ETV Bharat / sports

బెంగళూరు, రాజస్థాన్‌ మ్యాచ్‌పై ఎవరేమన్నారంటే?

author img

By

Published : Apr 23, 2021, 10:33 AM IST

ముంబయి వేదికగా రాజస్థాన్ రాయల్స్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఘనవిజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు టీమ్​ వికెట్​ నష్టపోకుండా రాజస్థాన్​ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే ఈ మ్యాచ్​లో ఆర్సీబీ ఓపెనర్ దేవదత్​ పడిక్కల్​ సెంచరీతో అలరించాడు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ఎమన్నారో తెలుసుకుందాం.

Comments on RCB Vs RR Match
ఆర్సీబీ వర్సెస్​ రాజస్థాన్​ రాయల్స్​

పోటీ ఇస్తుందనుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ విన్యాసాల ముందు చిన్నబోయింది. కష్టపడి సాధించిన 177 పరుగులు కోహ్లీసేనకు ఏ మాత్రమూ సరిపోలేదు. దేవ్‌దత్‌, కోహ్లీ కదంతొక్కడం వల్ల 16.3 ఓవర్లకే మ్యాచ్‌ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల అభిప్రాయాలు..

ఈ సెంచరీ ప్రత్యేకం.. దేవ్‌దత్‌ పడిక్కల్‌

"ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. కొవిడ్‌ బారినుంచి బయటపడి ఆడటం నా మొదటి లక్ష్యం. తొలి మ్యాచ్‌లో ఆడలేకపోవడం వల్ల చాలా బాధపడ్డా. ఈ మ్యాచ్‌లో వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మంచి భాగస్వామ్యం ఏర్పడితే బాగుంటుంది. పని సులభం అవుతుంది. సెంచరీ ముందు పెద్దగా ఒత్తిడికి లోనవలేదు. అంతిమ లక్ష్యం మ్యాచ్‌ గెలవడమే. నాకు సెంచరీతో అంత ముఖ్యం కాదు. మా మధ్య స్పష్టమైన అవగాహన ఉంది. మేం బాగా ఆడుతున్నామని మాకు తెలుసు.. ఒక్కొక్కరం ఒక్కోసారి గేర్‌ మార్చి ఆడుతుంటాం. అయితే స్ట్రైక్​ రొటేట్‌ చేయడం ప్రధానం. మ్యాచ్‌ నెగ్గడం ఆనందంగా ఉంది".

పడిక్కల్‌ బ్యాటింగ్‌ అద్భుతం.. విరాట్‌ కోహ్లీ

"ఈ మ్యాచ్‌లో దేవ్‌దత్‌ బ్యాటింగ్‌ చాలా బాగుంది. గత సీజన్‌లోనూ చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. ఇప్పడు కూడా మంచి ఫాం కనబరుస్తున్నాడు. అతడికి గొప్ప భవిష్యత్‌ ఉంది. మ్యాచ్‌లో 50 పరుగుల తర్వాత వేగం పెంచాలని అనుకున్నాం. అలాగే చేశాం. టీ20 అంటేనే బ్యాటింగ్ భాగస్వామ్యాలు కొనసాగించడం. ఒకరు ధాటిగా ఆడితే మరొకరు స్ట్రైక్​ రొటేట్‌ చేయాలి. నేను చివరి వరకు క్రీజులో ఉండాలనే ఉద్దేశంతో బ్యాటింగ్‌ చేశా. పడిక్కల్‌ సెంచరీకి ఏ ఆరాటం ప్రదర్శించలేదు. మ్యాచ్‌ ముగించేయమని చెబుతూ ఉన్నాడు. అయితే అది అతడి సెంచరీ అయ్యాకే అని చెప్పా. అతడి ఇన్నింగ్స్‌ సెంచరీతో పరిపూర్ణం అయింది. మా బౌలింగ్‌ దాడి మెరుగుపడుతోంది. స్టార్‌ బౌలర్లు పెద్దగా లేకపోయినా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. డెత్‌ ఓవర్లలో మా ఆట బాగుంది. ఈ మ్యాచ్‌లో మేము 30 పరుగులు కట్టడి చేశామని అనుకుంటున్నాను. ఇదే ఆటతీరు కొనసాగిస్తాం".

ఈ మ్యాచ్‌ కనులవిందు.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌

"ఈ మ్యాచ్‌ చూడటానికి చాలా బాగుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు పక్కా ప్రణాళికతో సాగింది. నాకు బ్యాటింగ్‌ అవకాశమే రాలేదు. ఎదురు చూస్తూ ఉండిపోయా. జట్టు పరంగా ఎప్పుడూ రాజీపడేదిలేదు. మరింత బాగా ఆడటానికే ప్రయత్నిస్తాం. పడిక్కల్‌తో కలిసి ఆడే అవకాశం రాలేదు. అతని బ్యాటింగ్‌ నైపుణ్యం బాగుంది. మంచి బ్యాట్‌ స్వింగ్‌ ఉంది. కొవిడ్‌ తర్వాత ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం అసాధారణం".

మా బ్యాటింగ్‌ను సమీక్షించుకోవాలి.. సంజూ శాంసన్‌

"ఈ మ్యాచ్‌లో త్వరగా వికెట్లు కోల్పోయినా మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ ఆదుకున్నారు. గౌరవప్రదమైన స్కోరు సాధించాం. అయితే అది సరిపోలేదు. బెంగళూరు బ్యాటింగ్ చాలా బాగుంది. వికెట్‌ కోల్పోకుండా ఛేదించారు. మేం మా తప్పులను దిద్దుకోవాల్సి ఉంది. మరింత సాధన చేయాలి. బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. పుంజుకోవడం మాకు అలవాటే. ఓటమి ఎదురైతే గెలిచే వరకు పోరాడుతూనే ఉండాలి. ఇదంతా క్రికెట్‌లో సహజం".

ఇదీ చూడండి.. ఒలింపిక్స్​లో వాటికి చోటులేదు: ఐఓసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.