ETV Bharat / sports

IPL 2022: అదరగొట్టిన హార్దిక్​.. గుజరాత్​ ఖాతాలో మరో విజయం..

author img

By

Published : Apr 14, 2022, 11:35 PM IST

IPL 2022
rr vs gt

IPL 2022: ఐపీఎల్​ 2022లో కొత్త జట్టు గుజరాత్​ టైటాన్స్​ అదరగొడుతోంది. రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో​ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

IPL 2022: టీ20 మెగా టోర్నీలో గుజరాత్ జట్టు హవా కొనసాగుతోంది. 193 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. దీంతో 37 పరుగుల తేడాతో రాజస్థాన్‌ని ఓడించిన గుజరాత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్‌ జోస్ బట్లర్ (54 : 24 బంతుల్లో 8×4, 3×6) మినహా మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. షిమ్రోన్ హెట్‌మయర్‌ (29), రియాన్ పరాగ్‌ (18), జేమ్స్‌ నీషమ్‌ (17), సంజూ శాంసన్‌ (11) పరుగులు చేశారు. మరో ఓపెనర్‌ దేవ్‌దత్ పడక్కల్ (0) డకౌట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (8), రస్సీ వాండర్‌ డస్సెన్ (6), యుజ్వేంద్ర చాహల్ (5) విఫలమయ్యారు. ప్రసిద్ధ్‌ కృష్ణ (4), కుల్దీప్ సేన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌, యశ్ దయాల్ మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమి, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్ పడగొట్టారు.

మొదట బ్యాటింగ్​ చేసిన గుజరాత్ జట్టు దంచికొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (87 : 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో సత్తా చాటాడు. అభినవ్ మనోహర్ (43 : 28 బంతుల్లో 4×4, 2×6), డేవిడ్ మిల్లర్‌ (31 : 14 బంతుల్లో 5×4, 1×6) ధాటిగా ఆడారు. మాథ్యూ వేడ్ (12), శుభ్‌మన్‌ గిల్‌ (13), విజయ్‌ శంకర్‌ (2) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్‌ తలో వికెట్ పడగొట్టారు.

ఇదీ చదవండి: హైఓల్టేజ్ మ్యాచ్.. రాజస్థాన్ జోరుకు గుజరాత్ బ్రేకులు వేస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.