ETV Bharat / sports

IPL 2023 MI VS RR : రోహిత్​కు బర్త్​డే గిఫ్ట్​.. ముంబయి సూపర్​ విక్టరీ

author img

By

Published : Apr 30, 2023, 11:01 PM IST

Updated : May 1, 2023, 7:30 AM IST

ఐపీఎల్​ 1000వ మ్యాచ్​కు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​తో ముంబయి ఇండియన్స్​ తలపడింది. ఈ మ్యాచ్​లో్ ముంబయి ఇండియన్స్‌ మురిసింది. రెండు పరాజయాల అనంతరం తిరిగి గెలుపు బాట పట్టింది. టిమ్‌ డేవిడ్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన వేళ ఆసక్తికర పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించింది. యశస్వి జైస్వాల్‌ మెరుపు శతకం వృథా అయింది.

IPL 2023 MI VS RR
IPL 2023 MI VS RR

ముంబయి నిలిచింది. టిమ్‌ డేవిడ్‌ (45 నాటౌట్‌; 14 బంతుల్లో 2×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. యశస్వి జైస్వాల్‌ (124; 62 బంతుల్లో 16×4, 8×6) మెరుపు శతకంతో మొదట రాజస్థాన్‌ 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. డేవిడ్‌తో పాటు సూర్యకుమార్‌ (55; 29 బంతుల్లో 8×4, 2×6), గ్రీన్‌ (44; 26 బంతుల్లో 4×4, 2×6), తిలక్‌ వర్మ (29 నాటౌట్‌) మెరవడంతో లక్ష్యాన్ని ముంబయి 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్‌లో ఇది 1000వ మ్యాచ్‌ కావడం విశేషం.

డేవిడ్‌ ధనాధన్‌..
భారీ ఛేదనలో రోహిత్‌ (3) విఫలమైనా, మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (28) బ్యాట్‌ ఝుళిపించలేకపోయినా.. గ్రీన్‌, సూర్య మెరుపులతో ముంబయి 10 ఓవర్లలో 98/2తో నిలిచింది. ఆ తర్వాత గ్రీన్‌ నిష్క్రమించినా సూర్య జోరు కొనసాగించాడు. అతడికి తిలక్‌ వర్మ అండగా ఉండడంతో ముంబయి 14 ఓవర్లలో 141/3తో రేసులో నిలిచింది. చివరి 6 ఓవర్లలో 72 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ 16వ ఓవర్లో సూర్య ఔట్‌ కావడంతో ముంబయి ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. రాజస్థాన్‌ పైచేయి సాధించినట్లే అనిపించింది. కానీ టిమ్‌ డేవిడ్‌, తిలక్‌ పోరాడారు. ధాటిగా ఆడారు. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా డేవిడ్‌ చెలరేగిపోయాడు. హోల్డర్‌ వేసిన తొలి మూడు బంతుల్లో సిక్స్‌లు బాది ముంబయికి విజయాన్నందించాడు. డేవిడ్‌, తిలక్‌ అభేద్యమైన అయిదో వికెట్‌కు 23 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. హోల్డర్‌ 3.3 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు.

శతక్కొట్టిన యశస్వి:
రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ యశస్వి జైస్వాల్‌ ఆటే హైలైట్‌. మెరిసింది అతడొక్కడే. మరోవైపు నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. అతడు ఒంటి చేత్తో జట్టుకు భారీ స్కోరును అందించాడు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ తర్వాత అత్యధిక స్కోరు ఎక్స్‌ట్రాల (25)దే కావడం విశేషం. ఇక బ్యాటర్లలో 18 పరుగుల చేసిన బట్లరే రెండో టాప్‌ స్కోరర్‌ అంటే.. జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన జైస్వాల్‌ ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మెరిడిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదేశాడు.

మరోవైపు బట్లర్‌ ఎదుర్కొన్న ఎనిమిదో బంతికి గానీ ఖాతా తెరవలేకపోయాడు. కానీ ఆ తర్వాత జైస్వాల్‌కు సహకరించాడు. ఎనిమిదో ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 72. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పది బంతుల కంటే ఎక్కువ నిలవకున్నా.. జైస్వాల్‌ చక్కని బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. శాంసన్‌ (14), పడిక్కల్‌ (2), హోల్డర్‌ (11), హెట్‌మయర్‌ (8), జురెల్‌ (2) విఫలమయ్యారు. 32 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్న జైస్వాల్‌.. 53 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేయడం విశేషం. అతడి దూకుడుతో చివరి 5 ఓవర్లలో రాయల్స్‌ 69 పరుగులు రాబట్టింది. జైస్వాల్‌ ఆఖరి ఓవర్లో వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో జైస్వాల్‌కు ఇదే తొలి సెంచరీ. యశస్వి ఔటైన బంతి నోబాల్‌లా కనిపించినా.. ఔటివ్వడం వివాదాస్పదమైంది.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ :
యశస్వి (సి) అండ్‌ (బి) అర్షద్‌ 124; బట్లర్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) చావ్లా 18; శాంసన్‌ (సి) తిలక్‌ (బి) అర్షద్‌ 14; పడిక్కల్‌ (బి) చావ్లా 2; హోల్డర్‌ (సి) డేవిడ్‌ (బి) ఆర్చర్‌ 11; హెట్‌మయర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అర్షద్‌ 8; జురెల్‌ (సి) తిలక్‌ (బి) మెరిడిత్‌ 2; అశ్విన్‌ నాటౌట్‌ 8; బౌల్ట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 25 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 212; వికెట్ల పతనం: 1-72, 2-95, 3-103, 4-143, 5-159, 6-168, 7-205; బౌలింగ్‌: గ్రీన్‌ 3-0-31-0; ఆర్చర్‌ 4-0-35-1; మెరిడిత్‌ 4-0-51-1; చావ్లా 4-0-34-2; కార్తికేయ 2-0-14-0; అర్షద్‌ 3-0-39-3

ముంబయి ఇన్నింగ్స్‌ :
రోహిత్‌ (బి) సందీప్‌ 3; ఇషాన్‌ (సి) బౌల్ట్‌ (బి) అశ్విన్‌ 28; గ్రీన్‌ (సి) బౌల్ట్‌ (బి) అశ్విన్‌ 44; సూర్యకుమార్‌ (సి) సందీప్‌ (బి) బౌల్ట్‌ 55; తిలక్‌ నాటౌట్‌ 29; డేవిడ్‌ నాటౌట్‌ 45; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 214; వికెట్ల పతనం: 1-14, 2-76, 3-101, 4-152; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-43-1; సందీప్‌ 4-0-35-1; అశ్విన్‌ 4-0-27-2; చాహల్‌ 3-0-32-0; హోల్డర్‌ 3.3-0-55-0; కుల్‌దీప్‌ సేన్‌ 1-0-20-0

Last Updated : May 1, 2023, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.