ETV Bharat / sports

T20 worldcup: భలే ఛాన్స్​.. సత్తా చాటేదెవరో?

author img

By

Published : Jun 7, 2022, 6:56 AM IST

క్రికెట్లో భారత జట్టుకు ఆడటం అంత ఆషామాషీ విషయం కాదు ఒకప్పుడు. ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఎ క్రికెట్లో గొప్పగా రాణించినా.. టన్నుల కొద్దీ పరుగులు చేసినా, కుప్పలు కుప్పలుగా వికెట్లు తీసినా.. టీమ్‌ఇండియాలో చోటు దక్కక దేశవాళీ ఆటగాళ్లుగానే కెరీర్‌ను ముగించిన క్రికెటర్లు ఎందరో! కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. భారత టీ20 లీగ్‌ ఒక్క సీజన్లో, కొన్ని మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపిస్తే చాలు.. టీ20 జట్టు తలుపులు తెరిచేసుకుంటాయి. ఇలా గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో కుర్రాళ్లు భారత జట్టులోకి వచ్చారు. కానీ జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్న వాళ్లు మాత్రం తక్కువమందే. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి కుర్రాళ్లను పరీక్షించే పనిలో పడ్డారు సెలక్టర్లు. ముఖ్యంగా బౌలర్లలో చాలామంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. వారిలో అవకాశాన్ని ఉపయోగించుకునేదెవరో చూడాలి.

T20 worldcup teamindia bowlers
టీ20 వరల్డ్​ కప్​ టీమ్​ఇండియా బౌలర్స్​

కొన్నేళ్ల నుంచి ద్వైపాక్షిక వన్డే, టీ20 సిరీస్‌ల్లో కొత్త, యువ ఆటగాళ్లకు పెద్ద ఎత్తునే అవకాశం ఇస్తున్నారు సెలక్టర్లు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కూడా కుర్రాళ్లకే పెద్ద పీట వేశారు. ఇటీవలే టీ20 లీగ్‌ ముగియడం, త్వరలోనే ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లాల్సి ఉండటంతో రోహిత్‌, కోహ్లి, బుమ్రా, షమి లాంటి సీనియర్లకు ఈ సిరీస్‌ నుంచి దూరం పెట్టారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో కుర్రాళ్లు చాలామందే అవకాశం దక్కించుకున్నారు. అందులో చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడిన, కొత్త బౌలర్లే ఎక్కువ. ఇంకో నాలుగైదు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ యువ బౌలర్లకు సఫారీ సిరీస్‌ గొప్ప అవకాశం అనడంలో సందేహం లేదు. మరి ఈ సిరీస్‌లో సత్తా చాటి పొట్టి కప్పు దిశగా అడుగులేసే బౌలర్లెవరన్నది ఆసక్తికరం.

ఆ వేగం ఇక్కడా చూపిస్తాడా?.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తున్న ఆటగాడు ఉమ్రాన్‌ మాలికే అనడంలో సందేహం లేదు. టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ తరఫున మెరుపు వేగంతో బంతులేస్తూ, వికెట్ల మీద వికెట్లు తీస్తూ అతను చర్చనీయాంశంగా మారాడు. అతనాడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యంత వేగవంతమైన బంతితో భారత టీ20 లీగ్‌ అవార్డు గెలుచుకున్నాడతను. గత సీజన్లోనూ వేగంతో అతనూ ఆకట్టుకున్నప్పటికీ.. ఈసారి బంతి మీద నియంత్రణ, కచ్చితత్వం కూడా తోడవడంతో వికెట్ల పంట పండించుకోగలిగాడు. 14 మ్యాచ్‌ల్లో 20.18 సగటుతో అతను 22 వికెట్లు తీశాడు. చాలామంది దిగ్గజ ఆటగాళ్లు అతడిని భవిష్యత్‌ తారగా అభివర్ణించారు. టీమ్‌ఇండియాలోకి వస్తాడని అంచనా వేశారు. ఆ మాటను వెంటనే నిజం చేశాడు ఈ జమ్ము-కశ్మీర్‌ బౌలర్‌. మరి అతను టీమ్‌ఇండియా తరఫునా ఇదే వేగం, కచ్చితత్వం చూపిస్తాడా అన్నది చూడాలి. పేస్‌ బౌలింగ్‌ను బాగా ఆడే సఫారీ బ్యాట్స్‌మెన్‌ను అతను కట్టడి చేయగలిగితే.. తర్వాతి సిరీస్‌లకూ ఎంపిక కావడం, అలాగే ఆస్ట్రేలియాకు అతను టికెట్‌ సంపాదించడం ఖాయం.

