ETV Bharat / sports

టీమ్​ఇండియాకు​ దొరికాడు సరైనోడు

author img

By

Published : Sep 8, 2021, 7:08 AM IST

Updated : Sep 8, 2021, 8:32 AM IST

shardul
శార్దూల్​

లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి.. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించి ఆపై బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి జట్టుకు వెన్నెముకలా నిలిచే పేస్‌ బౌలర్‌ కోసం భారత్‌ ఏళ్ల తరబడి నిరీక్షిస్తోంది. తన అద్భుత ప్రదర్శనతో శార్దూల్​ ఠాకూర్(Shardul thakur england tour)​ ఇప్పుడా లోటును తీర్చేలాగే కనిపిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టెస్టులో తనలోని మేటి ఆల్​రౌండ్​ను చూపించి విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటలోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో ఓ సారి అతడి ఆటతీరు గురించి తెలుసుకుందాం.

"అతడు ఆడిన షాట్లు అమోఘం! ముఖ్యంగా ఆ మెరుపు సిక్స్‌.. ఆ ముచ్చటైన స్ట్రెయిట్‌ డ్రైవ్‌! ఎంతటి ఆత్మవిశ్వాసం!"

"స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో అతడు గొప్పగా బంతులేశాడు. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ను ఔట్‌ చేసిన డెలివరీ అద్భుతం. రూట్‌ను బుట్టలో వేసిన తీరును చూసి తీరాల్సిందే" .. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ చేసిన ఈ రెండు వ్యాఖ్యాలు ఒకరి గురించే! అతడే శార్దూల్‌ ఠాకూర్‌! ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టులో శార్దూల్‌(shardul thakur england tour) తనలోని మేటి ఆల్‌రౌండర్‌ను చూపించాడు. టెస్టుల్లో భారత్‌కు నాణ్యమైన పేస్‌ ఆల్‌రౌండర్‌ లేని లోటును అతను తీర్చేలాగే కనిపిస్తున్నాడు.

లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి.. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించి ఆపై బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి జట్టుకు వెన్నెముకలా నిలిచే పేస్‌ బౌలర్‌ కోసం భారత్‌ ఏళ్ల తరబడి నిరీక్షిస్తోంది. ఈ వెతుకులాటలో హార్దిక్‌ నేనున్నానంటూ తెరపైకి వచ్చినా ఆ ముచ్చట కొన్నాళ్లే! గాయాల కారణంగా అతడు జట్టులోకి వస్తూ పోతున్నాడు. పైగా బౌలింగ్‌ చేయని కారణంగా సుదీర్ఘ ఫార్మాట్లో అతడికి జట్టులో స్థానమే దక్కట్లేదు. ఈ స్థితిలో శార్దూల్‌ జట్టుకు సమతూకాన్ని తీసుకొచ్చే పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. గత ఏడాది చివర్లో టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా పర్యటన నుంచి శార్దూల్‌ తన ముద్ర వేస్తున్నాడు. గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో తుది జట్టులో స్థానం దక్కించుకున్న శార్దూల్‌.. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడమే కాక తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. సుందర్‌తో అతడి భాగస్వామ్యం భారత్‌కు కొండంత బలాన్ని ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.

నాలుగు టెస్టుల్లోనే..

నాలుగు టెస్టుల్లో మూడు అర్ధసెంచరీలు! టెస్టుల్లో శార్దూల్‌(shardul thakur australia tour) బ్యాటింగ్‌ ప్రతిభకు నిదర్శనమీ గణాంకాలు. ఆస్ట్రేలియాలో ఏదో గాలివాటానికి కొట్టేశాడేమో అనుకున్న వాళ్లకు సమాధానంగా ఇంగ్లాండ్‌లో బ్యాట్‌తో చెలరేగాడతను. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌ అతడే. భారత్‌ 191 పరుగులే చేస్తే అందులో శార్దూల్‌ వాటా 57 పరుగులు. రెండో ఇన్నింగ్స్‌లోనూ శార్దూల్‌ మరో అర్ధశతకం సాధించాడు. భారత్‌ 312/6తో ఉన్న స్థితిలో పంత్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇంగ్లాండ్‌ ముంగిట భారీ లక్ష్యం ఉంచడంలో ముఖ్య పాత్ర పోషించాడు. సాధారణంగా వికెట్లకు నేరుగా ఆడడం శార్దూల్‌ శైలి. అయితే అతడి శైలి గ్రహించిన ఇంగ్లాండ్‌ ఎక్కువమంది ఫీల్డర్లను అతడికి అభిముఖంగా మొహరించినా.. శార్దూల్‌ తగ్గలేదు. అదిరే స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు ఆడాడు. చక్కని నియంత్రణతో ఫ్రంట్‌ ఫుట్‌కు వస్తూ ఆడిన షాట్లైతే కనువిందు చేశాయి. ఇక బౌలింగ్‌లో అతడి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్కోసారి కళ్లుచెదిరే డెలివరీలతో బ్యాట్స్‌మెన్‌ను ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్‌ బర్న్స్‌ను అలాంటి ఓ బంతితోనే ఔట్‌ చేసి జట్టుకు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రూట్‌ను వికెట్లపై ఆడుకునేలా ప్రేరేపించి భారత విజయానికి బాటలు పరిచాడు.

బౌలింగ్‌ మెరుగైతే..

పేస్‌ ఎక్కువ లేకపోయినా పాత బంతితోనూ స్వింగ్‌ రాబట్టి బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించడం శార్దూల్‌ శైలి. అయితే బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న అతను.. బౌలింగ్‌లో ఇంకా కొంచెం మెరుగవ్వాల్సి ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు నప్పే బౌలర్‌గా పేరు తెచ్చుకున్న శార్దూల్‌ సుదీర్ఘ ఫార్మాట్‌కు ఇప్పుడిప్పుడే అలవాటుపడుతున్నాడు. తెలివిగా బౌలింగ్‌ చేయడం శార్దూల్‌ బలం అయితే.. ధారాళంగా పరుగులు ఇవ్వడం అతడి బలహీనత. భలే బౌలింగ్‌ చేస్తున్నాడే అనుకునేంతలోగానే గాడి తప్పుతాడు. 135 కి.మీ వేగంతో నిలకడగా బంతులేసే నైపుణ్యాన్ని అతను పెంపొందించుకోవాలి. టెస్టుల్లో నిలకడగా సుదీర్ఘ స్పెల్స్‌ వేయడం అలవాటు చేసుకోవాలి. ఇప్పటిదాకా ఆడిన టెస్టుల్లో అతను బౌలింగ్‌లో ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. ఫిట్‌నెస్‌ పెంచుకుని.. బ్యాటింగ్‌లో ఇదే దూకుడు కొనసాగిస్తూ.. బౌలింగ్‌ను మరింత మెరుగు పరుచుకుంటే శార్దూల్‌ రూపంలో భారత్‌కు నాణ్యమైన ఆల్‌రౌండర్‌ దొరికినట్లే!

ఇదీ చూడండి: Shardul Thakur: శార్దూల్​ ఠాకూర్ రికార్డు​.. కపిల్​దేవ్​ సరసన చోటు

Last Updated :Sep 8, 2021, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.