ETV Bharat / sports

IPL 2023 GT VS MI : చెలరేగిన మిల్లర్‌, అభినవ్‌.. ముంబయిపై టైటాన్స్​ ఘనవిజయం!

author img

By

Published : Apr 25, 2023, 10:55 PM IST

Updated : Apr 26, 2023, 7:16 AM IST

శుభ్‌మన్‌ మెరుపులతో 16 ఓవర్లకు టైటాన్స్‌ స్కోరు 137/4. ఇక 4 ఓవర్లే మిగిలాయి.. 180కి అటు ఇటుగా ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగుస్తుందనిపించింది. కానీ ఆ తర్వాతే అహ్మదాబాద్‌ స్టేడియాన్ని సిక్సర్ల సునామీ ముంచెత్తింది. బంతి బౌండరీలు దాటుతూనే కనిపించింది. అందుకు కారణం.. అభినవ్‌, మిల్లర్‌, తెవాతియా విధ్వంసమే! వీళ్లు ఎడాపెడా సిక్సర్లతో విరుచుకుపడడం వల్ల ఆఖరి 4 ఓవర్లలో 70 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత దిగిన అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం రషీద్‌, అహ్మద్‌ ముంబయిని చుట్టేశారు.దీంతో మంగళవారం జరిగిన మ్యాచ్​లో ముంబయి జట్టుకు ఓటమి తప్పలేదు.

IPL 2023 GT VS MI
IPL 2023 GT VS MI

మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ అయిదో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ఆ జట్టు 55 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసింది. మొదట బరిలోకి దిగిన టైటాన్స్‌.. నిర్దిష్ట 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ మరో అర్ధశతకాన్ని అందుకోగా.. మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌, రాహుల్‌ తెవాతియా విధ్వంసం సృష్టించారు. ముంబయి బౌలర్లలో పియూష్‌ చావ్లా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నూర్‌ అహ్మద్‌ (3/37), రషీద్‌ ఖాన్‌ , మోహిత్‌ శర్మ దెబ్బకు ఛేదనలో ముంబయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులకే పరిమితమైంది. కాగా నేహల్‌ టాప్‌స్కోరర్​గా నిలిచాడు.

ఒక సిక్సర్‌, ఒక ఫోర్‌ (బ్యాటర్‌ సాధించింది), ఒక వికెట్‌.. పవర్‌ప్లేలో ముంబయి జట్టు స్కోర్​ 29/1. ఆరంభమే పేలవంగా మొదలెట్టిన ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్​ను వెనక్కిపంపి ప్రత్యర్థికి హార్దిక్‌ షాకిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన ఇషాన్.. నత్తనడనకగా బ్యాటింగ్‌ కొనసాగించాడు. తాను ఆడిన తొలి 10 బంతుల్లో 2 పరుగులే చేసి.. 12వ బంతికి కానీ బౌండరీ సాధించలేకపోయాడు. ఆ తర్వాత కూడా పేలవ ప్రదర్శనను కొనసాగించిన ఇషాన్‌.. మరిన్ని బంతులు వృథా చేసి రషీద్‌ వలలో చిక్కాడు.

మరోవైపు కార్తీకేయ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రంగంలోకి దిగిన తిలక్‌.. అదే ఓవర్లో రషీద్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడ్డా.. మరో వైపు గ్రీన్‌ పోరాటం సాగించాడు. అయినా 10 ఓవర్లకు 58/3తో నిలిచిన ముంబయి ఓటమి ఖాయమైంది. సాధించాల్సిన రన్‌రేట్‌ 15 దాటడంతో బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించక తప్పలేదు. ఈ క్రమంలో అహ్మద్‌ ఒకే ఓవర్లో గ్రీన్‌తో పాటు డేవిడ్​ను పెవిలియన్​ బాట పట్టించాడు. ఆ తర్వాత దిగిన సూర్యకుమార్‌ మెరుపులు కూడా కాసేపే. అహ్మద్‌ తన తర్వాతి ఓవర్లో రిటర్న్‌ క్యాచ్‌ను డైవ్‌ చేసి పట్టడంతో సూర్య నిష్క్రమించాడు. యువ ఆటగాడు నేహల్‌ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. పోరాడితే పోయేదేముంది అన్నట్లుగా బౌండరీలతో చెలరేగాడు. ఉన్నంత సేపు అలరించిన అతణ్ని.. మోహిత్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఓ సిక్సర్‌తో జోరు ప్రదర్శించిన అర్జున్‌ (13)ను కూడా మోహితే ఔట్‌ చేశాడు. దీంతో ముంబయి అనూహ్యంగా గుజరాత్​ చేతిలో ఓటమిపాలయ్యింది.

ఇదీ చూడండి: IPL 2023 GT VS MI : దంచికొట్టిన గుజరాత్​.. సర్జరీ తర్వాత తొలిసారి స్టేడియంలో బుమ్రా

Last Updated : Apr 26, 2023, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.