ETV Bharat / sports

Australian Open: 63వ గ్రాండ్​స్లామ్​లో నెరవేరిన కల.. క్వార్టర్స్‌లో కార్నెట్‌

author img

By

Published : Jan 25, 2022, 7:26 AM IST

Alize Cornet News: అప్పుడెప్పుడో 2005లో గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రం చేసి.. 2007 నుంచి ప్రతి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ పోటీ పడ్డ కార్నెట్‌.. ఈ ఏడాదికి ముందు ఒక్కసారి కూడా క్వార్టర్స్‌ చేరలేకపోయింది. అయినా పోరాటాన్ని వదలని 32 ఏళ్ల ఆమె.. ఇప్పుడు తన 63వ గ్రాండ్‌స్లామ్‌లో ఆ కలను నిజం చేసుకుంది. మరోవైపు.. 15 ఏళ్ల క్రితం తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన 36 ఏళ్ల కనెపి.. ఇన్నేళ్ల దండయాత్ర తర్వాత ఎట్టకేలకు టోర్నీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో సీడ్‌ సబలెంకకు కనెపి షాకిసే.. రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత హలెప్‌ను కార్నెట్‌ ఓడించింది.

alize cornet news
కార్నెట్‌

Alize Cornet News: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో ఏ మాత్రం అంచనాలు లేని కనెపి (ఈస్తోనియా), కార్నెట్‌ (ఫ్రాన్స్‌) ఏకంగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. సోమవారం నాలుగో రౌండ్లో కనెపి 5-7, 6-2, 7-6 (10-7) తేడాతో రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌)పై విజయం సాధించింది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 115వ స్థానంలో ఉన్న కనెపి తొలి సెట్లో గొప్పగా ప్రతిఘటించింది. ఏస్‌లు, విన్నర్లతో చెలరేగిన ఇద్దరు క్రీడాకారిణులు ఓ దశలో 5-5తో నిలిచారు. ఆ సమయంలో తన సర్వీస్‌ నిలబెట్టుకోవడంతో పాటు తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సబలెంక తొలి సెట్‌ దక్కించుకుంది. కానీ అద్భుతంగా పుంజుకున్న కనెపి రెండో సెట్‌ను ఏకపక్షంగా మార్చేసింది. తొలి సర్వీస్‌నే బ్రేక్‌ చేసిన ఆమె ఏ దశలోనూ ఆగలేదు. ప్రత్యర్థి తప్పిదాలు కూడా ఆమెకు కలిసొచ్చాయి. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ ఓ దశలో కనెపి 4-2తో ఆధిక్యంలో నిలిచింది. కానీ వరుసగా రెండు గేమ్‌లు గెలిచిన సబలెంక 4-4తో స్కోరు సమం చేసింది. మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకున్న కనెపి పోరును టైబ్రేకర్‌కు మళ్లించింది. అందులోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డారు. కీలక సమయంలో పైచేయి సాధించిన కనెపి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఆమె 5 ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది.

రెండో రౌండ్లో మూడో సీడ్‌ ముగురుజాను ఓడించిన కార్నెట్‌.. ప్రి క్వార్టర్స్‌లో 6-4, 3-6, 6-4తో మాజీ నంబర్‌వన్‌ హలెప్‌ (రొమేనియా)పై గెలిచింది. తొలి సెట్‌ నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కార్నెట్‌ 3-1తో ఆధిక్యం సాధించింది. మధ్యలో హలెప్‌ పోరాడినా.. కార్నెట్‌ ఆ సెట్‌ దక్కించుకుంది. రెండో సెట్‌ ఆరంభంలోనూ ఆమెదే దూకుడు. కానీ పుంజుకున్న హలెప్‌ వరుసగా అయిదు గేమ్‌లు గెలిచి సెట్‌ సొంతం చేసుకుంది. ఇలాగే సాగిన మూడో సెట్లో కార్నెట్‌ పైచేయి సాధించింది. ఏడో సీడ్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) 5-7, 6-3, 6-3తో సిర్స్‌టీ (రొమేనియా)పై, కొలిన్స్‌ (అమెరికా) 4-6, 6-4, 6-4తో మెర్టెన్స్‌ (బెల్జియం)పై నెగ్గారు.

కష్టంగా క్వార్టర్స్‌లో: పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరేట్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-2, 7-6 (7-4), 6-7 (4-7), 7-5తో క్రెస్సీ (అమెరికా)పై పోరాడి గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. రెండు గేమ్‌లే కోల్పోయి తొలి సెట్‌ గెలుచుకున్న రెండో సీడ్‌ మెద్వెదెవ్‌కు పోటీ ఉండదనే అనిపించింది. కానీ రెండో సెట్‌ నుంచి క్రెస్సీ దీటైన ఆటతో ప్రతిఘటించాడు. నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 4-6, 6-4, 4-6, 6-3, 6-4తో ఫ్రిట్జ్‌ (అమెరికా)పై కష్టపడి నెగ్గాడు. తొమ్మిదో సీడ్‌ అగర్‌ (కెనడా) 2-6, 7-6 (9-7), 6-2, 7-6 (7-4)తో సిలిచ్‌ (క్రొయేషియా)పై, సిన్నర్‌ (ఇటలీ) 7-6 (7-3), 6-3, 6-4తో డిమినార్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌ చేరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: సమస్యల సుడిగుండంలో టీమ్​ఇండియా.. బయటపడే దారేది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.