ETV Bharat / sports

IPL 2022: ఆర్​సీబీ కెప్టెన్సీ రేసులో ఎవరెవరు ఉన్నారంటే?

author img

By

Published : Feb 4, 2022, 7:17 PM IST

RCB Next Captain
ఆసక్తిగా ఆర్​సీబీ కెప్టెన్‌ రేసు

RCB Next Captain: ఇన్నేళ్లుగా ఆర్​సీబీ జట్టుకు సారథ్యం వహిస్తూ వచ్చిన విరాట్​ కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న నేపథ్యంలో ఆ జట్టు కొత్త కెప్టెన్​ ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ రేసులో డేవిడ్​ వార్నర్​, క్వింటన్​ డికాక్​, శ్రేయస్​ అయ్యర్​ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరి వీరిలో ఎవరిని ఆర్​సీబీ జట్టులోకి తీసుకుంటుందో.. ఎవరికి పగ్గాలు అప్పగింస్తుందో అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RCB Next Captain: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి పోటీపడుతున్నా ఒక్కసారీ కప్పు సాధించలేదు. ఏటా ఎన్ని ప్రయోగాలు చేసినా రిక్త హస్తాలతోనే తిరిగొస్తోంది. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఎంత కష్టపడినా టైటిల్‌ నెగ్గలేక ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడు ఇప్పుడు ఆ జట్టులోనే కొనసాగుతున్నా ఆ ఫ్రాంఛైజీ మాత్రం వేరే సారథిని నియమించుకోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆర్​సీబీ కెప్టెన్‌గా ఎవర్ని నియమించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయ్యో విరాట్‌ ఎంత కష్టపడ్డావ్‌..

విరాట్‌ కోహ్లీని బెంగళూరు జట్టు 2008లోనే కొనుగోలు చేసింది. దీంతో అప్పటి నుంచి అతడు ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో మరే ఇతర ఆటగాడు కూడా ఇలా ఒక్క జట్టుతోనే కొనసాగింది లేదు. ఈ క్రమంలోనే 2014లో ఆ జట్టు పగ్గాలు స్వీకరించి గతేడాది దాకా సారథిగా కొనసాగాడు. అయితే, ఇన్నేళ్లు కెప్టెన్సీ చేసినా విరాట్‌ ఒక్కసారి కూడా టైటిల్‌ అందివ్వలేకపోయాడు. మరోవైపు 2016లో కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సమయంలో ఏకంగా ఆ టోర్నీలో నాలుగు సెంచరీలు బాది మరీ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే అక్కడ త్రుటిలో ఆ జట్టు కప్పు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్‌ మళ్లీ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లలేకపోయాడు. అయితే, గతేడాది యూఏఈ లెగ్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.

RCB Next Captain
విరాట్​ కోహ్లీ

కాగా, ఇప్పుడు కోహ్లీ తర్వాత ఆర్​సీబీని నడిపించే నాయకుడి కోసం ఆ జట్టు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధానంగా డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌, సురేశ్‌ రైనా, శ్రేయస్‌ అయ్యర్‌, క్వింటన్‌ డికాక్‌, ఇయాన్‌ మోర్గాన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రేసులో ఏబీ డివిలియర్స్‌ పేరు వినిపించినా.. ఇప్పుడు అతడు ఆటకు దూరమవ్వడం వల్ల ఇతర ఆటగాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఈ ఆటగాళ్లకు ఉన్న అవకాశాలేంటి..?.. వారు ఇదివరకు ఎలా ఆడారో చూద్దాం..

ముందు వరుసలో వార్నరే..

ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలిసిందే. టోర్నీ టాప్‌ స్కోరర్ల జాబితాలో 5,449 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు కెప్టెన్‌గానూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను విజయవంతంగా నడిపించాడు. 2016లో ఆ జట్టుకు టైటిల్‌ అందించిన వార్నర్‌ తర్వాత పరుగుల వరద పారించి నాలుగేళ్లు వరుసగా ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అయితే, గతేడాది ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడిన అతడిని జట్టు యాజమాన్యం పక్కనపెట్టింది. తొలుత తుది జట్టు నుంచి తప్పించి తర్వాత కెప్టెన్‌గానూ తీసేసింది. దీంతో వార్నర్‌ ఇప్పుడు వేరే జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, సన్‌రైజర్స్‌ తరఫున అంత మంచి రికార్డు ఉండటం వల్ల ఇప్పుడు ఆర్​సీబీ కెప్టెన్‌గా వార్నర్‌ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే తీసుకుంటే అతడికి జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఇతరులతో పోల్చితే ఎక్కువగా ఉన్నాయి.

RCB Next Captain
డేవిడ్​ వార్నర్

పంత్​ వచ్చేసరికి..

