ETV Bharat / sports

ఒకే ఓవర్​లో ఏడు సిక్స్​లు.. క్రెడిట్​ అంతా ధోనీదేనటా!

author img

By

Published : Nov 29, 2022, 12:03 PM IST

రుతురాజ్​ గైక్వాడ్ తన బ్యాటింగ్​తో ఒక్క ఓవర్​లోనే ఏడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్​ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఘనతను సాధించాకా తాజాగా అతడు మాజీ కెప్టెన్​ ధోనీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే..?

ruthuraj gaikwad
రుతురాజ్​ గైక్వాడ్

ప్రతిష్టాత్మక దేశవాళీ ట్రోర్నీ విజయ్​ హజారే ట్రోఫీ రెండో క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదిన తొలి బ్యాటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మహారాష్ట్ర బ్యాటర్ 159 బంతుల్లో 220 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అయితే తాజాగా కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రాతో యూట్యూబ్​ ఛానెల్​తో మాట్లాడిన గైక్వాడ్​.. మాజీ కెప్టెన్​ ధోనీ తానెంతో నేర్చుకున్నట్లు చెప్పాడు. జట్టు గెలుస్తున్నప్పుడు అతిగా స్పందించకపోవడం.. భావోద్వేగాలను నియంత్రించుకొని.. న్యూట్రల్‌గా ఉండటాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సమయంలో మహీ దగ్గర్నుంచి నేర్చుకున్నానని తెలిపాడు.

జట్టు ఓడినా సరే డ్రెస్సింగ్ రూంలో ధోనీ సానుకూల దృక్పథాన్ని నింపడానికి ప్రయత్నించేవాడని పేర్కొన్నాడు. అతడి సపోర్ట్​తోనే క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టు ఏకతాటిపై ఉండేదని.. టీమ్ స్పిరిట్ పెరగడానికి మహీ సాయం చేసేవాడని చెప్పుకొచ్చాడు.

"మ్యాచ్ ఓడిన తర్వాత ప్రతి ఒక్కరూ 15 నిమిషాలపాటు సైలెంట్ అయిపోయేవారు. కానీ మహీ భాయ్ ప్రజెంటేషన్ నుంచి తిరిగొచ్చాక మమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచేవాడు. 'రిలాక్స్ బాయ్స్, ఇలా జరుగుతుంది' అనేవాడు. మేం గెలిచినా ఓడినా జట్టు స్ఫూర్తి ఒకేలా ఉండేలా ధోనీ చూసేవాడు. ఓడితే ఎంతగానో నిరాశకు లోనయ్యేవాళ్లం. కానీ నెగిటివిటీ, ఒకరిని నిందించడం ఉండేది కాదు" అని ధోనీ కెప్టెన్సీ గురించి వెల్లడించాడు.

ధోనీ వైఖరి తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పిన గైక్వాడ్.. గెలుపోటములతో సంబంధం లేకుండా జట్టు వాతావరణం ఒకేలా ఉండేలా మహీ జాగ్రత్త పడేవాడన్నాడు. 'ఓటములు ఎదురవుతున్నప్పుడు టీమ్‌లోనే రకరకాల గ్రూప్‌లు ఏర్పడుతుంటాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీ అలా జరగనీయలేదు' అని గైక్వాడ్ వెల్లడించాడు.

ఇదీ చదవండి:హద్దుమీరిన అభిమాని.. మ్యాచ్​ మధ్యలో రక్తం వచ్చేలా గోల్ కీపర్​పై దాడి..

ఆ విషయంలో BCCI, PCB కలిసి నిర్ణయం తీసుకోవాలి: గౌతమ్‌ గంభీర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.