ETV Bharat / sports

ధర రూ.10 కోట్లకుపైనే.. అంచనాలు అందుకోలేక..!

author img

By

Published : Apr 23, 2022, 9:01 PM IST

IPL 2022 highest paid player
ఐపీఎల్​లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు

IPL 2022 highest paid player: ఐపీఎల్​ మెగా లీగ్​ 15వ సీజన్​ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సగం సీజన్​ పూర్తవడానికి వచ్చింది. అయితే.. ఈసారి జరిగిన మెగా వేలంలో భారీ ధర పలికిన కొందరు ఆటగాళ్లు అంచనాలు అందుకోలేకపోతున్నారు. మైదానంలో ఒత్తిడికి చిత్తవుతున్నారు. తమ ధరకు తగిన మేటి ప్రదర్శనలు చేయలేకపోతున్న ఆటగాళ్లపై ప్రత్యేక కథనం.

IPL 2022 highest paid player: భారత టీ20 లీగ్‌లో ఎప్పుడు వేలం జరిగినా కొందరు ఆటగాళ్లు ఊహించని ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. దాంతో వారిపై భారీ అంచనాలు నెలకొంటాయి. అయితే.. వీరిలో కొందరు మైదానంలో ఒత్తిడికి చిత్తవుతున్నారు. తాము తీసుకునే సొమ్ముకు న్యాయం చేయలేక తంటాలు పడుతున్నారు. అలా ఈ సీజన్‌లో భారీ ధర పలికినా.. సగం సీజన్‌ పూర్తవడానికి వచ్చినా.. ఇంకా మేటి ప్రదర్శనలు చేయలేక ఇబ్బందులు పడుతున్న ఆటగాళ్లెవరంటే..

ఇషాన్‌ ఒత్తిడికి చిత్తు‌: ముంబయి ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ ఈ సీజన్‌లో రూ.15.25 కోట్లతో అందరి కన్నా అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కొంత కాలంగా ఆ జట్టు తరఫున రాణిస్తుండటంతో మెగా వేలంలోనూ ముంబయే మళ్లీ కొనుగోలు చేసింది. అతడిపై నమ్మకం ఉంచి ఎవరూ ఊహించని ధరకు తీసుకుంది. అయితే, ఇప్పుడది ఆ జట్టుకు బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. ఇషాన్‌ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 31.83 సగటుతో 191 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. కానీ, అతడి ఆటలో మునుపటి మెరుపు కనిపించడం లేదు. ఇప్పుడు ఆడుతున్న తీరు మరీ తీసిపారేయాల్సిన విధంగా లేకున్నా తీసుకునే సొమ్ముకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు.

IPL 2022 highest paid player
ఇషాన్‌ కిషన్‌

శ్రేయస్‌ ఓకే కానీ‌: దిల్లీ మాజీ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సీజన్‌లో భారత్‌ తరఫున మూడో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. అతడి బ్యాటింగ్‌, కెప్టెన్సీ తీరు నచ్చిన కోల్‌కతా మెగా వేలంలో రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో గతేడాది ఫైనల్లో మిస్సైన మూడో కప్పును ఈసారి తెచ్చిపెడతాడనే ఆశ పెట్టుకుంది. కానీ, శ్రేయస్‌ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నా.. కెప్టెన్‌గా తడబడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 39.33 సగటుతో 236 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు నమోదు చేశాడు. అయితే, కెప్టెన్‌గా మూడు మ్యాచ్‌ల్లోనే కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. మరో నాలుగింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో జట్టును ఏడో స్థానంలో కొనసాగిస్తున్నాడు.

IPL 2022 highest paid player
శ్రేయస్‌ అయ్యర్‌

హర్షల్‌ పసలేదు: గతేడాది 32 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన హర్షల్‌ పటేల్‌ ఈసారి ఏమాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్న బెంగళూరుకు కాస్త నిరాశే కలిగిస్తున్నాడు. మెగా వేలంలో రూ.10.75 కోట్లకు దక్కించుకొని మళ్లీ అవకాశం ఇచ్చినా ఆ జట్టుకు తన నుంచి కావాల్సిన వికెట్లు దక్కడం లేదు. ఇప్పటివరకు అతనాడిన ఆరు మ్యాచ్‌ల్లో 8 వికెట్లే తీసి ఏదో నెట్టుకొస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అత్యుత్తమ బౌలింగ్‌ 11/2 ఉండగా.. 7.29 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్‌ చేయడం ఒక్కటే ఊరటనిచ్చే విషయం. అయితే, అతడు మరిన్ని వికెట్లు సాధిస్తే బెంగళూరు విజయాలకు మరింత కలిసొచ్చే వీలుంది. దీంతో హర్షల్‌ బౌలింగ్‌ ఇప్పుడు అంతంత మాత్రంగానే అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే హర్షల్‌ దక్కించుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోయినట్లే.

IPL 2022 highest paid player
హర్షల్‌ పటేల్‌

శార్దూల్‌ కష్టమే: ఇంతకుముందు చెన్నై ఆల్‌రౌండర్‌గా ఆ జట్టు విజయాల్లో కీలక సేవలు అందించిన శార్దూల్ ఠాకూర్‌ ఈసారి దిల్లీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. బౌలింగ్‌లో అలా వచ్చి ఇలా వికెట్లు తీసిపెట్టడం, బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించ గల సత్తా ఉండటంతో మెగా వేలంలో దిల్లీ రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అయితే, ఈ సీజన్‌లో అతడు ఆ జట్టుకు పెద్దగా ఉపయోగపడుతున్నట్లుగా అనిపించడం లేదు. అందుకు శార్దూల్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ ప్రదర్శనలే కారణం. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 30/2 అత్యుత్తమ గణాంకాలు. ఎకానమీ కూడా 9.60గా ఉంది. దీంతో అటు పరుగులు ఆపలేక, వికెట్లు తీయలేక తంటాలు పడుతున్నాడు. మొత్తంగా బంతితో 4 వికెట్లు తీసిన శార్దూల్‌.. బ్యాట్‌తో 80 పరుగులే చేశాడు. దీంతో సగం సీజన్‌ పూర్తయ్యేసరికి ఏమాత్రం ప్రభావం చూపించడం లేదనిపిస్తోంది.

IPL 2022 highest paid player
శార్దూల్ ఠాకూర్‌

ప్రసిద్ధ్‌ ఫర్వాలేదు: ఇదివరకు కోల్‌కతా జట్టులో మంచి పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ్‌ కృష్ణ ఇప్పుడు రాజస్థాన్‌ జట్టుకు ఆడుతున్నాడు. అతడి బౌలింగ్‌లోని వైవిధ్యం నచ్చిన ఆ జట్టు మెగా వేలంలో రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఫర్వాలేదనిపిస్తున్నా అతడు దక్కించుకున్న ధరకు న్యాయం చేయలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసిన అతడు 3/22 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఎకానమీ కూడా 8.14 మునుపటి సీజన్‌తో పోలిస్తే బాగుందనె చెప్పాలి. కానీ, అతడు మరిన్ని వికెట్లు తీసిపెడితే రాజస్థాన్‌కు తిరుగుండదు.

IPL 2022 highest paid player
ప్రసిద్ధ్‌ కృష్ణ

ఇదీ చూడండి: 'మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు?'.. పంత్‌, ఆమ్రేపై పీటర్సన్‌ ఫైర్‌

ఇర్ఫాన్ పఠాన్-​ అమిత్​ మిశ్రా ట్విట్టర్​ వార్​.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.