IND vs ENG Test: ఇంగ్లాండ్​తో సిరీస్‌ అయిందా.. ఉందా?

author img

By

Published : Sep 12, 2021, 6:56 AM IST

Updated : Sep 12, 2021, 7:29 AM IST

India vs England

అనూహ్య పరిణామాల మధ్య ఆగిపోయిన భారత్‌-ఇంగ్లాండ్‌(Ind vs Eng 5th test) అయిదో టెస్టు భవితవ్యంపై అంతులేని సందిగ్ధత నెలకొంది. ఈ మ్యాచ్‌ పూర్తిగా రద్దయినట్లా? వాయిదా వేశారా? భారత్‌ ఆ మ్యాచ్‌ను వదులుకున్నట్లా? సిరీస్‌ ఇంతటితో ముగిసిందా లేదా? ఇలా అభిమానుల మదిలో మెదులుతున్న పలు ప్రశ్నలకు సమాధానం ఇప్పుడే దొరికేలా కనిపించడం లేదు. ఈ మ్యాచ్​ను ఏం చేయాలన్నదానిపై ఈసీబీ(ECB).. ఐసీసీకి లేఖ రాయనున్నట్లు తెలిసింది. మరి ఐసీసీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో(Ravi Shastri News) పాటు సహాయ సిబ్బందిలో మరో ముగ్గురు కొవిడ్‌ బారిన పడ్డ నేపథ్యంలో భారత్‌, ఇంగ్లాండ్‌(Ind vs Eng Test) మధ్య శుక్రవారం ఆరంభం కావాల్సిన అయిదో టెస్టును ఆపేశారు. ఆటగాళ్లలో ఎవరికీ కరోనా సోకినట్లు తేలకపోయినప్పటికీ.. గత కొన్ని రోజులుగా సహాయ సిబ్బందితో కలిసి మెలిసి సాగిన నేపథ్యంలో ఈ ఆందోళనకర మానసిక స్థితిలో మ్యాచ్‌ ఆడటం కష్టమని భారత జట్టు స్పష్టం చేయడంతో మ్యాచ్‌ను ప్రస్తుతానికి రద్దు చేయక తప్పలేదు. అయితే ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తేలట్లేదు. మ్యాచ్‌ను వచ్చే ఏడాది వీలును బట్టి నిర్వహిస్తారని వార్తలొస్తున్నా.. ఇందుకు బీసీసీఐ(BCCI News) కూడా అంగీకారం తెలిపినప్పటికీ.. తుది నిర్ణయం ఏంటన్నదే తెలియడం లేదు.

"ప్రస్తుతం రద్దయిన మ్యాచ్‌ను తర్వాత నిర్వహించుకునే అవకాశాన్ని ఈసీబీకి ఇచ్చాం. ఇరు బోర్డులు కలిసి ఈ మ్యాచ్‌ను మళ్లీ ఎప్పుడు ఆడించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాయి" అని బీసీసీఐ కార్యదర్శి జై షా మీడియాకు వెల్లడించాడు. మరోవైపు ఈసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టామ్‌ హారిసన్‌ మాట్లాడుతూ.. "బీసీసీఐ మాకు ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసుకునే అవకాశం కల్పించడం శుభ పరిణామం. అయితే ఈ మ్యాచ్‌ ప్రస్తుత సిరీస్‌లోనే భాగంగా ఉంటుందా.. లేక వేరే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌గా ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం" అన్నాడు.

ఈ మూడింట్లో ఏది?

ప్రస్తుతానికి ఆగిపోయిన భారత్‌-ఇంగ్లాండ్‌(Ind vs Eng Update) అయిదో టెస్టు భవితవ్యం ఏంటన్న దానిపై మూడు రకాల ప్రత్యామ్నాయాలున్నాయి. అవేంటంటే..?

  • మళ్లీ ఆడించే అవకాశం లేకుంటే, రీషెడ్యూల్‌ చేయడంపై ఐసీసీ అభ్యంతరం చెబితే ఈ మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశముంది. అప్పుడిది అయిదు టెస్టుల సిరీస్‌ కాదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌గా ముగుస్తుంది. సిరీస్‌ 2-1తో భారత్‌ సొంతమవుతుంది.
  • బీసీసీఐ, ఈసీబీ ప్రస్తుతం ఆగిపోయిన మ్యాచ్‌ను మళ్లీ వీలు చూసుకుని ఆడించాలనే భావిస్తున్నాయి. వచ్చే ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లినపుడు ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత సిరీస్‌లో భాగంగానే ఆ మ్యాచ్‌ను ఆడిస్తారా.. లేక ఆ మ్యాచ్‌ వేరా అన్నదానిపై స్పష్టత లేదు. అదే వేరే మ్యాచ్‌ అయితే ఇప్పటికే సిరీస్‌ ముగిసినట్లు, భారత్‌ 2-1తో సిరీస్‌ సొంతం చేసుకున్నట్లు అవుతుంది.
  • అయిదో టెస్టు ఆడేందుకు విముఖత చూపించింది భారత జట్టే కాబట్టి.. ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చినట్లు పరిగణించే అవకాశమూ లేకపోలేదు. ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా తీసుకోవచ్చు. అప్పుడు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ గెలిచినట్లు, సిరీస్‌ 2-2తో సమమైనట్లు భావించాలి.

ఇదీ చదవండి:

Ind vs Eng: 'భారత్ చివరి టెస్టు ఆడకపోవడానికి కారణమదే'

T20 World Cup: 'మెంటార్​గా ధోనీ అవసరం ఏముంది?'

Last Updated :Sep 12, 2021, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.