ETV Bharat / sports

ఐపీఎల్‌ 2023కు ముందు గుజరాత్‌కు గుడ్ న్యూస్.. నెం.1గా రషీద్​

author img

By

Published : Mar 30, 2023, 9:08 AM IST

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అప్ఘానిస్తాన్​ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ అదరగొట్టాడు. రీసెంట్​గా పాకిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసిన ఈ లెగ్‌ స్పిన్నర్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ వివరాలు..

Rashid Khan
ఐపీఎల్‌ 2023కు ముందు గుజరాత్‌కు గుడ్ న్యూస్

మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​​ 16వ సీజన్​ కోసం అంతా సిద్ధమైపోయింది. అయితే గత సీజన్​లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్​కు.. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఓ అదిరిపోయే వార్త అందింది. తాజాగా టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్‌లో ఆ జట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. రీసెంట్​గా పాకిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి ఈ మార్క్​ను అందుకున్నాడు. లంక మిస్టరీ స్పిన్నర్​ వనిందు హసరంగాను అధిగమించి తొలి ర్యాంకును సాధించాడు. మెగాటోర్నీ 2023కి రెండు రోజుల మందుకు అతడు ఈ ఘనత సాధించడం విశేషం. దీంతో అతడు ఈ సీజన్​లో తన బంతితో ఎలాంటి మ్యాజిక్​ చూపిస్తాడా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, గతంలోనూ 2018లో టీ20 ఫార్మాట్​లో రషీద్ తొలిసారి నెంబర్​ వన్ బౌలర్‌గా నిలిచాడు. గత సీజన్​లో గుజరాత్ టైటాన్స్​ ట్రోఫీని ముద్దాడడంలో కీలకంగా వ్యవహరించాడు రషీద్​ ఖాన్​. అప్పుడు మొత్తంగా 16 మ్యాచులు ఆడిన అతడు 19వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ గ్రాండ్ లీగ్‌లో అతడు ఇప్పటివరకు మొత్తం 92 మ్యాచ్‌లు ఆడి.. 6.38 ఎకానమీతో 112 వికెట్లు తీశాడు.

కాగా, షార్జా వేదికగా పాకిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్‌లో రషీద్‌ ఖాన్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. చాలా పొదుపుగా బౌలింగ్‌ వేశాడు. మొత్తం మూడు మ్యాచ్‌ ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్​లో ఒక వికెట్‌ తీసిన అతడు.. రెండో టీ20లోనూ ఓ వికెట్​ తీశాడు. ఇక చివరి మూడో టీ20లోనూ ఓ వికెట్‌ పడగొట్టాడు. అలా ఈ ప్రదర్శనతో తాజా టీ20 ర్యాంకింగ్స్​లో 710 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అప్ఘానిస్థాన్​కు చెందిన మరో ప్లేయర్​ పేసర్‌ ఫజల్‌ హక్‌ ఫారూకీ.. మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు పాక్‌తో జరిగిన సిరీస్‌లో 5 వికెట్లు తీసి టాప్‌-5లోకి దూసుకొచ్చాడు. ఇతడు ఐపీఎల్​ తాజా సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతడి ప్రదర్శనతో కూడా సన్​రైజర్స్​కు మంచి బూస్టప్​ వచ్చినట్టైంది.ఇక అప్ఘన్​కు చెందిన మిస్టరీ స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ కూడా ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు.

మొత్తంగా తాజా ర్యాంకింగ్స్​లో రషీద్‌ ఖాన్‌(అఫ్గానిస్తాన్‌- 710 పాయింట్లు), వనిందు హసరంగ(శ్రీలంక- 695 పాయింట్లు), ఫజల్‌హక్‌ ఫారూకీ(అఫ్గనిస్తాన్‌- 692 పాయింట్లు), జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా- 690 పాయింట్లు), ఆదిల్‌ రషీద్‌(ఇంగ్లాండ్​-684 పాయింట్లు) తొలి ఐదు స్థానాల్లో నిలిచారు.

రషీద్​ 500 వికెట్లు.. స్టార్ బౌలర్ రషీద్ ఖాన్.. రీసెంట్​గా ఓ అరుదైన ఘనత కూడా సాధించాడు. టీ20 ఫార్మాట్ లో 500 వికెట్ల మార్క్​ను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్​లో ప్రిటోరియా క్యాపిటల్స్- ముంబయి కేప్ టౌన్ మధ్య జరిగిన మ్యాచ్​లో తన 500వ వికెట్​ను తీశాడు రషీద్​.

ఇదీ చూడండి: 'సచిన్​ తెందూల్కర్​ ముఖ్యమంత్రి కావాలి'.. ఐస్​క్రీం వ్యాపారి వినూత్న ప్రచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.