒప్పించడం కష్టమయ్యేదని ఫైజల్‌ పేర్కొన్నాడు. వారు ఎప్పుడైతే రాణించి స్వతహాగా జీవనోపాధి సంపాదించుకుంటారో అప్పుడు వారి తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.

పతకాలు సాధిస్తున్న యువతరం..

Faisal Ali Dar Inspirational Story
పతకాలు సాధిస్తున్న యువతరం..

ఫైజల్‌ వద్ద శిక్షణ పొందుతున్న వారిలో పలువురు ఛాంపియన్లు ఉన్నారు. వారిలో జూనియర్‌ ప్రపంచ కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా రెండుసార్లు పేరొందిన తాజాముల్‌ ఇస్లామ్‌, 2017 మలేసియా వుషు అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అబిదా అక్తర్‌, జూనియర్‌ ఆసియా కరాటే ఛాంపియన్‌ హషీమ్‌ మన్సూర్‌, అంతర్జాతీయ తైక్వాండో విజేత షేక్‌ అద్నాన్‌ ఉన్నారు. తన వద్ద శిక్షణ పొందే చాలా మంది క్రీడాకారులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తారని, దేశానికి పతకాలు సాధించి గర్వకారణంగా నిలుస్తారని ఫైజల్‌ దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏదేమైనా జమ్మూకశ్మీర్‌ లాంటి ప్రాంతంలో యువతను సరైన మార్గంలో నడిపిస్తోన్న ఫైజల్‌కు అభినందనలు. ఆయన అనుకున్న ఫలితాలు సాధించాలని, భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుందాం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'మహా' సర్కార్​కు సుప్రీంలో ఎదురుదెబ్బ- భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్​ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.