ETV Bharat / sports

కమిన్స్​ సేన షాకింగ్​ నిర్ణయం.. 11 ఏళ్లలో తొలిసారి!

author img

By

Published : Jul 19, 2023, 1:55 PM IST

Eng Vs Aus 4th Test : యాషెస్ నాలుగో టెస్టుకు సర్వం సిద్ధమౌతున్న వేళ ఆస్ట్రేలియా జట్టు ఓ షాకింగ్​ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..

Ashes series
Ashes series 4 th test

Ashes 4 th Test : యాషెస్ సిరీస్​లో భాగంగా జరిగిన మూడో టెస్టులో ఓటమిని చవి చూసిన ఆస్ట్రేలియా జట్టు.. నాలుగో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న కసితో ఉంది. ఇందుకోసం తీవ్ర కసరత్తులు చేస్తున్న ఆసిస్​ సేన.. నాలుగో టెస్టు ఆడే పదకొండు మంది జట్టు సభ్యుల పేర్లను ఒక రోజు ముందుగానే ప్రకటించింది. అయితే ఇందులో ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇలా స్పిన్నర్ లేకుండా ఆసీస్ జట్టు బరిలో దిగడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి.

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్​ సమయంలో ఆస్టేలియా జట్టు స్పిన్నర్ నాథన్ లైయన్​ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన లైయన్​.. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి మైదానంలోకి రాలేదు. కానీ జట్టుకు అవసరం అని తెలిసినప్పుడు చివర్లో బ్యాటింగ్‌కు దిగాడు. నొప్పి భరిస్తూనే జట్టుకు స్కోర్​ అందించే ప్రయత్నం చేశాడు. ఇక హెడింగ్లే వేదికగా జరిగిన టెస్టులో టాడ్ మర్ఫీని ఆడించారు. కానీ అతనేం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో నాలుగో టెస్ట్​ కోసం ఆసీస్ టీం మేనేజ్‌మెంట్​ ఈ బలమైన నిర్ణయానికి దిగింది. అయితే జట్టులో ప్రధాన స్పిన్నర్ లేనప్పటికీ.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ రూపంలో ఆ టీంలో ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఉన్నారు.

England Vs Australia Test : మరోవైపు ఈ మ్యాచ్ జరగనున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పూర్తిగా పేస్ బౌలింగ్‌కు సహకరించేలా ఉంది. దానికితోడు ఇక్కడ వర్షం పడే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ వేదికపై స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆసీస్ టీం భావిస్తోంది. ఓ రకంగా అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం.

మూడో టెస్టులో అనూహ్యంగా ఓడినప్పటికీ ఆసీస్ జట్టు ప్రస్తుతం ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఆడే జట్టులో ఆస్ట్రేలియా ప్రధానంగా రెండు మార్పులు చేసింది. పేసర్ స్కాట్ బోలాండ్, స్పిన్నర్ టాడ్ మర్ఫీని రానున్న మ్యాచ్​ కోసం పక్కన పెట్టింది. వీరి స్థానాల్లో స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, యంగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మూడో టెస్టులో అద్భుతంగా రాణించిన మిచెల్ మార్ష్ కూడా జట్టులో కొనసాగనున్నాడు.

ఇక ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయింది. వారు ఇటీవలే ప్రకటించిన తుది జట్టులో కూడా ప్రధాన స్పిన్నర్ ఎవరూ లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ మొయిన్ అలీ రూపంలో ఇంగ్లాండ్ జట్టులో మంచి స్పిన్ ఆల్ రౌండర్ ఉన్నాడు. అవసరమైతే జో రూట్ కూడా తన స్పిన్‌తో సహకారం అందిస్తాడు.

ఇంగ్లాండ్ తుది జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జాక్ క్రాలీ, మొయీన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెయిర్‌స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, బెన్ డకెట్, స్టువర్ట్ బ్రాడ్.

ఆస్ట్రేలియా తుది జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ హేజిల్‌వుడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.