ETV Bharat / sports

T20 worldcup: హై ఓల్టేజ్​ మ్యాచ్​కు అంతా సిద్ధం.. పైచేయి ఎవరిదో

author img

By

Published : Oct 22, 2022, 6:52 PM IST

ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న....దాయాదుల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12లో ఆదివారం టీమ్​ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడనుంది. గత ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉండగా.. మరోసారి రోహిత్‌ సేనకు షాక్‌ ఇవ్వాలని పాక్‌ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచ కప్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడం క్రికెట్‌ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది.

T20 worldcup 2022 teamindia vs pakisthan
T20 worldcup 2022 teamindia vs pakisthan

టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఇరుజట్లు వ్యూహ-ప్రతివ్యూహాలతో సిన్నద్ధమయ్యాయి. గత ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమి, ఆసియాకప్‌ కోసం పాక్‌ పర్యటనకు వెళ్లబోమన్న బీసీసీఐ ప్రకటన.. మాజీల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో దాయాదుల సమరం మరింత ఉత్కంఠ రేపుతోంది. గత ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి సూపర్‌-12 మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. తమకు ఇదో మ్యాచ్‌ మాత్రమేనని.. ఇరుజట్ల సారథులు ప్రకటించినా టీ-20 ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌ కావడంతో భారత్‌-పాక్‌ జట్లపై విపరీతమైన ఒత్తిడి ఉంది.

అతడిపైనే భారీ ఆశలు.. బ్యాటింగ్‌లో రోహిత్‌ సేన బలంగా కనిపిస్తోంది. ఫామ్‌లో ఉన్న రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ రాణించడంపైనే భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని మాజీలు అంచనా వేస్తున్నారు. పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ షా అఫ్రిదీని ఎదుర్కొని పవర్‌ ప్లేలో చేసే పరుగులే రోహిత్‌ సేన విజయాన్ని నిర్ణయిస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి. జట్టుకూర్పుపై భారత్‌ సతమతమవుతోంది. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ, కేఎల్​ రాహుల్‌, కోహ్లీ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసి రానుంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్డిక్‌పాండ్యాలతో బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా ఆడే సూర్య మరోసారి విధ్వంసం సృష్టిస్తే భారత్‌ భారీ స్కోరు సాధించడం ఖాయం. టీమిండియాను బౌలింగ్ కలవరపాటుకు గురిచేస్తోంది. భారీ స్కోర్లు సాధిస్తున్నా బౌలర్లు లక్ష్యాలను కాపాడుకోలేకపోవడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక భువనేశ్వర్‌ కుమార్‌ మహ్మద్‌ షమీ, ఆర్షదీప్‌సింగ్‌, హర్షల్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, యజువేంద్ర చాహల్‌ పాక్‌ బ్యాటర్లను కట్టడి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

వారే కీలకం.. భారత్‌పై మరోసారి విజయం సాధించాలని బాబర్‌ ఆజంసేన పట్టుదలగా ఉంది. గత ప్రపంచకప్‌లో షాహిన్‌ షా అఫ్రిది 31 పరుగులకే మూడు వికెట్లు తీసి భారత ఓటమిని శాసించాడు. గాయం నుంచి కోలుకున్న అఫ్రిది ఈ మ్యాచ్‌లో రాణించాలని పాక్ భావిస్తోంది. షాన్ మసూద్, ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, ఖుష్దిల్ షా కూడా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. బ్యాటింగ్‌లో సారథి బాబర్‌ ఆజం, నవాజ్‌ కీలకంగా మారనున్నారు.

అది కూడా కీలకం.. ఈ మ్యాచ్‌లో టాస్‌ కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని.. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ చేయడానికి మొగ్గుచూపే అవకాశం ఉందని మాజీలు అంచనా వేస్తున్నారు. దాదాపు 37ఏళ్ల తర్వాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ ఎమ్​సీజీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు వర్షంముప్పు పొంచి ఉందని ఆసిస్‌ వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ మొత్తం రద్దు కాకపోవచ్చని.. ఓవర్లు కుదించైనా పోరు నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉందని మాజీలు విశ్లేషించారు.

ఇదీ చూడండి: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌కు షాక్‌.. కివీస్‌ గెలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.