ETV Bharat / sports

T20 World Cup: బరిలో 16 దేశాలు.. సూపర్‌ అనిపించేదెవరో?

author img

By

Published : Oct 16, 2022, 6:53 AM IST

T20 World Cup: ఏడాది వ్యవధిలోనే మరోసారి క్రికెట్‌ కిక్కును అందించే కప్పు వచ్చేసింది. పరుగుల పండగకు.. వికెట్ల వేడుకకు తరుణం ఆసన్నమైంది. బౌండరీలు దాటే బంతులు.. గాల్లోకి ఎగిరే ఫీల్డర్లు.. స్టాండ్స్‌లో అభిమానుల కేరింతలు.. ఈ ధనాధన్‌ ధమాకా నేటి నుంచే. ఆదివారమే టీ20 ప్రపంచకప్‌ ఆరంభం. సూపర్‌-12లో చోటు కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మరి చిన్న జట్లతో తలపడుతున్న వెస్టిండీస్, శ్రీలంక తేలిగ్గానే ముందంజ వేస్తాయా లేక సంచలనాలు నమోదవుతాయా అన్నది చూడాలి.

worldcup
worldcup

T20 World Cup: కంగారూ గడ్డపై తొలి టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. దాదాపు నెల రోజుల పాటు పొట్టి కప్పు సందడే సందడి. ఆదివారం నుంచి వచ్చే నెల ఫైనల్‌ జరిగే 13వ తేదీ వరకు క్రికెట్‌ ప్రేమికులకు పండగే. ఈ మెగా టోర్నీలో మొదట తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో చోటు కోసం ఈ అర్హత రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. తొలి రోజు గ్రూప్‌- ఎలో నమీబియాతో శ్రీలంక, నెదర్లాండ్స్‌తో యూఏఈ తలపడతాయి. సోమవారం గ్రూప్‌- బిలో స్కాట్లాండ్‌తో వెస్టిండీస్, ఐర్లాండ్‌తో జింబాబ్వే ఆడతాయి.

తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ముగిసే సరికి గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే సూపర్‌-12లో.. గ్రూప్‌-1లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, గ్రూప్‌-2లో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ ప్రధాన మ్యాచ్‌లు ఈ నెల 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పోరుతో మొదలవుతాయి. సూపర్‌-12లో ఒక్కో గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా అయిదింటితో మ్యాచ్‌లాడుతుంది. ఆ గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయి.

మళ్లీ పాక్‌తో..: క్రికెట్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే భారత్, పాక్‌ పోరు మరోసారి అలరించనుంది. ఐసీసీ టోర్నీల పుణ్యామా అని ఇటీవల ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు చూసే అవకాశం తరచుగా కలుగుతోంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో దాయాది చేతిలో టీమ్‌ఇండియా అనూహ్య పరాజయం పాలైంది. ఈ ఏడాది ఆసియా కప్‌లో ఇవి రెండు సార్లు తలపడగా చెరో విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుకు పొట్టి కప్పు వేదికైంది. ఈ నెల 23న పాక్‌తో పోరుతోనే భారత్‌ కప్పు వేట మొదలెడుతుంది. ఎంసీజీలో జరిగే ఆ మ్యాచ్‌కు 90 వేలకు పైగా ప్రేక్షకులు హాజరు కానున్నారు. అనంతరం తొలి రౌండ్‌ గ్రూప్‌- ఎ రన్నరప్‌తో 27న, దక్షిణాఫ్రికాతో 30న, బంగ్లాదేశ్‌తో నవంబర్‌ 2న, తొలి రౌండ్‌ గ్రూప్‌- బి విజేతతో 6న రోహిత్‌ సేన ఆడుతుంది.

వీళ్లు దూరం..: ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్ల గాయాలు ఆయా జట్లను గట్టిగానే దెబ్బతీశాయి. ముఖ్యంగా గాయంతో బుమ్రా దూరమవడం టీమ్‌ఇండియాకు తీవ్ర లోటు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బెయిర్‌స్టో, ఆర్చర్‌ కూడా గాయాలతో టోర్నీలో ఆడడం లేదు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ప్రిటోరియస్‌ కూడా తప్పుకున్నాడు. మరోవైపు 2010 తర్వాత మళ్లీ దినేశ్‌ కార్తీక్‌ ప్రపంచకప్‌ ఆడబోతున్నాడు. 2007 ఆరంభ టోర్నీ నుంచి ఇప్పటివరకూ ప్రతి ప్రపంచకప్‌లోనూ ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లుగా టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బంగ్లాదేశ్‌ సారథి షకీబ్‌ అల్‌ హసన్‌ నిలవబోతున్నారు.

16 ఏళ్లకే..: గోవాలో పుట్టి యూఏఈ తరపున ఆడుతున్న అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ (శనివారం నాటికి 16 ఏళ్ల 334 రోజులు) ఈ ప్రపంచకప్‌ బరిలో దిగుతున్న అతి పిన్న వయస్సు ఆటగాడు. ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై తమ జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 93 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. మొదట లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా కెరీర్‌ మొదలెట్టిన అతను ఆ తర్వాత బ్యాటర్‌గా మారాడు. 16 ఏళ్ల 56 రోజుల వయసులో 2009లో ప్రపంచకప్‌ ఆడిన పాకిస్థాన్‌ పేసర్‌ మహమ్మద్‌ అమిర్‌.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే ఈ టోర్నీ ఆడిన అతి చిన్న వయస్సు ఆటగాడిగా ఉన్నాడు. 38 ఏళ్ల స్టీఫెన్‌ (నెదర్లాండ్స్‌) ఈ 2022 ప్రపంచకప్‌లో అత్యంత ఎక్కువ వయస్సు ఆటగాడు. ఓవరాల్‌ రికార్డు హాంకాంగ్‌ ఆటగాడు ర్యాన్‌ క్యాంప్‌బెల్‌ (44 ఏళ్ల 33 రోజుల వయసులో 2016 ప్రపంచకప్‌లో) పేరు మీద ఉంది.

  • 1.. ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోంది. గతంలో అక్కడ 1992, 2015 వన్డే ప్రపంచకప్‌లు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ పొట్టి ప్రపంచకప్‌ 2020లోనే ఆసీస్‌లో జరగాల్సింది. కానీ కరోనా కారణంగా అప్పుడు రద్దయింది.
  • 3.. టోర్నీలో ఒక రోజు మూడు మ్యాచ్‌లూ నిర్వహించనున్నారు. ఇలా మూడు రోజుల్లో మూడు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. 14 రోజులు రెండేసి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. కానీ ఏ రెండు మ్యాచ్‌లూ ఒకేసారి జరగవు.
  • 7.. టీ20 ప్రపంచకప్‌లో 45 మ్యాచ్‌లకు ఏడు నగరాలు (జీలాంగ్, అడిలైడ్, బ్రిస్బేన్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ) ఆతిథ్యమిస్తాయి. ఫైనల్‌ మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. సెమీస్, ఫైనల్‌లకు రిజర్వ్‌ డే ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో ఈనాడు
శ్రీలంక × నమీబియా (ఉదయం 9.30 నుంచి)
యూఏఈ × నెదర్లాండ్స్‌ (మధ్యాహ్నం 1.30 నుంచి)

ఇవీ చదవండి:గంగూలీ కొత్త ప్లాన్.. క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ

పొట్టి కప్పు సమరం.. పైచేయి ఎవరిది?.. రోహిత్ సేనకు గెలిచే సత్తా ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.