ఆ నైపుణ్యంతోనే అవకాశం.. 14 మ్యాచ్‌లు.. 10 వికెట్లు.. 38.50 సగటు.. భారత టీ20 లీగ్‌ ఈ సీజన్లో ఇలాంటి గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌ను టీమ్‌ఇండియాకు ఎంపిక చేయడం సమంజసం అనిపించదు. కానీ ఈ గణాంకాలతో అర్ష్‌దీప్‌ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక కావడం ఎవరికీ అభ్యంతరకరంగా అనిపించలేదు. ఎక్కువ వికెట్లు తీయలేదన్న మాటే కానీ.. ఈ సీజన్లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ గొప్పగా సాగింది. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసిన వైనం అమోఘం. స్టార్‌ బౌలర్లు కూడా 8-9 మధ్య ఎకానమీ నమోదు చేస్తే.. అతను మాత్రం సగటున ఒక్కో మ్యాచ్‌కు 7.7 చొప్పునే పరుగులు ఇచ్చాడు. ఏ బ్యాట్స్‌మనూ అతడి బౌలింగ్‌లో ధాటిగా ఆడలేకపోయాడు. చివరి ఓవర్లలో అతడి నైపుణ్యం చూసే.. చాలామంది మాజీలు అతణ్ని భారత జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సెలక్టర్లు కూడా అలాగే ఆలోచించారు.

దిగితే వికెట్‌ పడాల్సిందే.. గత రెండు భారత టీ20 లీగ్‌ సీజన్లలో నిలకడగా రాణిస్తున్నాడు యువ ఫాస్ట్‌బౌలర్‌ అవేష్‌ ఖాన్‌. నిరుడు దిల్లీ తరఫున అదరగొట్టిన అతను.. ఈ సీజన్లో లఖ్‌నవూ తరఫునా సత్తా చాటాడు. మ్యాచ్‌లో ఎలాంటి సందర్భం అయినా వికెట్‌ కావాలంటే కెప్టెన్‌ తన వైపు చూసేలా చేసుకున్నాడతను. దిల్లీ తరఫున అతడి ప్రదర్శన చూశాక లఖ్‌నవూ పది కోట్లు పెట్టి అతణ్ని తమ జట్టులోకి తీసుకోవడం విశేషం. ఈ సీజన్లో అతను 13 మ్యాచ్‌ల్లో 23.11 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. అతను ఇప్పటికే టీమ్‌ఇండియాకు రెండు టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌ల్లో 2 వికెట్లే పడగొట్టిన అవేష్‌.. నీలి జెర్సీలో తనదైన ముద్ర వేయడానికి ఎదురు చూస్తున్నాడు. తుది జట్టులో అవకాశం దక్కితే ఈసారి అతనెలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

ఆలస్యంగా అదరగొడుతున్నాడు.. టీ20 లీగ్‌లో గత రెండు మూడు సీజన్ల నుంచి అదరగొడుతున్న హర్షల్‌ పటేల్‌ను చూసి ఇతనెవరో కొత్త ముఖం అనుకున్నారు. కానీ అతను కుర్రాడేమీ కాదు. వయసు 31 ఏళ్లు. చాలా ఏళ్ల నుంచి దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నా వెలుగులోకి రాలేకపోయాడు. గతంలోనూ టీ20 లీగ్‌ ఆడినా సత్తా చాటలేకపోయాడు. కానీ గత మూడు సీజన్ల నుంచి లీగ్‌లో అత్యధిక వికెట్లు పడగొడుతున్న బౌలర్లలో ఒకడిగా ఉంటున్నాడు. ఈ సీజన్లోనూ 15 మ్యాచ్‌ల్లో 121.57 సగటుతో 19 వికెట్లు తీశాడు. నిరుడు అతనే అత్యధిక వికెట్ల వీరుడు కావడంతో టీమ్‌ఇండియాలోనూ అవకాశం దక్కింది. అతను ఇప్పటికే 8 మ్యాచ్‌లాడి 11 వికెట్లు తీశాడు. మిగతా యువ పేసర్లతో పోలిస్తే అతడికే అనుభవం ఎక్కువ. ప్రస్తుత ఫామ్‌ కూడా బాగుంది. కాబట్టి దక్షిణాఫ్రికా సిరీస్‌లో హర్షల్‌ కచ్చితంగా అదరగొట్టే అవకాశాలున్నాయి.

కుర్ర స్పిన్నర్‌ నిలబడతాడా?.. అండర్‌-19 ప్రపంచకప్‌ ద్వారా వెలుగులోకి వచ్చి.. ఆ వెంటనే టీ20 లీగ్‌లో మంచి అవకాశాలు దక్కించుకుని చాలా వేగంగా నాణ్యమైన స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న కుర్రాడు రవి బిష్ణోయ్‌. లెగ్‌ స్పిన్నర్ల హవా నడుస్తున్న ఈ కాలంలో అతను టీమ్‌ఇండియాకు చాలా కాలం ఆడగల బౌలర్‌గా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అతను భారత్‌ తరఫున నాలుగు మ్యాచ్‌లాడాడు. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 4 వికెట్లే తీశాడు. ఈ సీజన్లో అతను 14 మ్యాచ్‌ల్లో 13 వికెట్లే తీశాడు. అయినప్పటికీ సెలక్టర్లు అతడిపై నమ్మకం పెట్టారు. మరి చాహల్‌, కుల్‌దీప్‌ల పోటీని తట్టుకుని అతను ప్రత్యేకతను చాటుకుంటాడా.. టీమ్‌ఇండియాలో నిలబడతాడా.. చూద్దాం మరి.

ఇదీ చూడండి: 'వాళ్లు పెద్ద ఆటగాళ్లే అయితే.. అలాంటి ప్రదర్శనలే చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.