ETV Bharat / sports

Kohli Birthday: ఆగని పరుగుల ప్రవాహం.. విజయాల దాహం!

author img

By

Published : Nov 5, 2021, 7:56 AM IST

బ్యాటర్​గా దూకుడు.. అమ్మాయిల కలల రాకుమారుడు.. మైదానంలో ప్రత్యర్థులతో మాటల తూటాలు.. సారథిగా అత్యధిక విజయాలు.. చిన్నవయసులోనే అంతులేని రికార్డులు.. ఇన్ని అద్భుతాలు టీమ్ఇండియా రన్​మెషీన్ విరాట్ కోహ్లీ సొంతం. అరుదైన ఘనతలతో సగటు ప్రేక్షకుడి దగ్గరి నుంచి క్రికెట్ అభిమానుల వరకు అందరూ మెచ్చిన క్రికెట్ వీరుడు ఈ విరాటుడు. ఈ రోజు కోహ్లీ (Virat Kohli Birthday) పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

virat kohli birthday
విరాట్​ కోహ్లీ

రెండు రోజుల కిందటే అంతర్జాతీయ క్రికెట్​లో కోహ్లీ అరంగేట్రం చేసి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన కెరీర్​ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు కోహ్లీ. నిజమే.. అతడే కాదు.. సగటు క్రికెట్​ అభిమాని కూడా అతడి ఘనతల పట్ల గర్వంగా ఉంటాడు.

virat kohli birthday
కోహ్లీ

విరాట్​కు ఉన్న పరుగుల దాహం, ఆకలి ఎవరికీ ఉండదంటారు సహచరులు. ఆ ఆకలి.. గెలుపు కోసం. ఎన్ని సార్లు గెలిచినా.. మళ్లీ మళ్లీ గెలుస్తూనే ఉండాలి.. భారత్​ను గెలిపిస్తూనే ఉండాలనే ఆకలి. ఈ క్రమంలోనే పరుగుల వరద పారించాడు. ఎంతగా అంటే.. అతడిని 'రన్​ మెషీన్​' అని పిలుచుకునేంత. కెరీర్​లో ఇప్పటికే 23 వేల పైచిలుకు పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో (Virat Kohli News) అత్యధిక పరుగుల (3225) వీరుడిగా ఉన్నాడు.

రికార్డుల రారాజు

కోహ్లీ (Virat Kohli Centuries) ఖాతాలో 70 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక సార్లు (57) ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు అందుకున్న మూడో క్రికెటర్ కోహ్లీ. అత్యధిక సార్లు (19) ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అందుకున్న రెండో ఆటగాడూ అతడే. ప్రపంచ క్రికెట్​లోనే గ్రేటెస్ట్​ ఆఫ్​ ఆల్​ టైమ్​గా (GOAT) ఉన్నాడు.

virat kohli birthday
కెప్టెన్ విరాట్ కోహ్లీ

అదే లోటు

వ్యక్తిగతంగా ఎన్ని ఘనతలు సాధించినా.. సగటు క్రికెట్​ అభిమాని ట్రోఫీలనే లెక్కలోకి తీసుకుంటాడు. ఎన్ని టైటిళ్లు వచ్చాయనేదే లెక్క. అక్కడే కోహ్లీకి అదృష్టం లేదు. జట్టు కోసం నిరంతరం తపిస్తూ, స్వేదం చిందిస్తూ ఆడే అతడిని ఐసీసీ ట్రోఫీ ఎప్పటి నుంచో ఊరిస్తోంది. అదే విమర్శకులకు అస్త్రంగా మారింది. కెప్టెన్​గా జట్టును ఎంతో దృఢంగా మలుస్తూ, యువకులకు ప్రేరణ కలిగిస్తూ ఉండే నాయకుడికి, విదేశీ క్రికెటర్లలోనూ స్థైర్యం నింపే ఈ సారథికి.. ఈ ఒక్క కారణంగా ప్రస్తుతం విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే అవి అతడిని కుంగదీయలేవు.

virat kohli birthday
విరాట్

"అందరిలా నువ్వూ విఫలమవుతావ్. తిరిగి ఎదిగేందుకు ప్రయత్నించడాన్ని మాత్రం మర్చిపోకు. ఒకసారి ఓడితే మళ్లీ మళ్లీ ప్రయత్నించు" రెండేళ్ల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా విరాట్..​ తనకు తానే రాసుకున్న (Virat Kohli Birthday Wishes) లేఖ ఇది. అయితే అతడు ఓడిపోయాడు అనడానికి లేదు. కలిసిరాలేదంతే! కిందపడ్డాడంటే రెట్టింపు స్థాయిలో పుంజుకోవడం కోహ్లీకి బాగా తెలుసు. ఆ సమయం కోసమే ప్రతీ అభిమాని ఎదురుచూస్తున్నాడు.

ప్రపంచ క్రికెట్​లో ప్రస్తుతానికే కాదు ఎప్పటికీ అతడే రారాజు! హ్యాపీ బర్త్​డే 'కింగ్​' కోహ్లీ.

ఇదీ చూడండి: 15 ఏళ్ల విరాట్​కు.. కోహ్లీ స్వీయసందేశం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.