ETV Bharat / sports

పొట్టి కప్పు సమరం.. పైచేయి ఎవరిది?.. రోహిత్ సేనకు గెలిచే సత్తా ఉందా?

author img

By

Published : Oct 15, 2022, 7:04 PM IST

Updated : Oct 15, 2022, 9:41 PM IST

T20 world cup 2022 : ఆదివారం నుంచి టీ20 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అదిరిపోయే క్రికెట్​ యాక్షన్​తో అభిమానులను అలరించనుంది. అయితే ఈ వరల్డ్​ కప్​లో టీమ్​ ఇండియాకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి? టైటిల్​ విజేతకు ప్రైజ్​ మనీ ఎంత? టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇచ్చే జట్లు ఏవి? వరల్డ్​ కప్​ షెడ్యూల్ ఏంటి? అనే విషయాలు తెలుసుకునేందుకు ఇది చదవండి.

T20 world cup 2022
T20 world cup 2022

T20 world cup 2022: భారీ స్టేడియం.. దాని నిండా జనం. మైదానంలో పరుగులు తీస్తూ ప్లేయర్లు. ఈ ఇదంతా చూసేందుకు స్టాండ్​ల్లో కేరింతలు కొడుతూ.. తమ దేశాల జెండాలు పట్టుకుని ప్రేక్షకులు.. ఇదీ క్రికెట్​ మ్యాచ్​ జరుగుతుంటే మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యే సన్నివేశం. దీని తర్వాతే మొదలవుతుంది అసలు యాక్షన్​. పవర్​ ప్లేలో సిక్స్​లు ఫోర్లతో బ్యాటర్లు చెలరేగిపోతారు. బంతుల్ని ప్రేక్షకుల స్టాండుల్లోకి కొడతారు. బౌలర్లు వాయువేగంతో వేగంతో బంతిని విసిరి బ్యాటర్ల​పై విరుచుకుపడతారు. ఈ కథంతా కళ్ల ముందు కనబడటమే కాదు.. గుండె వేగంలోనూ వినిపిస్తుంది. ఆదివారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా మొదలయ్యే ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​లో అంతకు మించి యాక్షన్​ ఉండబోతోంది.

t20-world-cup-2022
.

అక్టోబర్ 22 దాకా ప్రపంచ కప్ గ్రూప్​ స్టేజీ మ్యాచ్​లు జరుగుతాయి. అనంతరం సూపర్ 12 మ్యాచ్​లు జరుగుతాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు సూపర్ 12 దశకు అర్హత సాధించాయి. అర్హత రౌండ్లో గ్రూప్‌-ఎ లో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ, గ్రూప్‌- బి లో ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ దశ ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-12లో ఆడే ఛాన్స్‌ కొట్టేస్తాయి. అయితే అత్యధికంగా రెండు సార్లు కప్​ను సొంతం చేసుకున్న వెస్టిండీస్.. ఈ సారి గ్రూప్​ అర్హత మ్యాచ్​లు ఆడనుండటం గమనార్హం.

టీమ్​ ఇండియాకు గాయాల కలవరం..
ఈ సారి టైటిల్​ ఫేవరెట్​లలో ఒకటిగా భారత్​ బరిలో దిగబోతోంది. అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. వరుసగా ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే జడేజా, బుమ్రా జట్టుకు దూరమయ్యారు. జట్టులోనూ నిలకడ కరవయ్యింది.

ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా ఎలా ఆడుతుందోనన్న ఆందోళన క్రీడా అభిమానుల్లో మొదలైంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​లు గెలిచినా.. జట్టులోని సమస్యలు ఇంకా తొలగిపోలేదు. పేలవ ఫీల్డింగ్​తో భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు. ఛేజింగ్​లోనూ టాప్​ ఆర్డర్ ఆశించిన మేర ఆడటం లేదు.

t20-world-cup-2022
.

బ్యాటింగ్​ బాగుపడాలి..
టీమ్‌ఇండియాకు ప్రధాన సమస్య నిలకడలేమి. ఫలానా బ్యాటర్‌ స్థిరంగా ఆడతాడని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ అదరగొట్టేస్తున్నప్పటికీ.. ఓపెనింగ్‌లో ఇబ్బంది పడుతోంది. కేఎల్ రాహుల్‌, రోహిత్ శర్మ.. ఎప్పుడు ఎలా ఆడతారో అంచనాకు దొరకడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ మెగా టోర్నీల్లో విఫలమవడం భారత్‌ను కలవరానికి గురి చేసే అంశం.

t20-world-cup-2022
.

