ETV Bharat / sports

ఆ రోజు నా తప్పేం లేదు.. కోహ్లీయే గొడవపడ్డాడు: నవీనుల్‌ హక్‌

author img

By

Published : Jun 15, 2023, 9:43 PM IST

Virat Kohli Naveen Ul Haq : ఐపీఎల్‌ 2023లో విరాట్‌ కోహ్లీతో తనకు జరిగిన గొడవపై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ స్పందించాడు. ఆ రోజు గొడవపడింది కోహ్లీయేనని.. తన తప్పేం లేదని చెప్పుకొచ్చాడు.

Etv Bharat
Etv Bharat

Virat Kohli Naveen Ul Haq : ఐపీఎల్​ 16వ సీజన్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీకి, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ నవీనుల్‌ హక్‌కు మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే చర్చ సాగింది. ఇరు జట్లకు చెందిన అభిమానులు కూడా పోటాపోటీగా కామెంట్లు, మీమ్స్‌తో నెట్టింట హల్‌చల్‌ చేశారు. కోహ్లీ తన షూను చూపిస్తూ తిట్టడం నవీనుల్‌కు ఆగ్రహం తెప్పించింది. మ్యాచ్‌ తర్వాత కూడా కోహ్లీతో గొడవపడ్డాడు. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన నవీనుల్‌హక్‌ ఆ విషయంపై స్పందించాడు.

'గొడవను కోహ్లీయే ఫస్ట్​ ప్రారంభించాడు'
ఆ రోజు గొడవను కోహ్లీయే తొలుత ప్రారంభించినట్లు నవీనుల్ చెప్పాడు. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా కోహ్లీయే తనను దూషించినట్లు తెలిపాడు. తాను ప్రతిఘటించడంలో ఏ మాత్రం తప్పులేదని చెప్పుకొచ్చాడు. ఇద్దరికీ వేసిన ఫైన్లను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని చెప్పాడు. వీరిద్దరి మధ్య గొడవ వివాదాస్పదమవ్వడంతో క్రికెట్‌ బోర్డు వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కోహ్లీకీ మ్యాచ్‌ ఫీజు మొత్తాన్ని కోతవేయగా.. నవీనుల్‌ హక్‌కు సగం మేర కోత విధించింది.

'నేను కూడా మనిషినే.. నాకూ పౌరుషం ఉంటుంది'
"మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా కోహ్లీ ప్రవర్తన అస్సలు బాగోలేదు. మ్యాచ్‌ తర్వాత ఇద్దరం షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నాం. ఆ సమయంలో కోహ్లీ నా చేతిని బలంగా షేక్‌ చేశాడు. నేను కూడా మనిషినే. నాకూ పౌరుషం ఉంటుంది. అందుకే ప్రతిఘటించాను. అందులో నా తప్పేం లేదు. సాధారణంగా నేనెవర్నీ నిందించాలనుకోను. ఒక వేళ నిందించినా.. నేను బౌలింగ్‌ చేస్తున్నప్పుడు మాత్రమే.. అది కూడా కేవలం బ్యాటర్లనే నిందిస్తాను. ఆ మ్యాచ్‌లో నేను ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎవర్నీ నిందించలేదు. ఆ విషయాన్ని మైదానంలో ఉన్న వాళ్లంతా చూశారు" అని నవీనుల్‌ హక్‌ పేర్కొన్నాడు. తనకు సాధారణంగా ఎవరిపైనా కోపం రాదని, కానీ, ఆ మ్యాచ్‌ తర్వాత తన చేతులను గట్టిగా షేక్‌ చేయడంతోనే తనకు కోపం వచ్చిందని చెప్పాడు. ముందుగా గొడవ పెట్టుకున్నది కోహ్లీయేనని అన్నాడు.

కోహ్లీ, నవీన్​కు జరిమానా
ఆ గొడవ తర్వాత ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లఖ్​నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్​తో పాటు ఆర్సీబీ బ్యాటర్​ విరాట్​ కోహ్లీపై జరిమానా విధించింది ఐపీఎల్​ యాజమాన్యం. ఈ మేరకు ట్వీట్​ చేసిన ఐపీఎల్​.. వారి మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించింది. లఖ్​నవూ ప్లేయర్​ నవీన్​ ఉల్​ హక్​పై కూడా 50 శాతం ఫైన్​ విధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.