ETV Bharat / sports

T20 World Cup: సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు!

author img

By

Published : Nov 6, 2022, 5:43 PM IST

T20 World Cup Surya Kumar Yadav
T20 World Cup Surya Kumar Yadav

టీ20 ప్రపంచ కప్​లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా బ్యాటర్ సూర్యకుమార్​ యాదవ్​ అదరగొట్టాడు. 25 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్​లో సూర్య.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు కొట్టాడు. అవేంటంటే?

T20 World Cup Surya Kumar Yadav: టీమ్​ఇండియా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 క్రికెట్‌లో ఎదురులేకుండా సాగిపోతున్నాడు. దూకుడే మంత్రంగా సాగుతున్న సూర్యను ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టతరంగా మారింది. సూపర్‌-12 గ్రూప్‌-2లో ఆదివారం జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోహ్లీ, రోహిత్‌లు విఫలమైన వేళ కేఎల్‌ రాహుల్‌తో కలిసి సూర్యకుమార్‌ జింబాబ్వే బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 23 బంతుల్లోనే అర్థశతకం సాధించిన సూర్యకుమార్‌.. 25 బంతుల్లో 61 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్‌ ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు కొట్టాడు.

>> టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్​ఇండియా తరఫున అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్‌ 23 బంతుల్లో ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. సూర్య కంటే ముందు ఈ జాబితాలో యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు(2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో, 2007లో ఆస్ట్రేలియాపై 20 బంతుల్లో) హాఫ్‌ సెంచరీ సాధించగా.. కేఎల్‌ రాహుల్‌ 2021లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 18 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1,000 పరుగులు చేసిన తొలి టీమ్​ఇండియా ప్లేయర్​గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.

>> ఒక టీ20 వరల్డ్‌కప్‌లో 100 కంటే ఎక్కువ బంతులాడి అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన జాబితాలో సూర్యకుమార్‌ అగ్రస్థానంలో నిలిచాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ 193.96 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇక 2010 టీ20 ప్రపంచకప్‌లో మైక్‌ హస్సీ 175.70 స్ట్రైక్‌రేట్‌తో, 2012లో లూక్‌ రైట్‌ 169.29 స్ట్రైక్‌రేట్‌తో, 2022లో గ్లెన్‌ ఫిలిప్స్‌ 163.86 స్ట్రైక్‌రేట్‌తో, 2007 టీ20 ప్రపంచకప్‌లో పీటర్సన్‌ 161.81 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు.

>> ఇక టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా తరఫున చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్‌ మూడో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ చివరి ఐదు ఓవర్లలో 56 పరుగులు రాబట్టుకున్నాడు. ఇంతకుముందు ఆసియాకప్‌ 2022లో అఫ్గాన్‌పై కోహ్లీ 63 పరుగులు రాబట్టగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ సింగ్‌ 58 పరుగులు సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.