ఇక లోయర్‌ఆర్డర్‌లో ఆల్​ రౌండర్​ హార్దిక్​ పాండ్య గురించి కూడా ఆందోళన ఉంది. ఎందుకంటే హార్దిక్​ కీలక ఆటగాడు. మ్యాచ్​ను ఏ క్షణంలోనైనా మార్చే సత్తా అతడి సొంతం. అయితే హార్దిక్​కు​ ఒకవేళ గాయమైతే అతడిని రిప్లేస్​ చేయడానికి జట్టులో ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇది పక్కన పెడితే సిరిస్​ల్లో మంచిగానే రాణించిన హార్దిక్​.. ఇలాంటి మెగాటోర్నీలో రాణిస్తాడా అనే దానిపై ఆందోళన నెలకొంది.

t20-world-cup-2022
.

అయితే ఏదో ఒక మ్యాచ్‌లో మెరవడం.. ఆ తర్వాత తేలిపోవడం టీమ్‌ఇండియా బ్యాటర్లకు అలవాటుగా మారిందని మాజీల విమర్శలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టి ప్రపంచకప్‌లో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా గత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు.

డెత్​ బౌలింగ్ మారాలి..
ఇక బౌలింగ్​ విషయానికొస్తే.. మిడిల్​ ఓవర్లలో యవ బౌలర్ అర్ష్​దీప్ సింగ్​తో హార్దిక్​ పాండ్య పేస్​ బౌలింగ్​ను సమర్థంగా వేయగలడు. కానీ చివరి అయిదు ఓవర్లు చాలా కీలకం. మ్యాచ్​గతిని మార్చే అవకాశం అక్కడే ఉంటుంది. బ్యాటర్లకు ఏమాత్రం ఛాన్స్​ ఇచ్చినా.. బ్యాట్​ను ఝులిపిస్తారు. దీంతో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ప్రస్తుతం టీమ్​ ఇండియా బౌలర్లు డెత్​ ఓవర్లలో విజయం సాధించాల్సిన మ్యాచ్​లను చేజార్చుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్న హర్షల్​ పటేల్​.. డెత్​ ఓవర్ల స్పెషలిస్టు అనుకుంటే.. అంతగా ప్రభావం చూపలేక పోతున్నాడు.

కలిసొచ్చే అంశాలున్నాయ్..
ఇన్ని సమస్యల్లోనూ కలసి వచ్చే అంశాలూ ఉన్నాయి. కేఎల్​ రాహుల్, విరాట్ కోహ్లీ మంచి ఫామ్​లో ఉన్నారు. వీరు నిలకడగా ఆడి.. మంచి ప్రారంభం అందిస్తే.. మిడిలార్డర్​లో హార్దిక్​ పాండ్య, రిషబ్​ పంత్ లేదా దినేశ్​ కార్తీక్ లాంటి ప్లేయర్లు జట్టును విజయ తీరాలకు చేర్చే అవకాశముంది. పటిష్ఠ ప్రణాళికతో.. ఉన్నప్లేయర్లను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే.. రోహిత్​ సేన కప్పు కొట్టడం ఖాయం.

t20-world-cup-2022
.

ఇతర జట్లను పరిశీలిస్తే..
ఆదివారం నుంచి పారంభమయ్యే టీ20 వరల్డ్​ కప్​ను ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియా లాంటి బౌలింగ్​కు అనుకూలించే పిచ్​లపై ఎవరు ఆధిపత్యం చూపిస్తారనేది వేచి చూడాలి. అయితే వరల్డ్​కప్​ నిలిచేందుకు ఏ జట్టుకు విజయావకాశాలున్నాయి..? టీమ్​ ఇండియాకు ఏ జట్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.

టీ20 వరల్డ్​ కప్​ గెలిచే అవకాశాలు ఎక్కువగా టీమ్ ఇండియాకే ఉన్నాయి. గాయాలతో సతమతమవుతున్నా.. యువ ప్లేయర్లతో జట్టు పటిష్ఠంగా ఉంది. చిన్న చిన్న సమస్యలను.. తప్పిదాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్త పడితే.. భారత్​ పొట్టి కప్పును ముద్దాడటం ఖాయం. ఎందుకంటే ఆసీస్​ గడ్డపై టీమ్​ ఇండియాకు గెలుపు శాతం 60గా ఉంది. మిగతా అన్ని జట్ల కంటే భారత్​కే ఈ శాతం ఎక్కువగా ఉంది.

భారత్​ తర్వాతి స్థానంలో ఎక్కవ విజయావకాశాలు పాకిస్థాన్​కు ఉన్నాయి. ఈ టీమ్​ కూడా బాగా పుంజుకుంది. మంచి ఫామ్​లో ఉన్న కెప్టెన్​ బాబర్​ ఆజమ్​.. జట్టును బాగా నడిపిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్-పాకిస్థాన్​​తో ఏడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో హోరాహోరీగా పోరాడి 4-3 తేడాతో సిరీస్​ కోల్పోయింది. తాజాగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్​తో జరిగిన ముక్కోనపు టీ20 సిరీస్​ను పాక్​ తన ఖాతాలో వేసుకుంది.

