ETV Bharat / sports

పృథ్వీ షా వీరంగం.. క్వాడ్రపుల్‌ సెంచరీ జస్ట్ మిస్‌

author img

By

Published : Jan 11, 2023, 10:15 PM IST

గత కొంత కాలంగా టీమ్‌ఇండియాలో చోటు దక్కించులేకపోతున్న పృథ్వీ షా..తాజాగా రంజీ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. ఎలైట్‌ గ్రూపు-బిలో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ బాదేసి ఆకట్టుకున్నాడు.

Prithvi shaw century
పృథ్వీ షా వీరంగం.. క్వాడ్రపుల్‌ సెంచరీ జస్ట్ మిస్‌

గత కొంత కాలంగా టీమ్‌ఇండియాలో చోటు దక్కించులేకపోతున్నాడు పృథ్వీ షా. ఎలాగైనా తిరిగి జాతీయ జట్టులోకి రావాలనే పట్టుదలతో ఉన్న ఈ యువ ఆటగాడు రంజీ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. ఎలైట్‌ గ్రూపు-బిలో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ బాదేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 383 బంతుల్లోనే 49 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 379 పరుగులు చేశాడు. త్రుటిలో క్వాడ్రపుల్‌ సెంచరీ (400) మిస్సయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా పృథ్వీ షా నిలిచాడు. అతనికంటే ముందు 1948లో భౌసాహెబ్ నింబాల్కర్ మహారాష్ట్ర తరపున కతియావార్‌పై (443*) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

తొలి రోజు (మంగళవారం) 283 బంతుల్లో 240 పరుగులు చేసిన పృథ్వీ షా.. రెండో రోజు (బుధవారం) 99 బంతుల్లో 139 పరుగులు చేసి రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో 379 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ యువ ఆటగాడు చెలరేగి ఆడటంతో ముంబయి 687/4 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అస్సాం ఒక వికెట్‌ నష్టానికి 129 పరుగులు చేసింది.

ఆ రికార్డు బద్ధలు.. ఈ ట్రిపుల్‌ సెంచరీతో రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు. అదే విధంగా ముంబయి తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గానూ అవతరించాడు. ఇది వరకు ఈ రికార్డు సంజయ్ మంజ్రేకర్ (377) పేరిట ఉండేది. ఇప్పుడు పృథ్వీ షా 379 పరుగులు చేసి 32 ఏళ్ల తర్వాత ఆ రికార్డును బద్దలు కొట్టాడు. సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న పృథ్వీ షాను టీమ్‌ఇండియా ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా అభినందించారు.

ఇదీ చూడండి: ఉప్పల్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌.. టికెట్ల విక్రయం ఎప్పటినుంచంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.