ETV Bharat / sports

ఐపీఎల్​లో అర్జున్ తెందూల్కర్ తొలి సిక్స్​.. ట్రోల్స్ పట్టించుకోవద్దని బ్రెట్​లీ సలహా !

author img

By

Published : Apr 26, 2023, 9:57 AM IST

మంగళవారం గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో అర్జున్‌ తెందూల్కర్​ తన తొలి సిక్సర్‌ బాదాడు. ఇక ఇదే మ్యాచ్​లో బౌలింగ్‌ చేసిన అర్జున్​ ఓ వికెట్​ కూడా తీశాడు.

arjun tendulkar
arjun tendulkar first sixer

అహ్మదబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో సచిన్​ తనయుడు,ముంబయి ఇండియన్స్‌ ప్లేయర్​ అర్జున్‌ తెందూల్కర్.. తొలి సిక్సర్‌ బాదాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొమ్మిదో నెంబర్‌ ఆటగాడిగా మైదానంలోకి వచ్చిన అర్జున్‌.. మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్సర్​ను బాదాడు. మోహిత్‌ షార్ట్‌ బాల్‌ వేయగా.. అర్జున్‌ డీప్‌స్వ్కేర్‌ దిశగా సిక్సర్‌ కొట్టడం.. ఆ ఓవర్​కే హైలెట్‌గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో అర్జున్.. బౌలింగ్‌లో ఓ వికెట్ తీసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో 9 బంతులలో ఓ భారీ సిక్సర్‌తో పాటు 13 పరుగులను స్కోర్​ చేశాడు.

మరోవైపు ఐపీఎల్​లో ఆడినప్పటి నుంచి అర్జున్‌ కొట్టిన తొలి సిక్సర్​ కూడా ఇదే కావడం విశేషం. బౌలర్‌గా మంచి ప్రదర్శన కనబరిచిన ఈ ప్లేయర్​.. ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ తనదైన శైలిలో ఆడి సిక్సర్లతో అలరించడం వల్ల ఇప్పుడు సచిన్‌ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు. వెంటనే అర్జున్‌ తెందూల్కర్‌కు బ్యాటింగ్‌లోనూ ప్రమోషన్‌ ఇవ్వాలంటూ ఫ్యాన్స్​ అంటున్నారు. అంతే కాకుండా అతనికి మంచి టాలెంట్‌ ఉందని. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపితే ముంబయికి ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.

అర్జున్​ పై ట్రోల్స్​.. సపోర్ట్​ ఇచ్చిన బ్రెట్​ లీ
ముంబయి ఇండియన్స్​ యంగ్ ప్లేయర్​ అర్జున్​ తెందూల్కర్​.. ఇటీవలే పంజాబ్‌తో ఆడిన మ్యాచ్​లో శామ్ కర్రాన్, హర్‌ప్రీత్ సింగ్ ఇద్దరూ అర్జున్ బౌలింగ్‌లో చెలరేగారు. కేవలం ఒక్క ఓవర్లోనే 31 పరుగులను ఈజీగా స్కోర్​ చేశారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు అతన్ని నెట్టింట ట్రోల్​ చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై లెజెండరీ పేసర్ బ్రెట్ లీ స్పందించారు. అర్జున్‌కు మద్దతుగా నిలబడ్డాడు.

"అర్జున్ బౌలింగ్ చూసి నేను చాల ఇంప్రెస్ అయ్యాను. ముంబయి తరఫున అతను మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. కొత్త బంతితో అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముంబయి జట్టులో అందరి కన్నా ఎక్కువగా బంతిని స్వింగ్ చేయగలుగుతున్నాడు. ప్రస్తుతం అతన్ని మిడిల్ ఓవర్లలో వాడుకోవడం బెటర్. అనుభవం పెరిగే కొద్దీ డెత్ ఓవర్లలో కూడా ఇతను బాగా రాణిస్తాడు" అని బ్రెట్ లీ అన్నాడు.

ఇటీవలి కాలంలో నెటిజన్లు ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్​ చేస్తున్నారని మండిపడిన బ్రెట్ లీ.. అర్జున్ కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొంటున్నాడని చెప్పాడు. అర్జున్ బౌలింగ్‌లో వేగం లేదని, నిలకడగా 130 కిలోమీటర్ల వేగంతో కూడా బౌలింగ్ చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై స్పందించిన బ్రెట్ లీ.. ఇలాంటి ట్రోలింగ్‌ను అర్జున్ పట్టించుకోకూడదని సూచించాడు. సచిన్ కూడా తన కెరీర్‌లో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న వాడేనని, కాబట్టి అర్జున్ కూడా వీటిని పట్టించుకోకపోవడమే మంచిదని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.