ఇంగ్లండ్‌ జట్టుకు ఆసీస్‌ గడ్డపై విజయాల శాతం 40గా ఉంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌తో జరిగిన ఏడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను 4-3 తేడాతో కైవసం చేసుకుంది. 2010లో టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ ఈసారి కూడా ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది.

అయితే ఆస్ట్రేలియా గడ్డపై విజయాల శాతం శ్రీలంకకు ఎక్కవగా ఉంది. కానీ సెమీ ఫైనల్​కు మాత్రం.. శ్రీలంక వెళ్లపోవచ్చు. శ్రీలంక బదులు హోస్ట్​ నేషన్​ ఆస్ట్రేలియా కప్పును ఎగరేసుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల భారత్​తో జరిగిన టీ20 సిరీస్​లో ఓడిపోయినప్పటికీ.. అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో కంగారూలు మరోసారి భారత్​కు గట్టి పోటీ ఇవ్వనున్నారు.

మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా..

  • అక్టోబర్‌ 16 నుంచి 21వ తేదీ వరకు వరకు క్వాలిఫయిర్‌ రౌండ్‌లో భాగంగా ఎనిమిది జట్లు 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు అన్నీ మన సమయం ప్రకారం ఉదయం 9.30గంటలకు, మధ్యాహ్నం 1.30గంటలకు నిర్వహిస్తారు. అందులో నాలుగు జట్లు సూపర్‌-12 పోటీలకు అర్హత సాధిస్తాయి.
  • అసలైన సమరం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు (నేరుగా వచ్చిన ఎనిమిదితోపాటు అర్హత సాధించిన నాలుగు) టైటిల్‌ కోసం తలపడతాయి.

టీమ్ ఇండియా మ్యాచ్​లు..

  • టీమ్‌ఇండియా మ్యాచ్‌ల విషయానికొస్తే.. పాకిస్థాన్‌తో అక్టోబర్‌ 23న (ఆదివారం) మొదటి మ్యాచ్‌ ఆడనుంది. మెల్‌బోర్న్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
  • అక్టోబర్ 27న క్వాలిఫయిర్‌లో గ్రూప్‌ A నుంచి అర్హత సాధించిన రెండో జట్టుతో ఆడనుంది. ఆ మ్యాచ్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు.. వేదిక సిడ్నీ.
  • అక్టోబర్ 30న దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. అయితే సాయంత్రం 4.30గంటలకు పెర్త్‌ వేదికగా మ్యాచ్‌ జరుగుతుంది.
  • నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. వేదిక అడిలైడ్.
  • సూపర్‌-12లో భారత్‌ చివరి మ్యాచ్‌ నవంబర్ 6న ఉంటుంది. క్వాలిఫయిర్‌ రౌండ్‌లో అర్హత సాధించిన B గ్రూప్‌లోని మొదటి జట్టుతో తలపడుతుంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు.
  • నవంబర్‌ 9, 10 తేదీల్లో సెమీస్‌ -1 , సెమీస్‌ -2 పోరు ఉండనుంది. అలాగే టైటిల్‌ విజేతను తేల్చే ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్ 13న మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతుంది.

విజేతకు పైజ్​ మనీ ఇదే..
దాదాపు నెల రోజులపాటు జరిగే మెగా టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.13 కోట్లు) అందనుంది. అలాగే రన్నరప్‌నకు 0.8 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6.5 కోట్లు) దక్కనుంది. మొత్తం ప్రైజ్‌ మనీ కోసం 5.6 మిలియన్‌ డాలర్లు (దాదాపు 45.68 కోట్లు) వెచ్చిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

ఇక సెమీఫైనల్‌లో ఓడిన ఒక్కో జట్టు 4 లక్షల డాలర్లను(రూ. 3.25 కోట్లు) సొంతం చేసుకుంటుంది. సూపర్‌-12లో నిష్క్రమించిన ఒక్కో టీమ్‌కు 70వేల డాలర్లు (రూ. 57 లక్షలు) అందుతాయి. అలాగే గత టీ20 ప్రపంచకప్‌ తరహాలోనే.. ఈసారి కూడా సూపర్‌-12 దశలో ఒక్కో విజయానికి అదనంగా 40వేల డాలర్లను (రూ.32 లక్షలు) ఆయా టీమ్‌లు అందుకుంటాయని ఐసీసీ పేర్కొంది. సూపర్‌-12 స్టేజ్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం రూ. 9.60 కోట్లు బహుమతిగా అందుతుంది. మొదటి దశలో ఒక్కో మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టూ 40వేల డాలర్లను (రూ. 32 లక్షలు) సొంతం చేసుకుంటుంది.

ఇవీ చదవండి : శ్రీలంక చిత్తు.. ఆసియా కప్​ విజేతగా భారత్.. ఏడోసారి టైటిల్​ గెలిచిన మహిళలు

T20 worldcup: కోహ్లీపై​.. ఏ మంత్రం పని చేసిందో?

Last Updated : Oct 15, 2022, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.