ఆర్​సీబీలాగే దిల్లీ క్యాపిటల్స్‌ సైతం ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ నెగ్గలేదు. కానీ, ఆ జట్టు మూడేళ్లుగా అద్భుతంగా రాణిస్తోంది. 2018లో తొలిసారి శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు పగ్గాలు అందుకొని బ్యాట్స్‌మన్‌గా రాణించినా కెప్టెన్‌గా విఫలమయ్యాడు. అయితే, తర్వాత ఇంకాస్త బాగా ఆడిన అతడు జట్టును మేటిగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే వరుసగా రెండేళ్లు దిల్లీ ప్లేఆఫ్స్‌ చేరింది. 2020లో ఏకంగా ఫైనల్‌ చేరినా త్రుటిలో కప్పు కోల్పోయింది. దీంతో శ్రేయస్‌ యువ సారథిగా ఆకట్టుకున్నాడు. అయితే, గతేడాది గాయం కారణంగా భారత్‌లో జరిగిన టోర్నీలో అతడు ఆడకపోవడం వల్ల రిషభ్ పంత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతడు కూడా దిల్లీని విజయవంతంగా నడిపించే సరికి ఈసారి ఆ ఫ్రాంఛైజీ శ్రేయస్‌ను వదిలేసుకుంది. ఇప్పుడు బెంగళూరుకు వార్నర్‌ తర్వాత మంచి అనుభజ్ఞుడైన కెప్టెన్‌గా శ్రేయస్‌ కనిపిస్తున్నాడు.

RCB Next Captain
శ్రేయస్​ అయ్యర్

రైనా.. కెప్టెన్సీకి తక్కువేమీ కాదు..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎంత విజయవంతమైన జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబయి తర్వాత అత్యధికంగా నాలుగుసార్లు కప్పు సాధించిన ఘనత ఆ జట్టుది. అలాంటి జట్టులో ఇన్నాళ్లూ ప్రధాన బ్యాట్స్‌మన్‌గా సేవలందించిన సురేశ్‌ రైనా ఈసారి వేలంలో పాల్గొనబోతున్నాడు. రిటెన్షన్‌ విధానంలో సీఎస్కే వదిలేయడం వల్ల అతడిని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రైనా ప్రస్తుతం 5,528 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత అంత పేరుగాంచిన ఆటగాడు అతడు. వైస్‌ కెప్టెన్‌గానూ సీఎస్కేకు ఎంతోకాలం పనిచేసిన అనుభవం అతడి సొంతం. దీంతో ఆర్​సీబీ ఒకవేళ రైనాను తీసుకుంటే.. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా నియమించుకునే అవకాశం లేకపోలేదు.

RCB Next Captain
సురేశ్​ రైనా

క్వింటన్‌ డికాక్‌ కూడా సరిపోతాడు..

ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌కు ఎలాంటి స్థితిలోనైనా ఆడగలడ సత్తా ఉంది. ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌ జట్టులో ఓపెనర్‌గా రాణించిన క్వింటన్‌ డికాక్‌ అవకాశం వస్తే కెప్టెన్సీ చేయగల సమర్థుడు. గత మూడు సీజన్లలో రాణించినా ముంబయి ఈసారి అతడిని వదులుకుంది. దీంతో అందరిలాగే వేలంలో పాల్గొంటున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అతడికి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉండటం వల్ల.. ఆర్​సీబీ డికాక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ బెంగళూరు నిజంగా డికాక్‌ను తీసుకుంటే.. బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌గానే కాకుండా వికెట్‌ కీపర్‌గానూ సేవలందిస్తాడు. దీంతో ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను కూడా ఆర్​సీబీ కెప్టెన్సీ జాబితాలో విస్మరించకపోవచ్చు.

RCB Next Captain
క్వింటన్​ డికాక్

స్మిత్‌, మోర్గాన్‌ కూడా..

స్టీవ్‌స్మిత్‌, ఇయాన్‌ మోర్గాన్‌ సైతం కెప్టెన్లుగా, బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకునే క్రికెటర్లే. వీరిద్దరికీ ఐపీఎల్‌లో నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు.. మోర్గాన్‌కు కోల్‌కతా జట్టుకు కెప్టెన్సీ చేశారు. అయితే, అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. బ్యాట్స్‌మెన్‌గా మెరుపులు మెరిపించే ఆటగాళ్లే అయినా ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఒకరు కెప్టెన్సీ పరంగా విఫలమైతే మరొకరు బ్యాట్స్‌మన్‌గా చతికిల పడ్డారు. స్మిత్‌ 2020లో బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకున్నా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. అయితే, గతేడాది దిల్లీ జట్టులోనూ వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరోవైపు మోర్గాన్‌ గతేడాది కోల్‌కతా టీమ్‌లో బ్యాట్స్‌మన్‌గా విఫలమైనా జట్టును ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వీరిద్దర్నీ ఆయా ఫ్రాంఛైజీలు వదిలేసుకున్నాయి. ఇప్పుడు వేలంలో పాల్గొంటుండం వల్ల ఆర్​సీబీ తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చనే ఆలోచనలో ఉండొచ్చు.

RCB Next Captain
మోర్గాన్

ఇదీ చూడండి : కోహ్లీ అలా చేస్తాడని అనుకోలేదు: శార్దుల్ ఠాకుర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.